breaking news
subhalekha sudhakar
-
త్వరలో ‘హెచ్చరిక ’
సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, ‘శుభలేఖ’ సుధాకర్, షాయాజీ షిండే, ‘శంకరాభరణం’ తులసి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘΄పోలీస్‌వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్ధన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్, నటి ఇంద్రజ మాట్లాడుతూ– ‘‘మేమంతా ఇక్కడికి వచ్చామంటే కారణం బాబ్జీ మీద ఉన్న గౌరవం. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో అన్ని వాణిజ్య అంశాలు ఉన్నాయి’’ అన్నారు ‘శుభలేఖ’ సుధాకర్. ‘‘ఈ సినిమాకు ప్రేక్షకాదరణ లభిస్తుందనుకుంటున్నాను’’ అని దర్శకుడు సముద్ర నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘మా సినిమాని అందరూ చూసి మంచి విజయాన్ని అందించాలి’’ అన్నారు బెల్లి జనార్ధన్. బాబ్జీ మాట్లాడుతూ– ‘‘సినిమాల కోసం పని చేసేవారు తాము చేసిన చిత్రం విడుదలైన ప్రతిసారీ పుడుతూనే ఉంటారు. సినిమా కోసమే పుట్టామని భావిస్తారు. మా ‘పోలీస్ వారి హెచ్చరిక’ని ఆదరించాలి’’ అని పేర్కొన్నారు. -
'ఒక బృందావనం' మూవీ రివ్యూ
కంటెంట్ బాగుంటే చాలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమాను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే ఈ మధ్యకాలంలో నూతన నటీనటులతో తెరకెక్కించే సినిమాలు ఎక్కువయ్యాయి. వాటిలో చాలా వరకు విజయం సాధిస్తున్నాయి కూడా. అలా వచ్చిన మరో చిన్న చిత్రమే ‘ఒక బృందావనం’. నూతన నటీనటులు బాలు, షిన్నోవాలతో పాటు శుభలేక శుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూప లక్ష్మి, సాన్విత, కళ్యాణి రాజు, మహేంద్ర, డి.డి. శ్రీనివాస్ మరియు ఇతర సీనియర్ నటీనటులు ఈ చిత్రంలో నటించారు. బొత్స సత్య దర్శకత్వంలో కిషోర్ తాటికొండ, వెంకట్ రేగట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందుపూరు నిర్మించిన ఈ చిత్రం మే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. కెమెరామెన్ రాజా విక్రమ్(బాలు) ఆర్థిక కష్టాలతో బాధపడుతూ ఉంటాడు. ఎప్పటికైనా అమెరికాకు వెళ్లి బాగా డబ్బు సంపాదించాలనుకుంటాడు. మహి(షిన్నోవా).. చనిపోయిన వాళ్ల అమ్మ చేయాలనుకున్న డ్యాక్యుమెంటరీని తీయాలనుకుంటుంది. దీని కోసం పెళ్లిని క్యాన్సిల్ చేసుకొని ఇంటి నుంచి బయటకు వస్తుంది. అనాథ అయిన నైనికా(సాన్విక)..తనకు ప్రతి క్రిస్మస్కి బహుమతులు పంపిస్తున్న జోసెఫ్(శుభలేక సుధాకర్)ని కలిసి తన పేరెంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటుంది. అందుకోసం అనాథ ఆశ్రమం నుంచి పారిపోవాలనుకుంటుంది. ఈ ముగ్గురు వివిధ కారణాలతో కలుస్తారు. మహి తన డాక్యూమెంటరీకి కెమెరామెన్‌గా రాజాను తీసుకుంటుంది. జోసెఫ్ని కలిపిస్తామని చెప్పి.. నైనికతో డాక్యూమెంటరీ వీడియో తీసేందుకు ఒప్పిస్తారు. అసలు ఆ డాక్యూమెంటరీ దేని గురించి? చివరకు అది పూర్తయిందా లేదా? అమెరికా వెళ్లాలనుకున్న రాజా కోరిక నెరవేరిందా? నైనికాకు జోసెఫ్ ఎందుకు బహుమతులు పంపిస్తున్నాడు? చివరకు జోసెఫ్ని నైనికా కలిసిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఎలాంటి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు ఒక పాప కోసం చేసిన ఎమోషనల్ జర్నీయే ‘ఒక బృందావనం’ మూవీ. కథ పరంగా ఇది రొటీనే అయినా.. కథనం, స్క్రీన్‌ప్లే మాత్రం ఆకట్టుకునేలా ఉంటుంది. వినోదంతో పాటు ఓ మంచి సందేశాన్ని కూడా ఈ చిత్రం ద్వారా అందించాడు దర్శకుడు. ఫస్టాప్ కాస్త సాగదీతగా అనిపించినా.. ద్వితియార్థం అంతా చాలా ఎమోషనల్ జర్నీగా సాగుతుంది. మూడు పాత్రల పరిచయానికే దర్శకుడు సమయం ఎక్కువ తీసుకున్నాడు. ఈ ముగ్గురు కలిశాక కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఒక ఎమోషనల్ సీన్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకడాఫ్‌లో జోసెఫ్ని వెతుక్కుంటూ ఈ ముగ్గురు చేసే ప్రయాణం చుట్టే కథనం తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయిస్తే..