
ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి (Y. V. S. Chowdary) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి యలమంచలి రత్నకుమారి (88) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం (సెప్టెంబర్ 25) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని దర్శకుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా తల్లితో తన అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఏ లోటూ రాకుండా పెంచింది
మా అమ్మ.. ‘యలమంచిలి రత్నకుమారి’గారు ఒక స్త్రీశక్తి. లారీడ్రైవర్ అయిన మా నాన్న ‘యలమంచిలి నారాయణరావు’గారి నెలసరి సంపాదనతో.. తన ముగ్గురు బిడ్డలకు పౌష్టికాహారం, బట్టలు, అద్దె ఇల్లు, విద్య, వైద్యం అందించేది. అంతేకాదు, సినిమాలు చూపించడం దగ్గరి నుంచి దేవాలయ దర్శనాలు, సీజనల్ పిండివంటలు, నిల్వ పచ్చళ్ళు, పండుగలకు ప్రత్యేక వంటకాలు, సెలబ్రేషన్స్.. ఇత్యాది అవసరాలకు.. ఎటువంటి లోటు రాకుండా.. తన నోటి మీది లెక్కలతోనే బడ్జెట్‌ని కేటాయించిన ఆర్ధిక రంగ నిపుణురాలు మా అమ్మగారు.
మాలో స్ఫూర్తి నింపింది
వీటన్నింటికీ మించి నిత్యం తెల్లవారుజామునే లేస్తూ పనిమనిషి ప్రమేయం లేని జీవితాన్ని తన బిడ్డలకు అందించాలనే తపనతో.. అన్నీ తానై మమ్మల్ని పెంచటానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి మా అమ్మగారు.. అలా మా అమ్మగారికి తెలిసిన లెక్కలు, ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువూ, ఏ విద్యా నేర్పించలేనిది. అంతేగాకుండా తన విధానాలతో మాలో కూడా స్ఫూర్తిని నింపిన మహనీయురాలు మా అమ్మగారు.
సినిమా
అటువంటి మా అమ్మగారు (88 యేళ్ళు) 25వ సెప్టెంబరు 2025, రాత్రి 8.31 గంటలకు.. ఈ భువి నుంచి సెలవు తీసుకుని.. ఆ దివిలో ఉన్న మా నాన్నగారిని, మా అన్నగారిని కలవడానికి వెళ్ళిపోయారు అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. వైవీఎస్ చౌదరి విషయానికి వస్తే.. శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి సినిమాతో దర్శకుడిగా మారారు. సీతారామరాజు, యువరాజు సినిమాలు చేశారు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, రేయ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు.