
సాక్షి, హైదరాబాద్: సినీ కార్మికులకు వేతనాలు పెంచే ప్రసక్తే లేదని చిన్న నిర్మాతలు తేల్చి చెప్తున్నారు. గురువారం (ఆగస్టు 7) నాడు ఫిలిం ఛాంబర్‌లో ప్రముఖ ప్రొడ్యూసర్ సి. కల్యాణ్‌తో చిన్న నిర్మాతలు సమావేశమయ్యారు. 30% వేతనాలు పెంచాలన్న కార్మికుల డిమాండ్లపై చర్చించారు. అనంతరం కల్యాణ్ మాట్లాడుతూ.. చిన్న చిత్రాలు లేకపోతే ఉపాధి లేదు. చిన్న నిర్మాతలు ఎవరితోనైనా పని చేయించుకోవచ్చు. చిన్న సినిమాలకు వేతనాల పెంపు వర్తించదు. ఒక్క పైసా కూడా పెంచేందుకు వారు సిద్ధంగా లేరు. అలా అని కార్మికులను ఇబ్బంది పెట్టాలని ఏ నిర్మాత అనుకోరు అని చెప్పుకొచ్చాడు.
మా బాధ అర్థం చేసుకోరా?
30 శాతం వేతనాలు పెంచాలని సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ నెరవేరేవరకు షూటింగ్స్‌లో పాల్గొనేది లేదంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (Telugu Film Industry Employees Federation) బంద్ ప్రకటించింది. సమ్మె ఫలితంగా మూడురోజులుగా టాలీవుడ్‌లో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నేడు నాలుగోరోజు సమ్మె కొనసాగుతోంది. సమ్మె మొదలై నాలుగు రోజులవుతున్నా మా బాధ అర్థం చేసుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. నెలలో 10 రోజులు మాత్రమే ఉపాధి ఉంటుందని, సరైన వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాన్ ఇండియా సినిమాలకు పని చేయించుకుంటున్నారని, సకాలంలో జీతాలు ఇవ్వట్లేదని వాపోయారు.
చదవండి: నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మిని ఆటాడుకున్న అల్లు అర్హ