మరికొన్ని సీన్లు కంటతడి పెట్టిస్తాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది. మొత్తంగా కథనం కాస్త నెమ్మదిగా సాగినా.. ఓపికతో చూస్తే మాత్రం హృదయాలను ఆకట్టుకుంటుంది. ఎలాంటి వల్గారిటీ,వయోలెన్స్ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఈ సినిమాను తీర్చి దిద్దారు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించినవారంతా నూతన నటీనటులే అయినప్పటికీ చక్కగా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కెమెరామెన్ రాజాగా బాలు చక్కగా నటించాడు. మహి పాత్రకి పిన్నోవా న్యాయం చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ సాన్విత ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. మహేందర్, మహబూబ్ బాషాల కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది. ఇక సీరియర్ నటీనటులు శుభలేక సుధాకర్, శివాజీ, అన్నపూర్ణమ్మతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సన్నీ సాకేత్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. కేరళ అందాలను తెరపై చక్కగా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
కన్నీరు పెట్టుకున్న శుభలేఖ సుధాకర్
-
మాపై ఇలాంటి వ్యాఖ్యలా అంటూ.. కన్నీరు పెట్టుకున్న శుభలేఖ సుధాకర్
'శుభలేఖ' సుధాకర్, ఆ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఇండస్ట్రీలో ఆయన రాటు తేలిన కేరెక్టర్ యాక్టర్! తన దరికి చేరిన పాత్రల్లోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసి మార్కులు కొట్టేస్తూ ఉంటారు. అవి నచ్చినవారు ఆయనను పట్టేసి తమ సినిమాల్లో పెట్టేసుకుంటారు. సుధాకర్ కూడా శక్తివంచన లేకుండా నటించేసి, జనాన్ని మెప్పిస్తుంటారు. మధురగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజకు ‘శుభలేఖ’ సుధాకర్ భర్త అనే విషయం తెలిసిందే. ఆయన నటుడిగానే కాకుండా డబ్బింగ్‌తోనూ ప్రేక్షకులను అలరించడం విశేషం. తాజాగా యాత్ర -2 చిత్రంలో రెడ్డి పాత్రలో ఆయన నటనకు వంద మార్కులు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ఆయన పాత్రను మరిచిపోవడం కష్టం.. అంతలా ప్రేక్షకులను మెప్పించారని చెప్పవచ్చు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు యూట్యూబ్ ఛానల్స్ తన పట్ల వ్యవహిరిస్తున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పుడు థంబ్‌నైల్స్ పెట్టి పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఎమోషనల్ అయ్యారు. 'సుధాకర్‌కు అపాయింట్మెంట్ ఇవ్వని చిరంజీవి' శైలజతో విడాకులు తీసుకున్న సుధాకర్ ఇలా తప్పుడు రాతలు ఎందుకు రాస్తారంటూ ఆయన ఆవేదన చెందారు. 'చిరంజీవితో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు 54రోజుల పాటు ఆయన నిత్యం ఫోన్ కాల్ చేస్తూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునే వారు. మెగాస్టార్ నా మొదటి హీరో.. ఈ యూట్యూబ్ వాళ్లు చాలా ఏళ్లుగా తప్పుగానే నా గురించి చూపిస్తూ వస్తున్నారు. నేను, శైలజ విడిపోయామని పలు వీడియోలు కూడా పెట్టారు.. అందులో నిజం లేదని ఇప్పటికే మేము ఇద్దరం కలిసి చెప్పాం. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మా అమ్మ గారు శైలజను ఒకరోజు ప్రశ్నించారు. ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా..? అని అప్పుడు నేను కలుగచేసుకుని అలాంటివి ఏమీ లేవని చెప్పాను. తర్వాత మళ్లీ రోజు నిద్రలోనే ఆమె మరణించారు. ఇలాంటి సమయంలో నేను ఏం అనుకోవాలి..? ఇలాంటి వీడియోలతో యూట్యూబ్ ఛానల్స్ వారికి ఏమి కలిసి వస్తుంది..? ఈ ప్రపంచంలో అత తక్కువ వృత్తి అంటే ఒక స్త్రీ తన శరీరాన్ని అమ్ముకుని సంపాదించడమే అని నేను అనుకుంటాను. వాళ్లకు కూడా మంచి ఎథిక్స్ ఉంటాయి. కానీ వీళ్లకు మాత్రం అలాంటివి ఏమీ లేవు అంటూ సుధాకర్ కన్నీరు పెట్టుకున్నారు. ఒక్కోసారి శుభలేఖ సుధాకర్ చనిపోయారని వీడియో పెడతారు.. నన్ను చంపేస్తే వాళ్లకు ఏం కలిసి వస్తుంది. అలాంటి వారికి నేను ఏం ద్రోహం చేశాను. కనీసం నేను ఎవరినీ కూడా ఇబ్బంది పెట్టను. మీ పొట్ట నింపుకోవాడానికి మరోకరిని ఇలా చంపడం ఎందుకు..? అలా సంపాదించిన డబ్బుతో తిన్న ఆహారం ఒంటికి పడుతుందా..? ఇలాంటి వీడియోలు చేసేవారు నూటికి వెయ్యి శాతం అనుభవిస్తారు.' అని ఆయన క్షోభించారు. -
బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్.. ఆరోజే రిలీజ్!
