Top Bollywood Actors Doing Movies With Kollywood Directors, Deets Inside - Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌లో కోలీవుడ్‌ దర్శకుల హవా.. స్టార్‌ హీరోలతో వరుస సినిమాలు!

Aug 26 2022 10:57 AM | Updated on Aug 26 2022 11:53 AM

Shahrukh ,Salman Other Bollywood Heroes Doing Movies With Kollywood Directors - Sakshi

బాలీవుడ్‌ హీరోలు కొందరు తమిళం నేర్చుకునే పనిలో ఉన్నారు. కానీ వారు తమిళ సినిమాల్లో నటించడం లేదు. మరి ఎందుకు భాష నేర్చుకుంటున్నారంటే తమిళ దర్శకులతో సెట్స్‌లో కమ్యూనికేషన్‌ కోసం అన్నమాట. ఎందుకంటే ఆ తమిళ దర్శకులతో ఈ  హీరోలు ‘వాంగ వణక్కం’ (రండి.. నమస్కారం) అంటూ హిందీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌ డైరెక్టర్లు–బాలీవుడ్‌ హీరోల కాంబినేషన్‌ చిత్రాల గురించి తెలుసుకుందాం. 

బాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరైన షారుక్‌ ఖాన్‌ ప్రస్తుతం మూడు (పఠాన్, జవాన్, డంకీ) సినిమాలు చేస్తున్నారు. వీటిలో ‘జవాన్‌’ సినిమాకు అట్లీ దర్శకుడు. తమిళంలో ‘రాజా రాణి’, ‘తేరి’, ‘మెర్సెల్‌’, ‘బిగిల్‌’ వంటి హిట్‌ చిత్రాలను అట్లీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. హిందీలో అట్లీకి ‘జవాన్‌’ తొలి చిత్రం. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్‌గా అగ్రతార నయనతార నటిస్తున్నారు. హిందీలో నయనతారకు కూడా ‘జవాన్‌’ తొలి చిత్రం కావడం ఓ విశేషం. ‘జవాన్‌’ చిత్రం వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్‌ కానుంది.

(చదవండి: మారుతి, ప్రభాస్‌ సినిమా షురూ.. టైటిల్‌ ఇదేనా?)

ఇంకోవైపు తమిళ దర్శకుడు శంకర్‌తో సినిమాకి సై అన్నారు రణ్‌వీర్‌ సింగ్‌. 2005లో శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అన్నియన్‌’ (తెలుగులో ‘అపరిచితుడు’) మంచి విజయం సాధించింది. పదిహేను సంవత్సరాల తర్వాత ఈ సినిమాను హిందీలో రీమేక్‌ చేస్తున్నట్లుగా ప్రకటించారు దర్శకుడు శంకర్‌. ఈ సినిమా షూటింగ్‌ ఈపాటికే ఆరంభం కావాల్సింది కానీ ‘అన్నియన్‌’ హిందీ రీమేక్‌ హక్కుల విషయంలో చిన్న వివాదం నడుస్తోంది.

ప్రస్తుతం కమల్‌హాసన్‌తో శంకర్‌ ‘ఇండియన్‌ 2’, రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చాక  శంకర్‌ ‘అన్నియన్‌’ హిందీ రీమేక్‌ను ఆరంభిస్తా రని ఊహించవచ్చు. దాదాపు ఇరవై ఏళ్ల  తర్వాత హిందీలో శంకర్‌ చేయనున్న సినిమా ఇదే కావడం విశేషం. గతంలో ‘ఒకే ఒక్కడు’ని హిందీలో ‘నాయక్‌’ (2001)గా తెరకెక్కించారు శంకర్‌.

ఇక 2017లో విడుదలైన ‘విక్రమ్‌ వేదా’ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. పుష్కర్‌–గాయత్రి ద్వయం ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రం హిందీలో రీమేక్‌ అయ్యింది. సైఫ్‌ అలీఖాన్, హృతిక్‌ రోషన్‌ హీరోలుగా నటించారు. తమిళ ‘విక్రమ్‌ వేదా’కు దర్శకత్వం వహించిన పుష్కర్‌–గాయత్రి ద్వయమే హిందీ రీమేక్‌నూ తెరకెక్కించారు. పుష్కర్‌– గాయత్రి ద్వయానికి హిందీలో ఇదే తొలి సినిమా. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరు 30న విడుదల కానుంది.

మరోవైపు తక్కువ టైమ్‌లో కోలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న లోకేశ్‌ కనగరాజ్‌ హిందీలో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌తో లోకేశ్‌ కనగరాజ్‌ ఓ సినిమా (తమిళ సినిమా ‘మాస్టర్‌’ హిందీ రీమేక్‌) చేయాల్సింది. కానీ కుదర్లేదు. అయితే సల్మాన్‌తో లోకేశ్‌ వేరే ఓ సినిమా చేయనున్నారని కోలీవుడ్‌ టాక్‌. 

ఇంకోవైపు రజనీకాంత్‌తో ‘కబాలి’, ‘కాలా’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన పా. రంజిత్‌ హిందీలో ఓ సినిమా కమిట్‌ అయ్యారు. జార్ఖండ్‌కు చెందిన ట్రైబల్‌ ఫ్రీడమ్‌ ఫైటర్‌ బిర్సా జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎవరు హీరోగా నటిస్తారు? అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, ‘జై భీమ్‌’ సినిమాతో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న టీజే జ్ఞానవేల్‌ రాజా హిందీలో ఓ సినిమా చేయనున్నారు. ‘దోసా కింగ్‌’గా చెప్పుకునే పి. రాజగోపాల్‌ జీవితంలోని ముఖ్య ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. రాజగోపాల్, జీవ జ్యోతి శాంతకుమార్‌ల కోర్టు కేసు ప్రధానాంశంగా ఈ సినిమా రూపొందనుంది. వీరితోపాటు మరికొందరు తమిళ దర్శకులు హిందీలో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement