
ఈ మధ్య కేన్స్‌కు వెళ్లినప్పుడు కొందరు నన్ను గుర్తుపట్టి అంత పెద్ద ప్రాజెక్టులో నటించావ్.. ఇలా ఎందుకు తిరుగుతున్నావ్? అని అడిగారు. స్టార్ అయిపోగానే అందరూ మన దగ్గరకు వచ్చి ఛాన్సులిస్తారని వాళ్లు అనుకుంటున్నారు.
సక్సెస్ వచ్చిందంటే చాలు సెలబ్రిటీలు పొంగిపోతారు. ఛాన్సుల కోసం ఎవరినీ బతిమిలాడాల్సిన పని లేదనుకుంటారు. నటుడు తాహా షా బుద్ధాషా మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తాడు. సక్సెస్ వచ్చినా, రాకపోయినా అందరితో పరిచయాలు పెంచుకోవాలి.. మంచి అవకాశాలు సంపాదించుకోవాలని ఆరాటపడతాడు. ఇటీవలే హీరామండి సిరీస్‌లో మెప్పించిన ఇతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నాడు.
సక్సెస్ వచ్చిందని పొంగిపోను
'సక్సెస్ వచ్చింది కదా అని విశ్రాంతి తీసుకోను. దాన్ని కొనసాగించేందుకు మరింత కష్టపడతాను. నాకు తెలిసిన ప్రతి ఒక్కరినీ అవకాశాలిమ్మని కలుస్తూనే ఉంటాను. తెలియనివారిని పరిచయం చేసుకుంటాను. ఈ మధ్య కేన్స్‌కు వెళ్లినప్పుడు కొందరు నన్ను గుర్తుపట్టి అంత పెద్ద ప్రాజెక్టులో నటించావ్.. ఇలా ఎందుకు తిరుగుతున్నావ్? అని అడిగారు. స్టార్ అయిపోగానే అందరూ మన దగ్గరకు వచ్చి ఛాన్సులిస్తారని వాళ్లు అనుకుంటున్నారు.

అందరినీ పలకరిస్తుంటా
నేనైతే దాన్ని నమ్మను. అవకాశాల కోసం నా అంతట నేనుగా ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటాను. ఒకవేళ ఎదుటివాళ్లు నన్ను పలకరించకపోయినా నేనే వెళ్లి మాట్లాడిస్తుంటాను. లేదంటే నాకు యాటిట్యూడ్ ఉందనుకుని, నా దగ్గరకు రాకపోవచ్చు. అందుకే అందరితో కలిసిపోతుంటాను. పరిచయాలు పెంచుకుంటాను. కేన్స్‌కు వెళ్లినప్పుడు కూడా నేనేదో ఇండస్ట్రీకి కొత్త వ్యక్తి అయినట్లు నా బయోడేటా కార్డును పంచాను. ప్లీజ్ నాకు ఫోన్ చేయండి, నాతో టచ్‌లో ఉండండి అని చెప్పాను.
తిండీనిద్ర మానేసి..
వాళ్లు తెల్లారేసరికి నాకేదో సినిమా ఆఫర్ ఇస్తారని కాదు.. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా! తిండీనిద్ర మానేసి పని కోసం తిరుగుతూనే ఉంటాను. కేన్స్ ఈవెంట్‌కు వెళ్లినప్పుడు కూడా అంతే.. తినడానికి వెళ్తే ఎక్కడ టైం వేస్ట్ అవుతుందోనని తినడం మానేసి అందరినీ పలకరిస్తూ ఉన్నాను. నాకు పని దొరకనప్పుడైతే దర్శకనిర్మాతల ఇంటిచుట్టూ ప్రదక్షిణలు చేసేవాడిని. వాళ్ల ఇంటి వాచ్‌మెన్‌కు ఏదైనా తినిపించో, జ్యూస్ తాగిపించో వాళ్ల సర్‌తో మాట్లాడించమని చెప్పేవాడిని' అని తాహా షా గుర్తు చేసుకున్నాడు.
చదవండి: ‘ఆదిపురుష్’లో రావణుడిని వీధి రౌడీలా చూపించడం బాధేసింది