
విరాట్ కోహ్లీతో వివాదంతో వార్తల్లో నిలిచిన సింగర్ రాహుల్ వైద్య మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల కోహ్లీపై ప్రశంసలు కురిపించిన ఆయన.. ఇండియా- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశభక్తిని చాటుకున్నారు. టర్కీలో తాను ప్రదర్శన ఇవ్వడానికి నిరాకరించాడు. ఓ పెళ్లిలో ప్రదర్శన ఇచ్చేందుకు దాదాపు రూ.50 లక్షలు ఆఫర్ చేశారని వెల్లడించాడు. పాకిస్తాన్‌కు మద్దతుగా టర్కీ వ్యవహరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగర్ రాహుల్ తెలిపారు.
రాహుల్ వైద్య మాట్లాడుతూ.."టర్కీలో నాకు వచ్చిన ఆఫర్‌కు రూ. 50 లక్షలు ఇస్తామన్నారు. కానీ డబ్బు కంటే.. నా దేశ ప్రయోజనాలను ముఖ్యమని వారికి చెప్పా. వారు నాకు ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు. కానీ నేను వద్దన్నది డబ్బు గురించి కాదని మరోసారి స్పష్టం చేశా. ఎందుకంటే డబ్బు కంటే చాలా ముఖ్యమైన అంశం. ఇది ఒక వ్యక్తిగా కాదు.. నా దేశం గురించే ఈ నిర్ణయం. మన దేశానికి అండగా నిలబడాలన్నదే నా ఆశయం." అని పంచుకున్నారు. మన దేశానికి శత్రువుగా అంటూ మనల్ని అగౌరవపరిచే దేశాన్ని సందర్శించడంలో తనకు ఆసక్తి లేదని రాహుల్ పేర్కొన్నారు.
ఇటీవల బాలీవుడ్ నటి రూపాలి గంగూలీ సైతం టర్కీని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సినీ ప్రముఖులు, మనదేశ ప్రయాణికులు టర్కీ బుకింగ్‌లను రద్దు చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా.. ఇప్పటికే టర్కీ విషయంలో భారత్ పలు ఆంక్షలు విధించింది. ఇకపై టర్కీలో భారతీయ సినిమాలు షూటింగ్‌లు ఉండవని స్పష్టం చేసింది. టర్కిష్ సంస్థలతో ఉన్న అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ఆదేశించింది.