
సిల్వర్ స్క్రీన్‌పై అందంగా మెరిసిపోతుంటారు కథానాయిలు. ఫర్ ఎ చేంజ్ డీ గ్లామరస్‌గా కనిపించే అవకాశం వస్తే... ‘సై’ అంటారు. అలాంటి పాత్రలు చేసినప్పుడు దక్కే కిక్కే వేరు అంటున్నారు ఈ భామలు. గ్లామర్.. డీ గ్లామర్... ఏదైనా కొందరు తారలు ప్రస్తుతం అదిరిపోయే లుక్కుల్లో కనిపించడం మాత్రమే కాదు... నటనపరంగానూ విజృంభిస్తున్నారు. అదిరిపోయే లుక్కుల్లో కనిపించనున్న ఆ అందాల భామల గురించి తెలుసుకుందాం.
ప్రతీకారంతో...
‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేసిన హీరోయిన్ అనుష్కా శెట్టి నటించిన తాజా సినిమా ‘ఘాటీ’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (2023) మూవీ తర్వాత అనుష్క టాలీవుడ్‌లో కమిటైన చిత్రమిది.
‘వేదం’ (2010) వంటి హిట్ మూవీ తర్వాత అనుష్క, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ‘ఘాటీ’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారట.
బిజినెస్ ఉమన్‌గా సత్తా చాటుతున్న ఆమెను కొందరు కావాలని టార్గెట్ చేస్తారు. ఈ కారణంగా వ్యాపారంలో నష్టాలపాలైన ఆ మహిళ అందుకు కారకులైన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుందని టాక్. ఈ చిత్రంలో దేశీ రాజు అనే లీడ్ క్యారెక్టర్‌ని తమిళ నటుడు విక్రమ్ ప్రభు పోషించారు.
అత్యధిక బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందిన ‘ఘాటీ’ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో సహా పలు భాషల్లో ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఏప్రిల్ ఆరంభమైనా చిత్రయూనిట్ ఎలాంటి ప్రమోషన్స్ చేపట్టకపోవడంతో విడుదల ఉంటుందా? వాయిదా పడుతుందా? అనే చర్చ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.
ఇటు అమ్మోరు తల్లి... అటు రాక్షసి...
ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌లా ఉంటారు నయనతార. అలాగే డిఫరెంట్ రోల్స్ చేయడంలోనూ ఆమె ముందుంటారు. నటనలో వైవిధ్యం చూపిస్తుంటారు. ప్రస్తుతం నయనతార తమిళంలో ‘మూక్కుత్తి అమ్మన్ 2’ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారు. సుందర్.సి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో నయనతార అమ్మవారి పాత్రలో కనిపిస్తారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్‌నేషనల్, అవ్నీ సినీమ్యాక్స్, రౌడీ పిక్చర్స్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రూ. వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలో ఇటీవల మొదలైంది. ఇక 2020లో నయనతార లీడ్ రోల్‌లో నటించిన తమిళ చిత్రం ‘మూక్కుత్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) సినిమాకు సీక్వెల్‌గా ‘మూక్కుత్తి అమ్మన్ 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
మరోవైపు ‘రాక్కాయీ’ సినిమాలో తన చిన్నారిని రక్షించేందుకు ఎంతటి సాహసాలనైనా చేసే తల్లి పాత్రలో నయనతార నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార గెటప్ కొత్తగా ఉంటుంది. సెంథిల్ నల్లస్వామి డైరెక్షన్‌లో డ్రమ్‌స్టిక్స్ ప్రోడక్షన్, మూవీ వెర్స్ ఇండియా సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.
నాగ సాధువుగా...
ఓ వైపు హీరోయిన్‌గా, మరో వైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు ప్రత్యేక పాటల్లో సందడి చేస్తున్నారు తమన్నా. ఆమె లీడ్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందింది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన అశోక్ తేజయే రెండో భాగాన్ని కూడా తెరకెక్కించారు. డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి క్రియేటర్‌గా వ్యవహరించారు. తొలి భాగంలో జోడీగా నటించిన హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా మలిభాగంలోనూ నటించారు.
మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలవుతోంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో తొలిసారిగా శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటించారు తమన్నా. ఓదెల గ్రామానికి ఊహించని కష్టం వస్తుంది. ఆ ఊరిలో కొలువై ఉన్న ఓదెల మల్లన్న స్వామి నాగ సాధు (తమన్నా) పాత్ర ద్వారా ఆ సమస్యని ఎలా పరిష్కరించారు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ఈ సినిమా నుంచి విడుదలైన తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. అలాగే టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. పైగా ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ సూపర్ హిట్ కావడంతో ‘ఓదెల 2’పై భారీ అంచనాలున్నాయి.
రివాల్వర్ పట్టిన రీటా...
‘నేను శైలజ’ (2016) సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు కీర్తీ సురేశ్. ఆ తర్వాత ‘నేను లోకల్, అజ్ఞాతవాసి, రంగ్ దే, సర్కారువారి పాట, దసరా, భోళా శంకర్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. మహానటి సావిత్రి బయోపిక్‌గా రూపొందిన ‘మహానటి’ (2018) చిత్రానికిగాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు కీర్తి. ఆమె టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రివాల్వర్ రీటా’. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, రెడిన్ కింగ్సీ కీలక పాత్రలు పోషించారు.
ప్యాషన్ స్టూడియోస్ అండ్ ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనీస్వామి నిర్మించారు. కామెడీ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. సాధారణ జీవితం గడుపుతున్న ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన రీటా అనుకోని పరిస్థితుల్లో తుపాకీ చేతపట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న సవాళ్లేంటి? అనేది ఈ సినిమాలో ఆసక్తిగా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను హాస్య మూవీస్ అధినేత, నిర్మాత రాజేశ్ దండా సొంతం చేసుకున్నారు.
డీ గ్లామరస్‌గా బుట్టబొమ్మ...
తెలుగు తెరపై బుట్టబొమ్మలా పూజా హెగ్డే ఎంతో అందంగా కనిపించారు. ఎన్నో గ్లామరస్ రోల్స్ కూడా చేశారు. కానీ రొటీన్‌కి డిఫరెంట్‌గా పూజా హెగ్డే తొలిసారిగా ఓ డీ గ్లామరస్ రోల్ చేశారు. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘రెట్రో’. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. ఈ ‘రెట్రో’ మూవీలోనే పూజా హెగ్డే డీ గ్లామరస్ రోల్ చేశారు.
స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు నిర్మించిన ‘రెట్రో’ మే1న విడుదల కానుంది. ఇంకా రాఘవా లారెన్స్ సక్సెస్‌ఫుల్ హారర్ ఫ్రాంచైజీ ‘కాంచన’ లేటెస్ట్ మూవీ ‘కాంచన 5’లో పూజా హెగ్డే ఘోస్ట్ రోల్ చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ఇదే నిజమైతే... పూజాకు ఈ రోల్, గెటప్ కూడా సరికొత్తదే.
సీతగా సాయిపల్లవి...
పల్లెటూరి అమ్మాయిలా, స్టూడెంట్‌లా... ఇలా హీరోయిన్ సాయిపల్లవి ఇప్పటివరకు విభిన్నమైన పాత్రలు చేశారు. కానీ ఇప్పటివరకు ‘రామాయణం, మహాభారతం’ వంటి ఇతిహాసాల నేపథ్యంలో రూపొందిన సినిమాల్లో సాయి పల్లవి స్క్రీన్‌పై కనిపించలేదు. అయితే సీతగా సాయిపల్లవి ఎంత అద్భుతంగా వెండితెరపై మెరిసిపోతారో, వచ్చే ఏడాది దీపావళికి సిల్వర్ స్క్రీన్‌పై చూడొచ్చు. రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి ‘రామాయణ’ మూవీ తీస్తున్నారు.
ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. లక్ష్మణుడిగా రవిదుబే, హనుమంతుని పాత్రలో సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారని సమాచారం. నితీష్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళి సందర్భంగా రిలీజ్ కానున్నాయి.
ఈ సంగతి ఇలా ఉంచితే... బాలీవుడ్‌లో సాయిపల్లవి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే హిందీలో సాయి పల్లవి ‘ఏక్ దిన్’ అనే లవ్‌స్టోరీ మూవీ కూడా చేశారు. ఆమిర్ ఖాన్ తనయుడు జూనైద్ ఖాన్ నటించిన ఈ చిత్రం విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.
మహిళల చుట్టూ పరదా...
అనుపమా పరమేశ్వరన్ కూడా జోరుమీదున్నారు. అటు హీరోయిన్‌గా, ఇటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారామె. తాజాగా ఆమె లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘పరదా’. ‘ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. ‘సినిమా బండి’ మూవీ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. దర్శనా రాజేంద్రన్, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆనంద మీడియాపై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.
వైవిధ్యమైన సోషియో డ్రామా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సుబ్బు పాత్రలో నటించారు అనుపమ. ఆమె పుట్టినరోజు (ఫిబ్రవరి 18) సందర్భంగా చిత్రబృందం ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసింది. ‘పరదాలమ్మా పరదాలు... రంగురంగుల పరదాలు... డిజైనర్ పరదాలు.... తీసుకోవాలమ్మా తీసుకోవాలి’ అంటూ అనుపమ చెప్పే డైలాగులకి మంచి స్పందన వచ్చింది. మహిళల చుట్టూ సాగే కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళుతుందని యూనిట్ పేర్కొంది. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేటిని ప్రకటించనున్నారు మేకర్స్.
స్వారీకి సై...
‘భీమ్లా నాయక్’ (2022) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు సంయుక్త. ఆ తర్వాత ‘బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి హిట్ సినిమాల్లో నటించారామె. ప్రస్తుతం తెలుగులోనూ చేతి నిండా ప్రాజెక్టులతో దూసుకెళుతున్నారు. ‘స్వయంభూ, నారి నారి నడుమ మురారి, హైందవ, అఖండ 2: తాండవం’ వంటి తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారామె. అదే విధంగా తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే... నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘స్వయంభూ’. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యోధుడి పాత్ర కోసం నిఖిల్ మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. భారీ యుద్ధ సన్నివేశాలు ఉన్న ఈ మూవీలో సంయుక్త కూడా పోరాట సన్నివేశాలు చేయాల్సి ఉందట. ఈ స్టంట్స్ చేయడానికి గుర్రపు స్వారీ నేర్చుకున్నారు సంయుక్త. మరి.. ఆమె పోరాటాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలియాలంటే సినిమా విడుదల వరకూ వేచి చూడాలి.
ఇదిలా ఉంటే... సంయుక్త టిస్తున్న తొలి హిందీ చిత్రం ‘మహారాజ్ఞి–క్వీన్ ఆఫ్ క్వీన్స్’. ఈ మూవీకి చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మోహన్‌లాల్ హీరోగా రూపొందుతోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు సంయుక్త.
యువరాణి పంచమి
‘సవ్యసాచి’ (2018) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నిధీ అగర్వాల్. ‘మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె నటించిన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్–1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. పవన్ కల్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.
నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రోడక్షన్స్పై ఎ. దయాకర్ రావు నిర్మించిన ఈ మూవీ మే 9న విడుదల కానుంది. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందిన ‘హరి హర వీరమల్లు’లో చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కల్యాణ్ నటించగా.. పంచమి అనే యువరాణి పాత్రలో నిధీ అగర్వాల్ సరికొత్తగా కనిపించనున్నారు. ఆమె పాత్రకు చాలాప్రాధాన్యం ఉంటుందట. ఈ కథానాయికలే కాదు... ఇంకొందరు కూడా వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి, మెప్పించనున్నారు.