టైటిల్: సంతాన ప్రాప్తిరస్తు
నటీనటులు: విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్ తదితరులు
నిర్మాణ సంస్థ: మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్
నిర్మాతలు:మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
సంగీతం: సునీల్ కశ్యప్
ఎడిటర్: సాయికృష్ణ గనల
విడుదల తేది: నవంబర్ 14, 2025
కథేంటంటే..
చైతన్య(విక్రాంత్) హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. తన స్నేహితుడి సుబ్బు(అభినవ్ గోమఠం)ని ఎంగ్జామ్ సెంటర్‌లో డ్రాప్ చేయడానికి వెళ్లగా.. అక్కడ కల్యాణి(చాందిని చౌదరి) చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెది వరంగల్ అని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. కల్యాణి తండ్రి ఈశ్వరరావు(మురళీధర్ గౌడ్)కు ఈ విషయం తెలిసి.. ఆమెను కలవకుండా చేసి చైతన్యను తిరిగి పంపిస్తాడు. ఓ సంఘటనతో చైతన్య, కల్యాణి మళ్లీ కలుస్తారు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి..అది కాస్త ప్రేమగా మారుతుంది. ఈశ్వరరావు ఒప్పుకోడని తెలిసి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. బిడ్డ పుడితే ఆయనే దగ్గరకు వస్తాడని జాక్ (తరుణ్ భాస్కర్) ఇచ్చిన సలహాతో కాపురాన్ని ప్రారంభిస్తారు.
కొన్నాళ్ల తర్వాత చెకప్ కోసం ఆస్పత్రికి వెళితే.. చైతన్యకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందని..బిడ్డలు పుట్టే అవకాశం లేదని చెబుతారు. ఈ విషయం భార్యకు తెలియనీయకుండా జాగ్రత్త పడతాడు చైతన్య. అదే సమయంలో ఈశ్వరరావు వీరింటికి వస్తాడు. కూతురుతో ప్రేమగా మాట్లాడుతూనే..‘ఎలాగైన మీ ఇద్దరి విడగొట్టి నా కూతురిని తీసుకొని వెళ్తానని’ అల్లుడికి వార్నింగ్ ఇస్తాడు. ఒకవైపు పిల్లలు పుట్టరేమోననే బాధ..మరోవైపు మామ వార్నింగ్‌తో చైతన్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న కల్యాణిని దక్కించుకునేందుకు ఆయన పడిన కష్టాలు ఏంటి? కూతురిని చైతన్యకు దూరం చేయడానికి ఈశ్వరరావు చేసిన ప్రయత్నాలు ఏంటి? అవి ఫలించాయా లేదా? ఒకవైపు నాన్న..మరోవైపు భర్త చూపించిన అతిప్రేమ కల్యాణిని ఎలా ఇబ్బందికి గురి చేసింది? చైతన్యకు స్పెర్మ్‌కౌంట్ తక్కువ ఉందనే విషయం కల్యాణికి తెలిసిన తర్వాత ఎం జరిగింది? చివరకు చైతన్య-కల్యాణికి పిల్లలు పుట్టారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
మన సొసైటీలో ఇప్పుడు సంతాన లేమి అనే సమస్య ఎక్కువగా ఉంది. భారత్ అత్యధిక జనాభా గల దేశం అయినప్పటికీ.. అత్యధిక ఫెర్టిలిటీ సెంటర్స్ కూడా ఇక్కడే ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. పని ఒత్తిడి, లైఫ్‌స్టైల్, కొన్ని చెడు అలావాట్లు సంతాన లేమి సమస్యను తెచ్చిపెడుతున్నాయి. అన్నీ బాగున్నా.. లైఫ్ స్టైల్ వల్ల సంతాన లేమి సమస్యలు ఎలా వస్తున్నాయి? ఓ జంట కలిసి ఉండాలంటే పిల్లలు పుట్టాల్సిందేనా? ఫెర్టిలిటీ ఇష్యూ ఎక్కడకు దారి తీస్తుంది? లాంటి సున్నితమైన విషయాలను ఎక్కడా గీత దాటకుండా ఫన్‌వేలో చూపించాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. అయితే ఈ సెన్సిటీవ్ అంశం సినిమాలో ఒక ఎపిసోడ్ మాత్రమే. మిగతాదంతా రెగ్యులర్ లవ్‌స్టోరీనే. కామెడీ, ఎమోషన్స్‌ని మిక్స్ చేసి ఓ మంచి ప్రేమ కథా చిత్రంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. అయితే ఇందులో కామెడీ వర్కౌట్ అయినా.. ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. భార్య-భర్త..మధ్యలో నాన్న అన్నట్లుగా కథనం సాగుతుంది.
ఫస్టాఫ్ మొత్తం హీరో హీరోయిన్ల పరిచయం.. ప్రేమ, పెళ్లి చుట్టూ తిరుగుతుంది. ఈ సన్నివేశాలన్నీ రోటీన్‌గానే ఉన్నా..మధ్య మధ్యలో అభినవ్ గోమఠం వేసే కామెడీ పంచులు నవ్విస్తాయి. అలాగే తరుణ్ భాస్కర్ తన గ్యాంగ్‌పై వేసే పంచులు కూడా బాగానే పేలాయి. హీరోకి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందనే విషయం తెలియడం..అదే సమయంలో హీరోయిన్ తండ్రి విడగొడతానని చాలెంజ్ చేయడం..మరోపక్క ఆఫీస్‌లో పని ఒత్తిడి..ఇవన్నీ హీరో ఎలా ఎదుర్కొంటాడనేది సెకండాఫ్‌లో చూపిస్తామన్నట్లుగా ఇంటర్వెల్ సీన్‌ని కట్ చేశారు.
ఫస్టాఫ్ ఫన్‌వేలో నడిస్తే.. సెకండాఫ్ కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. హీరోహీరోయిన్లను విడగొట్టేందుకు మురళీధర్ చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. అలాగే వెన్నెల కిశోర్ ఎపిసోడ్ కూడా. చివరిలో వచ్చే ఎమోషనల్ సన్నీవేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌లో హీరోయిన్ చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ఓవరాల్‌గా దర్శకుడు ఓ సున్నితమైన అంశాన్ని తీసుకొని, డీసెంట్ కామెడీతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను తెరకెక్కించాడు.
ఎవరెలా చేశారంటే..
సాఫ్‌వేర్ ఎంప్లాయ్ చైతన్య పాత్రకు విక్రాంత్ న్యాయం చేశాడు. కామెడీతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. పక్కింటి అమ్మాయిలాంటి కల్యాణి పాత్రలో చాందినీ చౌదరి చక్కగా నటించింది. ఎమోషనల్ సీన్లలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. మురళీధర్ గౌడ్ పాత్ర సినిమాకు మరో ప్లస్ పాయింట్. అతి ప్రేమ చూపించే తండ్రి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. సెకండాఫ్‌లో ఆయన పాత్ర చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇక అభినవ్ గోమఠం ఎప్పటి మాదిరే తనదైన పంచ్ డైలాగ్‌లో ఎంటర్‌టైన్ చేశాడు. తరుణ్ భాస్కర్, జీవన్ కుమార్, వెన్నెల కిశోర్ అక్కడక్కడ నవ్వించారంతే. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సునీల్ కశ్యప్ పాటలు అంతగా గుర్తుండవు కానీ.. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రపీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సిందే. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి నిడివిని తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.


