Sir Movie Review : ధనుష్‌ ‘సార్‌’ పాఠాలు ఎలా ఉన్నాయి?

Sir Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: సార్‌(తమిళ్‌లో ‘వాతి’)
నటీనటులు: ధనుష్, సంయుక్త మీనన్, సముద్ర ఖని, హైపర్‌ ఆది తదితరులు
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: వెంకీ అట్లూరి
సంగీతం: జీవీ ప్రకాశ్‌ కుమార్‌
సినిమాటోగ్రఫీ:  జె.యువరాజ్
ఎడిట‌ర్: న‌వీన్ నూలి
విడుదల తేది: ఫిబ్రవరి 17, 2023

తమిళ స్టార్‌ ధనుష్‌కి తెలుగులో మంచి మార్కెట్‌ ఉంది. ఆయన కోలీవుడ్‌లో నటించిన చిత్రాలన్ని తెలుగులో డబ్‌ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. అందుకే ఈ సారి నేరుగా తెలుగులోనే ‘సార్‌’(తమిళ్‌లో ‘వాతి’) సినిమా చేశాడు. ఇప్పటికే  విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్‌ని క్రియేట్‌ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
ఈ సినిమా కథంతా 1998-2000 కాలంలో సాగుతుంది. త్రిపాఠీ విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్‌ త్రిపాఠి(సముద్రఖని)కి విద్య అనేది ఒక వ్యాపారంగా భావిస్తాడు. క్వాలిటీ ఎడ్యుకేషన్‌ పేరుతో భారీగా ఫీజులు వసూళ్లు చేస్తూ ప్రభుత్వ కాలేజీలు మూత పడేలా చేస్తాడు. అధిక ఫీజుల వసూళ్లు చేస్తున్నరంటూ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో.. ఫ్రైవేట్‌ విద్యాసంస్థల ఫీజుల నియంత్ర కోసం ప్రభుత్వం ఓ జీవోని తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో త్రిపాఠీ ఓ ఒప్పందం కుదుర్చుకుంటాడు.

రాష్ట్రంలోని ప్రభుత్వ  జూనియర్‌ కాలేజీలను దత్తత తీసుకొని.. త్రిపాఠి విద్యా సంస్థల ఫ్యాకల్టీతో ఉచితంగా విద్యను అందిస్తామని చెబుతాడు. దానికి ప్రభుత్వం కూడా సై అంటుంది. దీంతో త్రిపాఠి తమ విద్యా సంస్థలో పనిచేసే జూనియర్‌ లెక్చర్లను ప్రభుత్వ కాలేజీలకు పంపిస్తాడు. వారిలో ఒకరే బాలా గంగాధర్‌ తిలక్‌ అలియాస్‌ బాలు(ధనుష్‌). అతను కడప జిల్లా సిరిపురం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీకి వెళ్తాడు.

దత్తత పేరుతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం చేయాలనేది త్రిపాఠి టార్గెట్‌ అయితే..  కాలేజీలో చదివే విద్యార్థులందరిని పాస్‌ చేయించి ప్రమోషన్‌ సాధించాలనేది బాలు లక్ష్యం. అతని లక్ష్యం నెరవేర్చుకునే క్రమంలో బాలుకు ఎదురైన సమస్యలు ఏంటి?  త్రిపాఠి కుట్రను బాలు ఎలా తిప్పి కొట్టాడు? సిరిపురం ప్రెసిడెంట్‌(సాయి కుమార్‌) బాలు సార్‌ని ఊరి నుంచి బహిష్కరించినా.. పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాడు? తను చదువు చెప్పిన 45 మంది విద్యార్థులు ఎంసెట్‌ పరీక్షల్లో రాణించారా? లేదా? పేద విద్యార్థులకు నాణ్యమైన చదువుని అందించాలని కృషి చేస్తున్న బాలు సార్‌కి  బయాలజీ లెక్చర్‌ మీనాక్షి(సంయుక్త మీనన్‌) ఎలాంటి సహాయం చేసింది? బాలు కారణంగా సిరిపురం యువతలో ఎలాంటి మార్పులు వచ్చాయి?  అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
‘విద్య అనేది గుడిలో పెట్టిన నైవేద్యం లాంటిది..పంచండి. అంతేకానీ ఫైవ్‌స్టార్‌ హోటల్లో డిష్‌లా అమ్మకండి’.. ఇంటర్వెల్‌ ముందు విలన్‌తో హీరో చెప్పే మాట ఇది. ఈ ఒక్క డైలాగ్‌ చాలు ‘సార్‌’ సినిమా ఓ మంచి సందేశాత్మక చిత్రం అని చెప్పడానికి. దేశంలో ఎడ్యుకేషన్‌ మాఫీయా సాగిస్తున్న అరాచకాలు ఏంటి? ప్రైవేట్‌ విద్యా సంస్థలు చదువుని వ్యాపారంగా మార్చడం వల్ల మధ్య తరగతి కుటుంబాలు పడుతున్న అవస్థలు ఎంటి? అనేది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఎక్కడా అసభ్యతకు అశ్లీలతకు తావు లేకుండా చెప్పాలనుకున్న పాయింట్ నేరుగా చెప్పడంలో దర్శకుడు సఫలమయ్యాడు.

సినిమా ప్రారంభమే ఆసక్తిగా ఉంటుంది. ఐఏఎస్‌ అధికారి ఏఎస్‌ మూర్తి (సుమంత్‌)ను వెతుక్కుంటూ కొంతమంది విద్యార్థులు రావడం..ఆయన బాలు సార్‌ గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. సినిమా అంతా బాలు క్యారెక్టర్‌ చుట్టే తిరుగుతుంది. పిల్లలకు చదువుపై ఆసక్తి పెంచడం కోసం బాలు చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు.. మీనాక్షి మేడంతో ప్రేమాయణం..మధ్యలో కెమిస్ట్రీ లెక్చరర్‌ కార్తిక్‌(హైపర్‌ ఆది) వేసే పంచ్‌ జోకులతో సోసోగా ఫస్టాఫ్‌ సాగుతుంది. చూస్తుండగానే ఇంటర్వెల్‌ వచ్చేస్తుంది.

ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు బాలు సార్‌ చేసేప్రయత్నం.. ఆ ప్రయత్నం ఫలించకుండా చేసేందుకు త్రిపాఠి చేసే కుట్రలు సెకండాఫ్‌లో చూపించాడు. అయితే కథనం మొత్తం ప్రేక్షకుడి ఊహకు అందేలా సాగడం, ట్విస్టులు లేకపోవడం మైనస్‌. ఇంటర్వెల్‌ తర్వాత సెకండాఫ్‌ ఎలా ఉండబోతుంది? క్లైమాక్స్‌ ఏంటి? అనేది సగటు ప్రేక్షకుడు ఈజీగా  ఊహించగలడు. కొన్ని సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి. నేపథ్య సంగీతంలో ఉన్నంత బలం.. కంటెంట్‌లో ఉండదు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌లో ఉన్నంత ఎమోషన్‌.. సన్నివేశంలో కనిపించదు.

ఇంటర్వెల్‌ తర్వాత వచ్చే కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ హృదయాలను హత్తుకుంటాయి. 'అవసరానికి కులం ఉండదు' , ‘అడిగింది కొనివ్వకపోతే ఆ పిల్లలు ఒక్క రోజే ఏడుస్తారు..కానీ వాళ్ల అమ్మ నాన్న కొనివ్వలేని పరిస్థితి ఉన్నంత కాలం ఏడుస్తూనే ఉంటారు’, ‘డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు.. కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది’ లాంటి డైలాగ్స్‌.. ఆ సందర్భంలో వచ్చే సన్నివేశాలు హృదయాలను హత్తుకుంటాయి.

ఎవరెలా చేశారంటే.. 
బాలు పాత్రలో ధనుష్‌ పరకాయ ప్రవేశం చేశాడు. సినిమా మొత్తం బాలు పాత్ర చుట్టే తిరుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ధనుష్‌ వన్‌ మ్యాన్‌ షో నడిపాడని అనొచ్చు. ఫైట్‌ సీన్స్‌తో పాటు ఎమోషనల్‌ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించాడు. మీనాక్షిగా సంయుక్త మీనన్‌ తన పాత్ర పరిధిమేర నటించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. త్రిపాఠి విద్యా సం‍స్థల చైర్మన్‌గా సముద్ర ఖని తనదైన నటనతో మెప్పించాడు.

సిరిపురం ప్రెసిడెంట్‌గా సాయి కుమార్‌ ఉన్నంతలో చక్కగా నటించాడు. హైపర్‌ ఆది తనదైన పంచ్‌ డైలాగ్స్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఏఎస్‌ మూర్తిగా సుమంత్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. .ఈ సినిమాకు ప్రధాన బలం జీవీ ప్రకాశ్‌ సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ‘మాస్టారు మాస్టారు’పాట ఆకట్టుకుంటుంది. జె.యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. న‌వీన్ నూలి ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Rating:  
(2.75/5)

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top