'ఒక బృందావనం' మూవీ రివ్యూ | Oka Brundavanam Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

'ఒక బృందావనం' మూవీ రివ్యూ

May 24 2025 12:48 PM | Updated on May 24 2025 12:58 PM

Oka Brundavanam Movie Review And Rating In Telugu

కంటెంట్‌ బాగుంటే చాలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమాను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే ఈ మధ్యకాలంలో నూతన నటీనటులతో తెరకెక్కించే సినిమాలు ఎక్కువయ్యాయి. వాటిలో చాలా వరకు విజయం సాధిస్తున్నాయి కూడా. అలా వచ్చిన మరో చిన్న చిత్రమే ‘ఒక బృందావనం’. నూతన నటీనటులు బాలు, షిన్నోవాలతో పాటు శుభలేక శుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూప లక్ష్మి, సాన్విత, కళ్యాణి రాజు, మహేంద్ర, డి.డి. శ్రీనివాస్ మరియు ఇతర సీనియర్‌ నటీనటులు ఈ చిత్రంలో నటించారు.  బొత్స సత్య దర్శకత్వంలో కిషోర్‌ తాటికొండ, వెంకట్‌ రేగట్టే, ప్రహ్లాద్‌ బొమ్మినేని, మనోజ్‌ ఇందుపూరు నిర్మించిన ఈ చిత్రం మే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
కెమెరామెన్‌ రాజా విక్రమ్‌(బాలు) ఆర్థిక కష్టాలతో బాధపడుతూ ఉంటాడు. ఎప్పటికైనా అమెరికాకు వెళ్లి బాగా డబ్బు సంపాదించాలనుకుంటాడు. మహి(షిన్నోవా).. చనిపోయిన వాళ్ల అమ్మ చేయాలనుకున్న డ్యాక్యుమెంటరీని తీయాలనుకుంటుంది. దీని కోసం పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకొని ఇంటి నుంచి బయటకు వస్తుంది. అనాథ అయిన నైనికా(సాన్విక)..తనకు ప్రతి క్రిస్మస్‌కి బహుమతులు పంపిస్తున్న జోసెఫ్‌(శుభలేక సుధాకర్‌)ని కలిసి తన పేరెంట్స్‌ గురించి తెలుసుకోవాలనుకుంటుంది. అందుకోసం అనాథ ఆశ్రమం నుంచి పారిపోవాలనుకుంటుంది. ఈ ముగ్గురు వివిధ కారణాలతో కలుస్తారు. మహి తన డాక్యూమెంటరీకి కెమెరామెన్‌గా రాజాను తీసుకుంటుంది. జోసెఫ్‌ని కలిపిస్తామని చెప్పి.. నైనికతో డాక్యూమెంటరీ వీడియో తీసేందుకు ఒప్పిస్తారు. అసలు ఆ డాక్యూమెంటరీ దేని గురించి? చివరకు అది పూర్తయిందా లేదా? అమెరికా వెళ్లాలనుకున్న రాజా కోరిక నెరవేరిందా? నైనికాకు జోసెఫ్‌ ఎందుకు బహుమతులు పంపిస్తున్నాడు? చివరకు జోసెఫ్‌ని నైనికా కలిసిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
ఎలాంటి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు ఒక పాప కోసం చేసిన ఎమోషనల్‌ జర్నీయే ‘ఒక బృందావనం’ మూవీ. కథ పరంగా ఇది రొటీనే అయినా.. కథనం, స్క్రీన్‌ప్లే మాత్రం ఆకట్టుకునేలా ఉంటుంది.  వినోదంతో పాటు ఓ మంచి సందేశాన్ని కూడా ఈ చిత్రం ద్వారా అందించాడు దర్శకుడు. 

ఫస్టాప్‌ కాస్త సాగదీతగా అనిపించినా.. ద్వితియార్థం అంతా చాలా ఎమోషనల్‌ జర్నీగా సాగుతుంది. మూడు పాత్రల పరిచయానికే దర్శకుడు సమయం ఎక్కువ తీసుకున్నాడు. ఈ ముగ్గురు కలిశాక కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఒక ఎమోషనల్‌ సీన్‌తో ఇంటర్వెల్‌ కార్డ్‌ పడుతుంది. సెకడాఫ్‌లో జోసెఫ్‌ని వెతుక్కుంటూ  ఈ ముగ్గురు చేసే ప్రయాణం చుట్టే కథనం తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయిస్తే..మరికొన్ని సీన్లు కంటతడి పెట్టిస్తాయి. ఉమెన్ ఎంపవర్‌మెంట్‌ గురించి ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది. మొత్తంగా కథనం కాస్త నెమ్మదిగా సాగినా.. ఓపికతో చూస్తే మాత్రం హృదయాలను ఆకట్టుకుంటుంది. ఎలాంటి వల్గారిటీ,వయోలెన్స్‌ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఈ సినిమాను తీర్చి దిద్దారు. 

ఎవరెలా చేశారంటే.. 
ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించినవారంతా నూతన నటీనటులే అయినప్పటికీ చక్కగా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కెమెరామెన్‌ రాజాగా బాలు చక్కగా నటించాడు. మహి పాత్రకి పిన్నోవా న్యాయం చేసింది.  చైల్డ్ ఆర్టిస్ట్ సాన్విత  ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. మహేందర్, మహబూబ్ బాషాల కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది.

 ఇక సీరియర్‌ నటీనటులు శుభలేక సుధాకర్‌,  శివాజీ, అన్నపూర్ణమ్మతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సన్నీ సాకేత్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది.  పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. కేరళ అందాలను తెరపై  చక్కగా చూపించారు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement