మాపై ఇలాంటి వ్యాఖ్యలా అంటూ.. కన్నీరు పెట్టుకున్న శుభలేఖ సుధాకర్‌ | Sakshi
Sakshi News home page

మాపై ఇలాంటి వ్యాఖ్యలా.. ఇకనైన ఆపాలంటూ కన్నీరు పెట్టుకున్న శుభలేఖ సుధాకర్‌

Published Sat, Feb 17 2024 1:29 PM

Subhalekha Sudhakar Emotional Comments On Fake News - Sakshi

'శుభలేఖ' సుధాకర్, ఆ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఇండస్ట్రీలో ఆయన రాటు తేలిన కేరెక్టర్ యాక్టర్! తన దరికి చేరిన పాత్రల్లోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసి మార్కులు కొట్టేస్తూ ఉంటారు. అవి నచ్చినవారు ఆయనను పట్టేసి తమ సినిమాల్లో పెట్టేసుకుంటారు. సుధాకర్ కూడా శక్తివంచన లేకుండా నటించేసి, జనాన్ని మెప్పిస్తుంటారు. మధురగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజకు ‘శుభలేఖ’ సుధాకర్ భర్త అనే విషయం తెలిసిందే. ఆయన నటుడిగానే కాకుండా డబ్బింగ్‌తోనూ ప్రేక్షకులను అలరించడం విశేషం.

తాజాగా యాత్ర -2 చిత్రంలో రెడ్డి పాత్రలో ఆయన నటనకు వంద మార్కులు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ఆయన పాత్రను మరిచిపోవడం కష్టం.. అంతలా ప్రేక్షకులను మెప్పించారని చెప్పవచ్చు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు యూట్యూబ్‌ ఛానల్స్‌ తన పట్ల వ్యవహిరిస్తున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పుడు థంబ్‌నైల్స్‌ పెట్టి పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఎమోషనల్‌ అయ్యారు. 'సుధాకర్‌కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని చిరంజీవి' శైలజతో విడాకులు తీసుకున్న సుధాకర్‌ ఇలా తప్పుడు రాతలు ఎందుకు రాస్తారంటూ ఆయన ఆవేదన చెందారు.

'చిరంజీవితో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు 54రోజుల పాటు ఆయన నిత్యం ఫోన్‌ కాల్‌ చేస్తూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునే వారు. మెగాస్టార్‌ నా మొదటి హీరో.. ఈ యూట్యూబ్‌ వాళ్లు చాలా ఏళ్లుగా తప్పుగానే నా గురించి చూపిస్తూ వస్తున్నారు. నేను, శైలజ విడిపోయామని పలు వీడియోలు కూడా పెట్టారు.. అందులో నిజం లేదని ఇప్పటికే మేము ఇద్దరం కలిసి చెప్పాం.

ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మా అమ్మ గారు శైలజను ఒకరోజు ప్రశ్నించారు. ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా..? అని అప్పుడు నేను కలుగచేసుకుని అలాంటివి ఏమీ లేవని చెప్పాను. తర్వాత మళ్లీ రోజు నిద్రలోనే ఆమె మరణించారు. ఇలాంటి సమయంలో నేను ఏం అనుకోవాలి..? ఇలాంటి వీడియోలతో యూట్యూబ్‌ ఛానల్స్‌ వారికి ఏమి కలిసి వస్తుంది..? ఈ ప్రపంచంలో అత తక్కువ వృత్తి అంటే ఒక స్త్రీ తన శరీరాన్ని అమ్ముకుని సంపాదించడమే అని నేను అనుకుంటాను. వాళ్లకు కూడా మంచి ఎథిక్స్‌ ఉంటాయి. కానీ వీళ్లకు మాత్రం అలాంటివి ఏమీ లేవు అంటూ సుధాకర్‌ కన్నీరు పెట్టుకున్నారు.

ఒక్కోసారి శుభలేఖ సుధాకర్ చనిపోయారని వీడియో పెడతారు.. నన్ను చంపేస్తే వాళ్లకు ఏం కలిసి వస్తుంది. అలాంటి వారికి నేను ఏం ద్రోహం చేశాను. కనీసం నేను ఎవరినీ కూడా ఇబ్బంది పెట్టను. మీ పొట్ట నింపుకోవాడానికి మరోకరిని ఇలా  చంపడం ఎందుకు..? అలా సంపాదించిన డబ్బుతో తిన్న ఆహారం ఒంటికి పడుతుందా..? ఇలాంటి వీడియోలు చేసేవారు నూటికి వెయ్యి శాతం అనుభవిస్తారు.' అని ఆయన క్షోభించారు.

Advertisement
 
Advertisement