కథలకు ప్రాణం పోసిన టాప్‌ హీరోయిన్స్‌.. ఓటీటీలో ఈ చిత్రాలు ఎవర్‌గ్రీన్‌ | South Indian Top Women-Centric Movies That Are Must Watch List - Sakshi
Sakshi News home page

కథలకు ప్రాణం పోసిన టాప్‌ హీరోయిన్స్‌.. ఓటీటీలో ఈ చిత్రాలు ఎవర్‌గ్రీన్‌

Published Sat, Nov 25 2023 1:51 PM | Last Updated on Sat, Nov 25 2023 2:47 PM

 South Indian Top Women-Centric Movies Are Must Watch List - Sakshi

సౌత్‌ సినిమా పరిశ్రమలో హీరోలుకు ఏ మాత్రం తగ్గకుండా  ఇప్పుడు హీరోయిన్‌లు సైతం సోలోగా కథలను నడిపించేస్తున్నారు. సింగిల్‌గానే వచ్చి బాక్సాఫీస్‌ వద్ద కోట్లు కొల్లగొడుతున్నారు. తమ స్టార్‌డమ్‌తో సినీప్రియుల్ని థియేటర్లకు రప్పించి.. వారి సత్తా ఎంటో  బాక్సాఫీస్‌ ముందు చూపిస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో హీరోయిన్‌ ప్రాధాన్యం ఉన్న చిత్రాల జోరు కొనసాగుతుంది. అయితే ఇదీ నిన్నమొన్న మొదలైన ప్రస్థానం కాదు. సుమారు కొన్నేళ్ల క్రితమే ఈ ట్రెండ్‌ మొదలైంది. సమంత, అనుష్క, నయనతార, కీర్తి సురేష్‌ వంటి స్టార్లు ముందు వరుసలో ఉన్నారు. 

అనుష్క సినీ కెరియర్‌లో అరుంధితి సినిమా చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఈ సినిమాకు ముందు ఆమె సుమారు 15 చిత్రాల్లో నటించింది.  అప్పటి వరకూ గ్లామర్‌ పాత్రలే పోషించిన అనుష్కను లేడీ సూపర్‌ స్టార్‌ చేసింది కూడా 'అరుంధతి' సినిమానే. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనుష్క కెరీర్‌లో మైలు రాయిగా నిలిచింది. 2009 జనవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అరుంధతి వచ్చి ఇప్పటికి  15ఏళ్లు కావస్తోంది. ఈ సినిమాతో సౌత్‌ ఇండియాలో మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్‌గా అనుష్క చేరిపోయింది. అలా అరుంధతి చిత్రం సినీ ప్రేమికుల మస్ట్‌ వాచబుల్‌ లిస్ట్‌లో చేరిపోయింది. డిస్నీప్లస్‌ హాట్‌ స్టార్‌లో  అరుంధతి స్ట్రీమింగ్‌ అవుతుంది.

కిర్తీ సురేష్‌.. ప్రస్తుతం సౌత్‌ ఇండియాలో టాప్‌ హీరోయిన్ల లిస్ట్‌లో సత్తా చాటుతుంది.  ఓ వైపు కమర్షియల్‌ చిత్రాలతో అలరిస్తూనే మరోవైపు కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలతో ప్రేక్షకులను కట్టి పడేయగలదు. ఈతరం 'మహానటి'గా కీర్తి సురేష్‌ గుర్తింపు పొందింది. అలనాటి తార సావిత్రిని వెండితెరపై మరోనటి ఆవిష్కరించడం సాధ్యమయ్యే పనేనా..? అని అందరూ అనుకుంటున్న సమయంలో ఆ పాత్రకు జీవం పోసి ప్రశంసలు పొందింది.

2018లో మహానటి చిత్రంతో ఆమె కెరియర్‌ ఒక్కసారిగా మారిపోయింది. అంతర్జాతీయంగా విజయం అందుకున్న ఈ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్‌ చేశాడు. ఈ సినిమా కిర్తీ సురేష్‌కు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా సౌత్‌ ఇండియా సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రగా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెజాన్‌ ప్రైమ్‌లో మహానటి చిత్రాన్ని చూడవచ్చు.