నంది అవార్డు గ్రహీత రవి చావలి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్'. ఈ సినిమాకు రమేశ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించాడు. శాసనసభ చిత్రంతో కథానాయకుడిగా గుర్తింపు పొందిన ఇంద్రసేన , మ్యాడ్ చిత్రంలో నటించిన సంతోష్ హీరోలుగా నటిస్తుండగా ప్రజ్ఞ నయన్, నవీన రెడ్డి హీరోయిన్లుగా నటించారు. డబ్బు కోసం రియల్ ఎస్టేట్ దందా చేసే ఒక వ్యక్తి దగ్గర పని చేసే ఇద్దరు కుర్రోళ్ళు , అతన్నే ఎందుకు కిడ్నాప్ చేశారు? ఆ కిడ్నాప్‌లో తెలిసిన రహస్యాలు ఏమిటి? చివరకు వాళ్ళు అనుకొన్న డబ్బు సంపాదించారా? లేదా? అనే పాయింట్ ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమా కథ నడుస్తుంది. మలయాళీ నటి మెర్లిన్ ఫిలిప్, తమిళ నటుడు తారక్, శుభలేఖ సుధాకర్ గారు ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, బెంగళూర్ , టెక్సాస్, అండమాన్ లో ఈ నెల 29 వ తేదీన రిలీజ్ అవుతుంది. చదవండి: పృథ్వీరాజ్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసింది ఇతడే! రవితేజతో రిలేషన్‌పై క్లారిటీ! -
మా ఆయన ఆ పాట నాతో ఎక్కువ పాడించుకుంటారు
-
నెల్లూరు అల్లుడ్ని కావడం గర్వంగా ఉంది
నెల్లూరు(బృందావనం): ఎందరో కళాకారులను అందించిన నెల్లూరుకు అల్లుడిని కావడం గర్వకారణంగా ఉందని ప్రముఖ సినీ నటుడు శుభలేఖ సుధాకర్ అన్నారు. కళాంజలి 35వ వార్షికోత్సవం సందర్భంగా నెల్లూరు పురమందిరంలో ఆదివారం రాత్రి కళాంజలి పురస్కారాన్ని సుధాకర్‌కు రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ సంగీతానికి మంత్రముగ్ధులను చేసే శక్తి ఉందన్నారు. తనకు పాటలు పాడడం ఇష్టమని అయితే.. ప్రముఖ సింగర్ తన భార్య ఎస్పీ శైలజ దయచేసి మీరు పాటలు పాడవద్దని వారి మధ్య జరిగిన సంభాషణను చమత్కరంగా వివరించారు. మారుతున్న కాలంతోపాటు 35 సంవత్సరాలుగా కళాంజలి సంస్థ చేస్తున్న సేవలను అభినందించారు. అలాగే పాడుతా తీయగా ఫైనలిస్ట్ శరత్చంద్రకు కళాంజలి అవార్డును అందజేశారు. కార్యక్రమంలో లాయర్ వారపత్రిక సంపాదకుడు తుంగాశివప్రభాత్రెడ్డి, కాసా పెంచల వరప్రసాద్ నాయుడు, బయ్యా వెంకటరవికుమార్, వీరిశెట్టి హజరత్‌బాబు, వాకాటి విజయకుమార్‌రెడ్డి, ఎన్.బలరామయ్యనాయుడు, ఎన్వీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యాఖ్యాతగా డి.అరుణ్‌కుమార్ వ్యవహరించారు. బిల్లీశ్యాంసన్ ఆధ్వర్యంలో గాయకబృందం పాడిన పాటలు అలరించాయి. కార్యక్రమాన్ని కళాంజలి వ్యవస్థాపకుడు అనంత్, ఆర్గనైజర్ దువ్వూరు బెనర్జీ, సభ్యులు జి.శివకుమార్‌రెడ్డి పర్యవేక్షించారు. -
