‘గెస్ట్‌’గా వచ్చేస్తున్న స్టార్‌ హీరోలు! | Sakshi
Sakshi News home page

‘గెస్ట్‌’గా వచ్చేస్తున్న స్టార్‌ హీరోలు!

Published Sun, Mar 5 2023 12:17 AM

Top heroes who rocked in guest roles - Sakshi

ఒక స్టార్‌ సినిమాలో మరో స్టార్‌ కనిపిస్తే..  ఇద్దరు స్టార్స్‌ ఫ్యాన్స్‌కి పండగే పండగ. అలా కాకుండా ఓ మామూలు బడ్జెట్‌ సినిమాలో ఒక స్టార్‌ గెస్ట్‌గా కనిపించినా ఆ స్టార్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతారు. ఇలా ఫ్యాన్స్‌ పండగ చేసుకునే ‘గెస్ట్‌’ రోల్స్‌లో కొందరు స్టార్స్‌ కనిపించనున్నారు. ఈ ‘స్టార్‌ గెస్ట్‌’ల గురించి తెలుసుకుందాం. 

గ్రౌండ్‌లో తలైవర్‌ 
క్రికెట్‌ గ్రౌండ్‌లో అతిథిగా ‘లాల్‌ సలామ్‌’  అంటున్నారు తలైవర్‌ (నాయకుడు) రజనీకాంత్‌. తమిళ హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్‌ ముఖ్య తారలుగా రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘లాల్‌ సలామ్‌’. క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో రజనీకాంత్‌ గెస్ట్‌ రోల్‌ చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో రజనీకాంత్‌కు చెల్లెలి పాత్రలో నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్‌ నటించనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. 

అతిథిగా ఖైదీ
‘జైలర్‌’ కోసం రజనీకాంత్‌కు గెస్ట్‌ అయ్యారు మోహన్‌లాల్‌. రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘జైలర్‌’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ గెస్ట్‌ రోల్‌ చేశారు. ఇందులో ఆయన ఓ ఖైదీ పాత్రలో కనిపిస్తారట. ఆల్రెడీ మోహన్‌లాల్‌ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ కూడా పూర్తయింది. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కానుంది.  

భాయ్‌కి గెస్ట్‌ 
సిల్వర్‌ స్క్రీన్‌పై సల్మాన్‌ భాయ్‌కి గెస్ట్‌ అయ్యారు రామ్‌చరణ్‌. సల్మాన్‌ ఖాన్, వెంకటేశ్, పూజా హెగ్డే, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’. ఫర్హాద్‌ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రంజాన్‌ సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ ఓ గెస్ట్‌ రోల్‌ చేశారు. సల్మాన్‌ ఖాన్, వెంకటేశ్‌లపై చిత్రీకరించిన ఓ పాటలో రామ్‌చరణ్‌ గెస్ట్‌గా కనిపిస్తారు. 

నిర్మాతే అతిథి! 
సూర్య కెరీర్‌లో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశమే హద్దురా..!) ఒకటి. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీలో రీమేక్‌ అవుతోంది. బాలీవుడ్‌ కిలాడి అక్షయ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్నారు. ఒరిజినల్‌ వెర్షన్‌ను  తెరకెక్కించిన సుధానే హిందీ రీమేక్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ వెర్షన్‌లో హీరోగా నటించిన సూర్య హిందీ రీమేక్‌కి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు... ఈ రీమేక్‌లో సూర్య ఓ గెస్ట్‌ రోల్‌ కూడా చేశారు. 

కబ్జా కోసం... 
ఉపేంద్ర ‘కబ్జా’కు సాయం చేశారు శివ రాజ్‌కుమార్‌. ఉపేంద్ర, సుదీప్, శ్రియ ప్రధాన పాత్రల్లో  నటించిన పీరియాడికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘కబ్జా’. ఆర్‌. చంద్రు దర్శకత్వం  వహించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్‌ శివరాజ్‌కుమార్‌ ఓ గెస్ట్‌ రోల్‌ చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.   ఇలా ‘స్టార్‌ గెస్ట్‌’ లిస్ట్‌లో మరికొందరు స్టార్స్‌ ఉన్నారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement