టాలీవుడ్‌లో కొత్త వేరియంట్‌... వెరీ గుడ్‌!

Tollywood Main Actors Coming With The Different Roles With Different Looks - Sakshi

ఇదేంటండీ బాబూ... వేరియంట్‌ వెరీ గుడ్డా? వేరియంట్‌ ఎలా అవుతుంది గుడ్డు.. వెరీ బ్యాడు అనే కదా మీ సందేహం. కరోనా వేరియేషన్స్‌లో డెల్టా వేరియంట్, ఒమిక్రాన్‌ వేరియంట్‌... ఈ వేరియంట్లు బ్యాడే. కానీ... హీరోలు రకరకాల వేరియేషన్లలో కనిపిస్తే ఆ వేరియంట్‌ గుడ్డే కదా. అభిమానులకు పండగే కదా. ఇక ఒకే సినిమాలో పలు వేరియేషన్లలో కనిపించనున్న హీరోలెవరో చూసేద్దాం...

కెరీర్‌లో ఎన్నోసార్లు డిఫరెంట్‌ గెటప్స్‌ ఉన్న పాత్రలు చేశారు చిరంజీవి. ఇప్పుడు ఒకటి కాదు రెండు మూడు సినిమాల్లో రెండు షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. విడుదలకు రెడీ అయిన ‘ఆచార్య’లో కామన్‌ మేన్‌గా, నక్సలైట్‌గా రెండు వేరియేషన్స్‌లో కనిపిస్తారు చిరంజీవి. ‘ఆచార్య’ ట్రైలర్‌లో దీన్ని మనం గమనించవచ్చు. అలాగే ‘గాడ్‌ ఫాదర్‌’, ‘వాల్తేరు వీరయ్య’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) లోనూ చిరంజీవి డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపించనున్నారని తెలిసింది.

ఇక ‘ఆచార్య’లో కీలక పాత్ర చేసిన రామ్‌చరణ్‌ ఈ చిత్రంలో తండ్రిలా రెండు వేరియేషన్స్‌లో కనిపిస్తారు. రామ్‌చరణ్‌ చేసిన మరో చిత్రం ‘రౌద్రం..రణం..రుధిరం’. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ఓ హీరోగా నటించారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో ప్రధానంగా ఢిల్లీ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్‌ పాత్రలోఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ కనిపిస్తారు. ఈ చిత్రంలో తాను మూడు గెటప్స్‌లో కనిపించనున్నట్లు ఇటీవల ఓ సందర్భంలో రామ్‌చరణే స్వయంగా చెప్పారు. పోలీసాఫీసర్, అల్లూరి సీతారామరాజు గెటప్స్‌తో పాటు మరో లుక్‌లో చరణ్‌ కనిపించనున్నారు.

ఇదే చిత్రంలో ఎన్టీఆర్‌ కూడా డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపించనున్నట్లు తెలిసింది. అందులో ఒకటి యంగ్‌ భీమ్‌ కాగా, అదే పాత్ర ఓల్డ్‌ వేరియేషన్‌ ఒకటి అని సమాచారం. కీలక సన్నివేశాల్లో టోపీ ధరించిన వేరియేషన్‌ ఒకటి. ‘ఆచార్య’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాల్లో మాత్రమే కాదు... శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో కూడా చరణ్‌ రెండు గెటప్స్‌లో కనిపిస్తారు. ఐఏఎస్‌ ఆఫీసర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా మారే పాత్రలో చరణ్‌ కనిపిస్తారని తెలిసింది. ఇక ప్యాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ చేతిలో ఉన్న సినిమాల్లో ‘సలార్‌’ ఒకటి. ఈ చిత్రంలో ప్రభాస్‌ రెండు గెటప్స్‌లో కనిపిస్తారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు అరడజను సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు రవితేజ. అయితే సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రావణాసుర’లో పది గెటప్స్‌లో కనిపిస్తారు. అలాగే ‘ఖిలాడి’ చిత్రంలో రవితేజ డ్యూయల్‌ రోల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 11న ‘ఖిలాడి’, సెప్టెంబరు 30న ‘రావణాసుర’ చిత్రాలు థియేటర్స్‌కు రానున్నాయి. ప్రస్తుతం ‘రావణాసుర’కి సంబంధించిన నైట్‌ సీన్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. యంగ్‌ హీరో నాగచైతన్య లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘థాంక్యూ’. ‘మనం’ తర్వాత దర్శకుడు విక్రమ్‌ కుమార్‌తో నాగచైతన్య చేస్తున్న చిత్రం ఇది. ఇందులో తాను మూడు గెటప్స్‌లో కనిపించనున్నట్లు నాగచైతన్య ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఓ వ్యక్తి జర్నీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అటు అమిర్‌ ఖాన్‌ హీరోగా చేసిన ‘లాల్‌సింగ్‌ చద్దా’లో కీ రోల్‌ చేసిన నాగచైతన్యను ఆ సినిమాలో రెండు గెటప్స్‌లో చూడొచ్చు.

ఒకటి ఆర్మీ ఆఫీసర్‌ కాగా, మరొకటి జనరల్‌ గెటప్‌. ఇక కొన్ని నెలల క్రితం నితిన్‌ హీరోగా ‘పవర్‌ పేట’ అనే సినిమా ప్రకటన వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో రెండు డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తానని నితిన్‌ ఓ సందర్భంలో తెలిపారు. ఇంకోవైపు డిఫరెంట్‌ సినిమాలతో దూసుకెళ్తోన్న సత్యదేవ్‌ చేసిన తాజా చిత్రం ‘గుర్తుందా... శీతాకాలం’. ఇందులో స్టూడెంట్‌గా, ఉద్యోగిగా, ఇంకో వేరియేషన్‌... ఇలా మూడు డిఫరెంట్‌ గెటప్స్‌లో సత్యదేవ్‌ కనిపిస్తారు. నాగశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.

ఇక ‘దసరా’ చిత్రంలో నాని, ‘ది వారియర్‌’లో రామ్‌ డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. వీరితో పాటు కొందరు సీనియర్‌ అండ్‌ యంగ్‌ హీరోలు డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపించి ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయడానికి మేకోవర్‌ అవుతున్నారు.
ఇలా పలు వేరియంట్స్‌ (రూపాంతరాలు) ఉన్న పాత్రల్లో హీరోలు కనబడితే... ఆడియన్స్‌ ‘వేరియంట్‌ వెరీ గుడ్డు’ అనకుండా ఉండగలరా!

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top