తారక్ వండర్ కిడ్: ఎన్టీఆర్‌పై శుభలేఖ సుధాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఈ సినిమాలోని నాటు నాటు ఆస్కార్ రావడంతో గ్లోబల్ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ఆయనతో పని చేసిన ప్రతి నటీనటులు తారక్ డాన్స్, నటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. ఎన్ని పేజీల డైలాగ్ అయినా సింగిల్ టేక్‌లో చెప్పేస్తుంటాడంటూ సర్ప్రైజ్ అవుతుంటారు. అలాగే సీనియర్ నటుడు శుభలేక సుధాకర్ కూడా తారక్ నటన, డైలాగ్ డెలివరి గురించి చెబుతూ వండర్ కిడ్ అని కొనియాడారు. ‘అరవింద సమేత’ సినిమాలో ఎన్టీఆర్‌తో ఆయన స్క్రిన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘రానా నాయుడు’ సిరీస్‌పై నటుడు శివకృష్ణ సంచలన వ్యాఖ్యలు ఈ మూవీ సమయంలో ఆయన ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన పాత వీడియో తాజాగా వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ నటన గురించి ఏం చెప్పిన తక్కువే. ఆయన ఎప్పుడు డైలాగ్ చదువుతాడో తెలియదు. టేక్ అనగానే మూడు, నాలుగు పేజీల డైలాగ్ అయినా సింగిల్ టేక్‌లో చెబుతాడు. సెట్లో ఎప్పుడు సరదగా ఉండే తారక్.. డైలాగ్ పేపర్ చూసుకోవడం నేనెప్పుడు చూడలేదు. ఆయన కెమెరా కోసమే పుట్టారనిపిస్తుంది. ఇదంతా సినిమా పట్ల ఆయనకు ఉన్న కసి, కృషి వల్లేనేమో. చెప్పాలంటే తారక్ వండర్ కిడ్’ అంటూ ఎన్టీఆర్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. చదవండి: నాటు నాటు సాంగ్ పెడితేనే నా కొడుకు తింటున్నాడు, అది కూడా తెలుగులోనే: కరీనా కపూర్ -
నటుడు ‘శుభలేఖ’ సుధాకర్‌కు ఇంట విషాదం
Subhalekha Sudhakar Mother Passed Away: ప్రముఖ నటుడు ‘శుభలేఖ’ సుధాకర్ మాతృమూర్తి, సినీ నేపధ్యగాయని ఎస్పీ శైలజ అత్తమ్మ అయిన ఎస్ఎస్ కాంతం (82) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. చెన్నై మహాలింగపురంలోని సుధాకర్ నివాసంలో తండ్రి సూరావజ్జల కృష్ణారావు, తల్లి ఎస్ఎస్ కాంతం ఉండేవారు. రెండేళ్ల క్రితం కృష్ణారావు మరణించారు. తల్లి కాంతం సుమారు మూడు నెలల క్రితం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించగా వృద్ధాప్య, అనారోగ్య కారణాలతో మంగళవారం ఉదయం ఆమె మృతి చెందారు. కృష్ణారావు, కాంతం దంపతులకు ముగ్గురు కుమారులు కాగా సుధాకర్ పెద్దవారు. రెండో కుమారుడు మురళీ దత్తుపోయి వైజాగ్‌లో, మూడో కుమారుడు సాగర్ అట్లాంటాలో స్థిరపడ్డారు. బుధవారం మధ్యాహ్నం చెన్నైలో ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి. కాగా ఏఐటీఎఫ్ అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డి.. కాంతం భౌతికకాయానికి ఘన నివాళి అర్పించారు. -
టీవీ మా పొయ్యి వెలిగించింది!
చెన్నై మహాలింగ పురంలోని ప్రశాంత ఆలయ వాతా వరణానికి దగ్గరగా, అక్షరాలా అందుకు తగ్గట్లుగానే ఉంది నటుడు ‘శుభలేఖ’ సుధాకర్, గాయని శైలజల నివాసం. గేటు తీసుకొని వసారా దాటి లోపలకు అడుగుపెడితే, ఇంట్లోనూ అదే ప్రశాంతత. మధ్యతరగతి కుటుంబ జీవితానికి దగ్గరగా దేవుడి విగ్రహాలు, పటాలు, వెలిగించిన అగరొత్తుల పరిమళం... హంగామా లేని హుందాతనం, తెలియని సంతృప్తి ఏదో నట్టింట్లో నడయాడు తున్నట్లని పిస్తుంది. సుధాకర్‌ను పలకరిస్తే... ఆ మాటల్లోనూ అంతే స్వచ్ఛత... నిజాయతీ! వెండితెరపై వినోదం పండించడంతో మొదలుపెట్టి, బుల్లితెరపై విలనిజాన్ని పండిస్తూ ఇన్నేళ్ళుగా అలరిస్తున్న నటుడాయన. మూడుదశాబ్దాల పైగా చిరపరిచితుడైన ఆయన, ఎస్పీ శైలజల వివాహ బంధానికి ఇటీవలే సిల్వర్ జూబ్లీ అయింది. సూరావఝల బదులు ‘శుభలేఖ’ సినిమాయే ఇంటిపేరైపోయిన సుధాకర్‌తో భేటీ... ...::: రెంటాల జయదేవ ఈ మధ్య సీరియల్స్‌లో ఎక్కువ కనిపిస్తున్నారు. అటు దృష్టి పెట్టారా? చెబితే ఇది చిత్రంగా ఉంటుంది కానీ, నిజం ఏమిటంటే సినిమాల్లో అవకాశాలు తక్కువగా ఉండడం వల్లే, టీవీలో కనిపిస్తున్నాను. 1989 డిసెంబర్ 21న నాకూ, ఎస్.పి. శైలజకూ పెళ్ళయింది. నిజానికి, మా పెళ్ళి వరకు మేమిద్దరం ఎవరి కెరీర్లలో వాళ్ళం చాలా బిజీగా ఉన్నాం. అలాంటిది, పెళ్లయిన తరువాత నుంచి చిత్రంగా ఇద్దరికీ అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇంతలో సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. ఇక్కడ నుంచి వెళ్ళాలా, వద్దా అని సందిగ్ధావస్థ వచ్చింది. అలా మద్రాసులోనే ఉండిపోయాను. మరి మీరు టీవీ రంగంలోకి ఎలా వచ్చారు? అప్పట్లో ‘ఈ’ టి.వి. వారు ఒక సినిమా క్విజ్ పెట్టి, ఆ కార్యక్రమం నాతో చేయించారు. అలా నెలకు 5 రోజులు పని దొరికింది. ఆ తరువాత తమిళ ‘సన్’ టి.వి. వచ్చింది. సీరియల్స్‌లో నాకు అవకాశాలు వచ్చాయి. మద్రాసులో తమిళ, తెలుగు భాషల్లో తయారవుతున్న ధారావాహికల్లో నటిస్తున్నా. అయితే, టీవీతో ఫుల్ బిజీ అన్న మాట! (నవ్వేస్తూ...) ఇక్కడ వచ్చిన సమస్య అదే! టీవీలో డైలీ సీరియల్లో కనబడేసరికి, ఫుల్ బిజీ అనుకుంటారు. నెలలో 30 రోజులూ పని ఉండదు. కేవలం కొద్ది రోజులు పని ఉంటుంది. ఆ కొద్ది రోజుల్లో బాగా ప్లాన్ చేసి, సన్నివేశాలు తీస్తారు. ఆ కొద్ది దృశ్యాలే అక్కడొకటి ఇక్కడొకటి చొప్పున నెలంతా బుల్లితెరపై కనిపించేసరికి, ఆర్టిస్టుతో ‘మీరు చాలా బిజీగా ఉన్నారండీ’ అనేస్తారు. అయితే ఆదాయం మాటెలా ఉన్నా, నేను టీవీలో వేసిన పాత్రలు తెచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. సినిమాల్లో ఇంత వెరైటీ పాత్రలు నాకు వచ్చేవో, కాదో తెలియదు. మీకు పేరు తెచ్చిన సీరియల్స్? దర్శకుడు కె. బాలచందర్ గారు నిర్మాతగా, సముద్రఖని దర్శకత్వంలో తమిళం చేసిన ‘అన్ని’ సీరియల్ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ (‘వదిన’) మంచి పేరు తెచ్చింది. ఆ మధ్య ‘రక్తచరిత్ర’, ‘బెజవాడ’ల్లో పేరొచ్చినా... (మధ్యలోనే అందుకుంటూ...) చాన్సలు రాలేదు. అదే విచిత్రం. ‘రక్తచరిత్ర-2’ కానీ, ‘బెజవాడ’ కానీ బాగా ఆడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఆడకపోవడం దెబ్బ అయింది. ‘ముత్యాల ముగ్గు’లో నటుడు మాడా ‘చేతికెంత? కాలికెంత?... హోల్ మొత్తం మీద కన్సెషన్ ఏమైనా ఉందా?’ అంటూ ఒక్క సీన్లో కనిపిస్తారు. అది ఆయనను మరో పదేళ్ళు నటుడిగా బతికించింది. కానీ, ఇవాళ సినిమా సక్సెస్‌ను బట్టే చూస్తున్నారు తప్ప, ఆర్టిస్ట్ సక్సెస్‌ను బట్టి లెక్కలోకి తీసుకోవడం లేదు. అసలు మీరు నటన వైపు ఎలా వచ్చారు? ప్రతి ఆర్టిస్టుకూ ఎవరో ఒక ఆర్టిస్ట్ ప్రేరణ ఉంటుంది. నేను అమితాబ్ సినిమాలు చూసి, నటుడిగా ఆయనను ఆరాధించి, సినిమాల్లోకి వచ్చాను. చిన్నప్పుడు వైజాగ్‌లో చదువుకొనే రోజుల్లో ఎన్టీఆర్, ఏయన్నార్ల సినిమాలు ఆరాధనగా చూసేవాణ్ణి. సినిమాల్లోకి వెళ్ళాలని కోరిక పుట్టింది. అనేక పరిణామాల మధ్య మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సీటు వచ్చింది. నటులు శ్యామలగౌరి, రాంకీ, అరుణ్ పాండ్యన్లు నా బ్యాచ్మేట్లు. అసలు ఇన్స్టిట్యూట్లో నేర్పితే.... నటన వస్తుందంటారా? (నవ్వేస్తూ...) నటన ఇలా చేయాలంటూ ఇన్స్టిట్యూట్లో చెప్పరు. నటించాల్సిన సన్నివేశాన్ని నిజజీవితంలోని సంఘటనతో సమన్వయం చేసుకుంటూ, దానికి ఎలా స్పందిస్తారో ఆలోచించి, అలా స్పందించమంటారు. ఆ ఆలోచనా ప్రక్రియను నేర్పుతారు. అప్పట్లో లక్ష్మీ కనకాల మా టీచర్. దేవదాస్ కనకాల కూడా మాకు నేర్పేవారు. విశ్వనాథ్, బాపు, రాఘవేంద్రరావు, జంధ్యాల లాంటి దిగ్దంతుల దగ్గర పనిచేశారు. వాళ్ళ పని తీరెలా ఉండేది? జంధ్యాల గారిది ఎక్కువగా డైలాగ్ మీద ఆధారపడి నడిచే పద్ధతి. యాక్టింగ్ కన్నా, డైలాగ్‌ను ఎక్కడ, ఎలా విరవాలి, ఎలా పలకాలన్నదానికి ప్రాధాన్యమిచ్చేవారు. కె. విశ్వనాథ్ గారేమో సహజమైన నటనకు ప్రాధాన్యమిస్తూ, ఫలానా డైలాగ్‌కు ఫలానా పని చేస్తూ, నటుడు అభినయించాలని చెబుతారు. బాపు గారి చిత్రీకరణలో ఫ్రేమింగ్‌కు ప్రాధాన్యం. ప్రతి దృశ్యం చక్కగా గీసిన బొమ్మలా ఉంటుంది. ఇలాంటి పెద్దలందరి దగ్గర నేర్చుకున్నదంతా తరగని గని అయింది. టీవీకొచ్చాక, రకరకాల పాత్రలు చులాగ్గా పోషించగలిగా. కానీ, టీవీలో పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయా? (విరక్తిగా...) పరిశ్రమకు కొత్తగా వచ్చి, కంటిన్యుటీ రాసుకొనే అసిస్టెంట్ దర్శకుడు సైతం టీవీలో ఆపద్ధర్మానికి రెండో రోజుకే దర్శకుడైపోతున్నాడు. ఎవరైనా యాక్టర్ కావచ్చు కానీ, దర్శకుడవడం సులభం కాదు. డెరైక్షనంటే యాక్షన్, కట్ చెప్పడం కాదు. కానీ, సీరియల్స్ చేస్తున్నప్పుడు ఇవన్నీ పట్టించుకోకూడదు. మీ దృష్టిలో సినిమాకూ, టీవీకీ తేడా? టీవీలోలా సినిమాల్లో నటుడి మీద రకరకాల ప్రయోగాలు చేయరు. ఒక రకం పాత్రతో గుర్తింపొస్తే, ఆ తరహా పాత్రల్నే ఇస్తారు. కానీ టీవీ వార్తాపత్రికైతే, సినిమా మంచి పుస్తకం లాంటిది. పదేపదే చదువుకోవచ్చు. చెన్నైలో ఉండడంతో హైదరాబాద్ పిలవడం లేదేమో! 1982 నుంచి ఇప్పటి దాకా గడచిన 32 ఏళ్ళలో నేను నేర్చుకున్నది ఏమిటంటే, సినిమా వాళ్ళకు అవసరం అనుకుంటే, మీరు అంటార్కిటికాలో ఉన్నా పిలుస్తారు. అవసరం లేదనుకుంటే, పక్కనే, కళ్ళ ముందే ఉన్నా పిలవరు, పట్టించుకోరు. ఉన్నమాట చెప్పాలంటే, మద్రాసు నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నా, ఎక్కువ మందికి పని లేదు. (కాస్త ఆవేశంగా...) ఏం మనకు రంగనాథ్ గారు, గిరిబాబు గారు - ఇలా ఎంత మంది లేరు. ఇవాళ నటించడం, డైలాగ్ చెప్పడం చేతగాని చాలామంది పరభాషా నటులతో పోలిస్తే, తండ్రి పాత్రలకో, మరో దానికో వాళ్ళు సరిపోరా? కనీసం చిన్న సినిమాలకు కూడా వాళ్ళు పనికిరారా? ఏమైనా ఆ దేవుడు నాకు ఒక తలుపు మూసినా, టీవీ అనే మరో తలుపు తెరిచాడు. అందుకే, జీవితంలో దేన్నీ నెగటివ్‌గా తీసుకోను. మరి, పెళ్ళయ్యాక చాన్సుల్లేనప్పుడు మీ మానసిక పరిస్థితి? అది చెప్పలేని పరిస్థితి. ఎప్పుడు ఫోన్ మోగినా ఎవరి నుంచైనా వేషానికి పిలుపొచ్చిందేమో? నాకు కాకపోయినా కనీసం శైలజకైనా పాట ఛాన్స్ అయితే బాగుండు అనుకున్న రోజులు ఎన్నో! (గొంతు జీరపోతుండగా...) చివరకు బ్యాంకులో వంద రూపాయలే ఉన్న రోజులూ ఉన్నాయి. కనీసం నేను రెండు పూటలా ఆమెకు అన్నమైనా పెట్టగలనా అని భయపడ్డాను. ఇంతలో మాకో అబ్బాయి. మూడో ఏట మా అబ్బాయికి బాగా మాటలు వచ్చాయి. ‘నాన్న ఎప్పుడూ ఇంట్లోనే కూర్చొని ఉన్నాడేమిట’ని అంటాడేమో అని నాకు భయం వేసేది. మాటల్లో చెప్పలేని విషయం. పగవాడికి కూడా ఆ పరిస్థితి రాకూడదు. దేవుడి దయ వల్ల మా ఇంట్లో మళ్ళీ దీపం పెట్టింది, పొయ్యి వెలిగించింది టీవీనే! అంత క్లిష్ట స్థితిలో మీరిద్దరికీ గొడవ... (మధ్యలోనే అందుకొని...) అవకాశాలు లేకపోవడం ఒక రకంగా నెగటివ్ అయినా, మాకు పాజిటివ్ కూడా అయింది. చాలా పాఠాలు నేర్చుకున్నా. మాకు చేతిలో పని లేని కాలం మా ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పటిష్ఠం చేసింది. ఎవరి దగ్గరా చేతులు చాచి అడగడం, అప్పు చేయడం లాంటివి మా ఇద్దరికీ నచ్చదు. అందుకే, ఉన్నదాంట్లోనే గుట్టుగా సంసారం నడిపాం. ఒక రూపాయి వస్తే, దానిలో అరవై పైసలే ఖర్చు చేసి, నలభై పైసలు రేపటి కోసం జాగ్రత్త చేస్తూ, ఇంటిని నడిపిన బెస్ట్ హౌస్‌వైఫ్ శైలజ. కానీ, మీ బంధం సరిగ్గా లేదంటూ ఏవేవో వార్తలు.... (మధ్యలోనే...) ఉయ్ నెవర్ గేవ్ ఎ కేర్ ఫర్ ఇట్. మేము విడాకులు తీసుకున్నామని కూడా పత్రికల్లో వచ్చింది. ఇప్పటికీ ఆ మాట అడిగేవాళ్ళున్నారు. అప్పట్లో ఒక సినిమా పత్రిక ఎడిటర్ తమాషాగా రాసిన వార్తతో జరిగిన గొడవ ఇది. సారథీ స్టూడియోలో ‘ఈశ్వర్ అల్లా’ షూటింగ్లో ఉండగా ‘శివరంజని’ ఎడిటర్ బాలరెడ్డి గారు కలిశారు. ఆయన సెన్సేషన్ చేస్తూ ‘శుభలేఖ సుధాకర్, శైలజ విడిపోయారా?’ అని ఏదో సరదాగా రాశారు. అది గొడవ అయింది. ఆ వార్త చదివి పి.జె. శర్మ గారి లాంటి శ్రేయోభిలాషులు ఆవేశపడ్డారు. కానీ, పోనీలెమ్మని వదిలేశా. నాకెవరి మీదా కోపం లేదు. దాని వల్ల ఆరోగ్యం, ప్రశాంతత కోల్పోవడం తప్ప ఉపయోగం లేదు. చెప్పింది చెప్పినట్లు కాక, మరొకలా రాయడంతో వచ్చే తంటా ఇది. అప్పటికీ ఇప్పటికీ మా వివాహబంధం పటిష్ఠంగా ఉంది. మీ కెరీర్లలో మీ బావ గారైన ఎస్పీబీ అండదండలు లేవా? ఊహల మాటెలా ఉన్నా, ఉన్న నిజం ఏమిటంటే, ఆయనెప్పుడూ మా కెరీర్లో జోక్యం చేసుకోలేదు, చేసుకోరు. జోక్యం చేసుకోవాలని మేము ఆశించనూ లేదు! ‘ఆయన కలిగించుకొని మీకు సిఫార్సు చేయవచ్చు కదా’ అన్నవాళ్ళూ ఉన్నారు. అది తప్పు. ప్రతిభను బట్టి వాళ్ళు స్వశక్తితో పైకి రావాలే తప్ప, ఆయనెలా సిఫార్సు చేస్తారు! కానీ, ఓదార్పుకు ఎవరిని ఆశ్రయించేవారు? జీవితం చాలా గొప్ప టీచర్. అది మనకెంతో నేర్పుతుంది. మా తాత గారికి12వ సంతానం మా నాన్న గారు. ఆ రోజుల్లో ఆయనకు ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్‌లో సీటొచ్చినా, స్థోమత లేక చేర్చలేకపోయారు. అందుకే, మేము ఒక్క పిల్లాడు చాలని ఫుల్స్టాప్ పెట్టేశాం. అయిదో ఏట నుంచే మా అబ్బాయి శ్రీకర్‌కి కూడా అన్నీ చెబుతూ వచ్చాం. ఇవాళ వాడు ఢిల్లీ మీడియా మేనేజ్మెంట్లో ఎం.బి.ఏ. చదువు స్థాయికి చేరాడు. ఇన్నేళ్ళ జీవితం మీకు నేర్పిన పాఠం? జీవితం పేకముక్కల సెట్టు లాంటిది. ఏ కార్డు ఎప్పుడు పడుతుందో ఎవరికీ తెలియదు. అన్నిటికీ ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అమితాబ్‌తో వాళ్ళ నాన్నగారు హరివంశ్ రాయ్ బచ్చన్ ‘మన్ జో సోచా - హువా తో అచ్ఛా! నహీ హువా తో బహుత్ అచ్ఛా!!’ అని చెప్పారట. ఏది జరిగినా, అంతా మన మంచికే అనుకోవడమంటే అదే. ఫొటోలు: వన్నె శ్రీనివాసులు, చెన్నై నేను పెద్దగా పుస్తకాలు చదవను. కానీ, మా ఆవిడ శైలజకు పుస్తకాలే ఆప్తమిత్రులు. చదివిన విషయాలు ఆమె ప్రస్తావిస్తుంటే, ఆమె దగ్గర నుంచి నేను నేర్చుకుంటుంటా. బి.కావ్‌ు చదివినా, ఆర్థిక నిర్వహణ నాకు తెలియదు. ఒడుదొడుకులనెదుర్కొన్నా, ఇవాళ మేము ఈ మాత్రం ఆర్థికంగా స్థిరంగా ఉన్నామంటే అది శైలజ సమర్థతే. సంపాదించే ప్రతి రూపాయిలో కొంత పిల్లాడి చదువుకూ, కొంత భవిష్యత్ అవసరాలకూ ఆదా చేశాకే, మిగిలినది ఖర్చు చేస్తాం. నేను, మా ఆవిడ, మా అబ్బాయి - ముగ్గురం కలసి, కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. నిర్ణయాలు తీసుకుంటుంటాం. మా అబ్బాయి శ్రీకర్ కూడా పుస్తకాలు తెగ చదువుతాడు. మొదటి రోజు, మొదటి ఆటే సినిమాలు చూస్తాడు. వాటి గురించి అద్భుతంగా విశ్లేషిస్తాడు. వాడిప్పుడు ఢిల్లీలో మీడియా మేనేజ్మెంట్లో ఎం.బి.ఎ. చేస్తున్నాడు. -
మన ఇంట్లోనో ..పక్కింట్లోనే జరిగినట్లు..
చెన్నై : తనకు సినిమాల్లో అవకాశం తగ్గినప్పుడు బుల్లితెర ద్వారా బాలచందర్ ఛాన్సులు ఇచ్చి ..తనకు భిక్ష పెట్టారని నటుడు శుభలేఖ సుధాకర్ అన్నారు. ఆయన బుధవారం ఉదయం బాలచందర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ బాలచందర్ తనకు గురువు అని గుర్తు చేసుకున్నారు. ఆయన తీసిన సినిమాలు మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించినవేనని... వారి సమస్యలతో పాటు మానసిక స్థితిని వెండితెరపై బాగా చూపించేవారన్నారు. బాలచందర్ సినిమాలు ప్రేక్షకులకు దగ్గరగా ఉంటాయని..'మన ఇంట్లోనో లేక పక్కింట్లోనే..ఎక్కడో జరిగినట్లుగా నిజ జీవితానికి' దగ్గరగా ఉంటాయన్నారు. ఆయన సృష్టించిన పాత్రల్లో నటించిన నటులకు కూడా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. మధ్య తరగతి కుటుంబాల మానసిక స్థితిని ఏ దర్శకుడు ఇంత దగ్గరగా చిత్రీకరించలేదన్నారు. ఈ సందర్భంగా బాలచందర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని శుభలేఖ సుధాకర్ గుర్తు చేసుకున్నారు.