ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏం జరుగుతుందో అంతా చూస్తూనే ఉన్నారు. థియేటర్లు రన్ చేస్తున్న ఎగ్జిబిటర్లు.. సింగిల్ స్క్రీన్లలో రెంట్ పద్ధతికి బదులు పర్సంటేజీ ఇవ్వాలని పట్టుబడుతుండగా.. నిర్మాతలేమో ఇప్పటికిప్పుడు అంటే కష్టం, తర్వాత చూసుకుందాం అనే రీతిలో మాట్లాడుతున్నారు. అయితే సమస్య పరిష్కరించుకోవడం సంగతి పక్కనబెట్టి ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునేంత వరకు వచ్చారు. అసలు ఈ వ్యవహారంలో ప్రేక్షకులు ఎవరివైపు ఉన్నారు?
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా)
నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మధ్య జరుగుతున్న వివాదం గురించి చాలామంది ప్రేక్షకులు సరిగా తెలియదు. సింపుల్‌గా దాని గురించి చెప్పుకోవాలంటే ఓ మూవీని తీసిన నిర్మాత.. దాన్ని ఓ థియేటర్‌లో ప్రదర్శించుకునేందుకు ఎగ్జిబిటర్ అనే వాడికి కొంత మొత్తం చెల్లిస్తాడు. అయితే సింగిల్ స్క్రీన్స్‌లో మూవీ వేసినందుకు అద్దె చెల్లిస్తుండగా.. మల్టీప్లెక్స్‌లో మాత్రం వచ్చిన డబ్బుల్లో పర్సంటేజీ చెల్లిస్తున్నాడు. అయితే ఇలా వేర్వేరుగా కాకుండా అందరికీ ఒకేలా పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు ఇప్పుడు అంటున్నారు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం తొలుత ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టి తమ బాధలు చెప్పుకోగా తర్వాతి రోజు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున కొందరు నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి తమ వాదన వినిపించారు.
ఇన్నాళ్లు వాళ్లవరకే పరిమితమైన సమస్యని ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కలిసి అందరి ముందు పెట్టారు. ఇక్కడివరకు బాగానే ఉంది గానీ నిర్మాత నాగవంశీ.. ఆసియన్ సునీల్‌ని ఉద్దేశిస్తూ మల్టీప్లెక్స్‌లు ఎక్కువగా ఉన్న ఈయనకు సింగిల్ స్క్రీన్ బాధలేం తెలుస్తాయని అన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చిన సునీల్.. నాగవంశీని ఉద్దేశిస్తూ విగ్ పెట్టుకుంటాడు అంటూ బాడీ షేమింగ్ చేసేలా మాట్లాడారు. అలా సమస్య కాస్త పక్కదారి పట్టి వేరే వైపు వెళ్లిపోయింది. మరోవైపు 'పెద్ది' రిలీజ్ టైంలో కావాలనే ఎగ్జిబిటర్ శిరీష్ ఇలా చేస్తున్నారని నిర్మాతలు ఆరోపణలు చేశారు. స్పందించిన శిరీష్.. తాము ఎప్పటినుంచో పర్సంటేజీ గురించి అడుగుతున్నామని 'పెద్ది'ని టార్గెట్ చేయట్లేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం.. తెలుగు ఫిలిం ఛాంబర్‌లో సురేశ్ బాబు ఆధ్వర్వంలో ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య చర్చలు జరగనున్నాయి. సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని నిర్మాత సి.కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
(ఇదీ చదవండి: టాలీవుడ్‌లో 'గొడవ'.. చేయిదాటిపోయిన పరిస్థితి)
ఈ మొత్తం వ్యవహారంలో ప్రేక్షకులు ఎవరివైపు ఉన్నారా? అంటే ఎవరివైపు లేరు. ఎందుకంటే ప్రేక్షకులకు ఈ పర్సంటేజీ, రెంట్ లాంటి వాటి గురించి పెద్దగా ఆసక్తి లేదు. ఉండదు కూడా! ఓ మంచి సినిమా తీస్తే దాన్ని థియేటర్‌కి వెళ్లి చూడటం మాత్రమే ఆడియెన్స్‌కి తెలుసు. కానీ సరైన మూవీస్ తీయడం, టైంకి రిలీజ్ చేయడం మానేసి వాళ్లలో వాళ్లే గొడవపడి టాలీవుడ్ అంటేనే విరక్తి వచ్చేలా చేస్తున్నారు.
అసలు థియేటర్లు నడిచేవే హీరోలు, ప్రేక్షకుల వల్ల. ఆ విషయాన్ని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మర్చిపోతున్నారేమో అని సందేహం కలుగుతోంది. ప్రస్తుతమున్న గొడవ పూర్తిగా సద్దుమణగాలంటే తెలుగు రాష్ట్రాల్లో కచ్చితమైన టికెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ లాంటి రిలీజ్ చేసి మభ్య పెట్టకుండా గ్రాస్, నెట్, షేర్ కలెక్షన్స్‌లో పారదర్శకత పాటించాలి. ఒకరిని ఒకరు నిందించుకోకుండా హీరోల రెమ్యునరేషన్, ఓటీటీ బిజినెస్ లాంటి వాటిపై నిర్మాతలు దృష్టి పెట్టాలి. పెద్ద మూవీ అని టికెట్ రేట్లు ఎడాపెడా పెంచేయకుండా థియేటర్లు శుభ్రంగా ఉన్నాయా లేదా ఫస్ట్ చెక్ చేయాలి. ఏళ్లకు ఏళ్లు సాగదీయకుండా స్టార్ హీరోలు ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేసేలా ఒప్పించాలి. నటీనటులు, మూవీ బడ్జెట్ నియంత్రణలో ఉంచాలి. బడ్జెట్ అనవసరంగా పెంచేసి ఓటీటీల్లో త్వరగా రిలీజ్ చేయడం లాంటివి ఆపాలి. మరీ ముఖ్యంగా డబ్బు పెట్టే ప్రేక్షకుడిపై భారం పడకుండా చూసుకోవాలి. అప్పుడే థియేటర్లు బతుకుతాయి. తద్వారా ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కూడా బతుకుతారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. అది మాత్రం సస్పెన్స్)


