
ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఒక ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. అది ఐశ్వర్య రజనీకాంత్ గురించే. నటుడు ధనుశ్, ఐశ్వర్యలు మనస్పర్థలు కారణంగా ఇటీవల విడిపోయిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరిని మళ్లీ కలపడానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలు అన్న విషయం తెలిసిందే.
చదవండి: నడవలేని స్థితిలో పూజ.. ఫొటో షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’
ధనుశ్, శృతిహాసన్ జంటగా నటించిన 3 చిత్రంతో ఐశ్వర్య మెగా ఫోన్ పట్టారు. ఆ తరువాత వై రాజా వై అనే చిత్రం తెరకెక్కించారు. అలాగే స్టంట్ కళాకారుల నేపథ్యంలో సినిమా వీరన్ అనే డాక్యుమెంటరీ చిత్రం చేశారు. తాజాగా చాలా గ్యాప్ తరువాత మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. విశేషం ఏటంటే ఇందులో ఆమె తండ్రి సూపర్‌స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. కాగా ఇందులో నటుడు అధర్వ కథానాయకుడిగా నటించనున్నట్లు సమాచారం.
చదవండి: జపాన్‌లో తారక్‌కు అరుదైన స్వాగతం, వీడియో వైరల్
దీనిని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు, చిత్ర షూటింగ్ నవంబర్ తొలి వారంలో ప్రారంభించనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అయితే ఇక్కడ మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో నటుడు శింబు కథానాయకుడిగా నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే వీటిలో ఏ విషయం అధికారిక పూర్వకంగా వెల్లడి కాలేదన్నది గమనార్హం. కాగా ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్న మాట మాత్రం నిజం.