మోస్ట్‌ బ్యూటిఫుల్‌ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో సమంత ఒక ట్రెండ్‌ను సెట్‌ చేసింది. ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించి సూపర్‌ హిట్స్‌ను అందుకుంది. కానీ లేడీ ఓరియేంటేడ్‌ చిత్రం అయిన  'యశోద' చిత్రం ఒక అద్భుతమైన ప్రయోగం అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఎన్నో ట్విస్ట్‌లు ఉంటాయి. అన్నీ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. తన చెల్లిని కనిపెట్టడం కోసం హీరోయిన్‌ కృత్రిమ గర్భాన్ని ధరించి వెళ్లడం అనే సాహసవంతమైన పాయింట్‌తో దీనిని తెరకెక్కించారు.ఇందులో సమంత నటనకు 100 మార్కులకు మించి వేయవచ్చు. అంతలా తన రోల్‌లో ఆమె మెప్పిస్తుంది.

హరి-హరీష్‌ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా యాక్షన్‌ థ్రిల్లర్‌.. దాదాపు రూ.50కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి వెండితెరపై సంచలనం సృష్టించింది. ఈ చిత్రం కోసం సమంత తొలిసారిగా గర్భవతిగా కనిపించడమే కాక.. డూప్‌ లేకుండా ఫైట్స్‌ సీన్స్‌ చేసింది. ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

సినిమాలో అసలైన లేడీ సూపర్‌ స్టార్‌ అంటే  నయనతారనే అని చెప్పవచ్చు. సినిమా కెరియర్‌ నుంచే ఆమె పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుంది.. అలా కాకుండా నాలుగు పాటలు, రెండు రొమాన్స్‌ సీన్స్‌కు మాత్రమే పరిమితం చేస్తే వెంటనే నో చెబుతుంది. సీనియర్‌ నటి విజయశాంతి తర్వాత ఎక్కువగా లేడీ ఓరియేంటెడ్‌ చిత్రాల్లో నటించింది కూడా నయనతారనే అని చెప్పవచ్చు. ఆమె సినిమాలో మాత్రమే నటిస్తుంది నో ప్రమోషన్స్, నో ప్రెస్‌మీట్స్, నో స్పెషల్ ఇంటర్వ్యూస్… సినిమా చేశామా, చేతులు దులిపేసుకున్నామా అంతే అనేలా ఉంటుంది.

ఒక్కో సినిమాకు రూ.10కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుంటూ టాప్‌లో ఉంది. నయనతార ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం 'ఆరమ్'. ఈ చిత్రం 'కర్తవ్యం' పేరుతో తెలుగులోకి అనువాదమైంది. ఈ సినిమాలో కలెక్టర్‌గా నయన్‌ మెప్పిస్తుంది. బోరుబావిలో పడిపోయిన ఒక చిన్నారిని కాపాడే క్రమంలో ఒక కలెక్టర్‌గా ఆమె వ్యవహరించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

సుమారు ముప్పయ్యేళ్ల క్రితమే పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మధుబాల సత్తా చాటింది. మణిరత్నం దృశ్యకావ్యం అయిన 'రోజా'లో ఆమె నటన యావద్దేశాన్నీ కట్టిపడేసింది. మనసును దోచుకునే చిరునవ్వుతో అందానికి చిరునామా అనిపించుకున్న మధుబాల... కొన్నేళ్లకే వెండితెరకు దూరమైంది. 'రోజా' విడుదలయ్యాక దేశవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగింది. ఎక్కడికెళ్లినా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ రోజా అంటూ ఆప్యాయంగా పలకరించేవారు.

ఇప్పటికీ ఆమెను రోజా మధుబాల అనే పిలుస్తుంటారు. 30 ఏళ్లు అయినా ఆ సినిమాకు ఉన్న క్రేజ్‌ అలాంటింది. సినిమా అవకాశాలు వస్తున్నా పెళ్లి తర్వాత సినిమా కెరియర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేసింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌తో మళ్లీ తెరమీదకొచ్చిన ఆమె ‘శాకుంతలం’లో మేనకగా కనిపించింది. రోజా సినిమా అమెజాన్‌ ప్రైమ్‌,జీ5లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement