
ప్రభాస్ 'సలార్' సినిమా.. థియేటర్లలో రిలీజైనప్పుడు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ తర్వాత మాత్రం చాలామందికి ఫేవరెట్ అయిపోయింది. మరీ ముఖ్యంగా ఇందులో రాధారమ అనే పాత్రలో అదరగొట్టిన శ్రియారెడ్డి.. ఈ ఒక్క చిత్రంతో చాలా గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా 'ఓజీ'లోనూ ఈమెకు అద్భుతమైన రోల్ పడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రియారెడ్డి.. 'సలార్'లో ఎందరో మగాళ్లు ఉన్నప్పటికీ తాను హైలైట్ కావడానికి గల కారణాన్ని బయటపెట్టింది.
'సలార్ గురించి గుర్తుచేసుకుంటే.. నా ప్రతి సీన్‌కి ముందు దాదాపు 50-60 పుష్ అప్స్ తీసేదాన్ని. కాస్ట్యూమ్ వేసుకున్నా, కారవ్యాన్‌లో ఉన్నా ఇది తప్పనిసరి. నా వరకు అయితే బస్కీలు తీయడం అనేది చాలా సులభమైన వర్కౌట్. షూటింగ్ జరుగుతున్న టైంలోనూ దీని గురించి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి ముందే చెప్పాను. దీంతో నా సీన్ తీయడానికి ఇంకాసేపు ఉందనగా చెప్పేవారు. నేను పుష్ అప్స్ వర్కౌట్ పూర్తి చేసుకుని వెళ్లేదాన్ని. దీంతో అందరి మధ్య నేను శక్తిమంతురాలిలా కనిపించేదాన్ని. ఖాన్సార్‌లోని మగాళ్ల కంటే నాకు నేనే అజేయంగా అనిపించేదాన్ని' అని శ్రియారెడ్డి చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'వార్ 2'.. అధికారిక ప్రకటన)
ఈమె చెప్పిన కామెంట్స్ చూస్తుంటే నిజమేననిపిస్తుంది. ఎందుకంటే 'సలార్'లో ప్రభాస్, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్.. ఇలా దాదాపు అందరూ మేల్ యాక్టర్స్ ఉన్నారు. వీళ్లతో సరిసమానంగా శ్రియారెడ్డి ఎలివేట్ అయిందంటే.. పుష్ అప్స్ వర్కౌట్ చేయడం ఈమెకు చాలా సహాయపడినట్లు కనిపిస్తుంది.
శ్రియారెడ్డి వ్యక్తిగత విషయానికొస్తే.. విశాల్ 'పొగరు' మూవీలో విలన్‌గా నటించి అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది. హీరో విశాల్ అన్న విక్రమ్‌ని పెళ్లి చేసుకుంది. తర్వాత చాన్నాళ్ల పాటు నటనకు దూరమైపోయింది. రీసెంట్ టైంలో సలార్, ఓజీ సినిమాలతో మళ్లీ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. గతంలోనే ఈమె తెలుగు చిత్రాల్లో నటించింది. 2003లో అప్పుడప్పుడు, అమ్మ చెప్పింది సినిమాల్లో నటించింది గానీ ఇవి ఫ్లాప్ అయ్యాయి. దీంతో శ్రియాకు అవకాశాలు రాలేదు. మళ్లీ ఇప్పుడు తెలుగు చిత్రాలతోనే పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకోవడం విశేషం.
(ఇదీ చదవండి: హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్)