
తమిళ నటి, ప్రముఖ యాంకర్ ఐశ్వర్య రఘుపతి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో ఆమె దుస్తులను ఉద్దేశించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంపై ఇప్పటికే ఓ నోట్ రిలీజ్ చేసింది. అయితే మరోసారి తాజాగా జరిగిన ఈవెంట్‌లోనూ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె స్లీవ్‌లెస్ దుస్తులపై ఓ రిపోర్టర్ ప్రశ్నించడంతో ఐశ్వర్య ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజాగా సాయిధన్సిక మూవీ యోగిదా ఈవెంట్‌కు హాజరైన ఐశ్వర్య.. వేసవికాలంలో వేడిని తట్టుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని మీడియాను కోరారు. అయితే దీనికి ప్రతిస్పందనగా.. ఒక రిపోర్టర్ ఆమెను ప్రశ్నిస్తూ.. మీరు ధరించిన స్లీవ్‌లెస్ బ్లౌజ్ కూడా వేడిని తట్టుకునే ప్రణాళికలో భాగమేనా అని అడిగారు. దీనికి ఆశ్చర్యపోయిన ఐశ్వర్య.. ఒక సినిమా కార్యక్రమంలో తన దుస్తులపై చర్చ ఎందుకంటూ అతన్ని ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఎలా స్పందించాలో తనకు అర్థం కావడం లేదని తెలిపింది. ఐశ్వర్య దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గత వారంలో ఐశ్వర్య రఘుపతి ఈ సమస్యను ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. నేటికి కూడా మన సమాజంలో చాలా మంది పురుషులు అహంకారం, దురభిమాన భావనను కలిగి ఉండటం నిరాశ కలిగించే అంశమని తెలిపింది. ఒక రిపోర్టర్ లాంటి వ్యక్తి నుంచి అలాంటి ప్రవర్తన వచ్చినప్పుడు మరింత నిరాశకు గురి చేసిందన్నారు. ఈ విషయాన్ని మీరు గ్రహించాలని ఐశ్వర్య తన ప్రకటనలో రాసుకొచ్చింది.
ఇలా వేదికలపై తాను ఇలాంటి అసౌకర్య క్షణాలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ నటుడు తనకు దండలు వేయడానికి ప్రయత్నించేటప్పుడు హద్దులు మీరి వ్యవహరించాడని.. ఆ సంఘటన తన మానసికంగా ప్రభావితం చేసిందని ఐశ్వర్య చెప్పింది. కాగా.. ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రంలో ఐశ్వర్య రఘుపతి కనిపించింది.