జీవితంలో అదొక్కటే పర్మినెంట్: రమ్యకృష్ణ | Sakshi Special Interview With Ramya Krishna - Sakshi
Sakshi News home page

Ramyakrishna: జీవితంలో అదొక్కటే పర్మినెంట్

Published Tue, Aug 29 2023 3:30 AM

sakshi Special Interview with Ramya Krishna - Sakshi

‘నిన్ను రోడ్డు మీద చూసినది..’ అంటూ కుర్రాళ్లు ఫ్లాట్‌ అయ్యేంత గ్లామర్‌...మితి మీరిన ఆత్మవిశ్వాసానికి.. అహంభావానికి చిరునామా... ఓ నీలాంబరి. భక్తులను రక్షించే తల్లి... ఓ అమ్మోరు. నా మాటే శాసనం.. ఓ శివగామి... ఇలా ఏ పాత్ర చేస్తే అందులో ఒదిగిపోయారు రమ్యకృష్ణ. గ్లామరస్‌ రోల్స్‌ చేస్తున్నప్పుడే ‘నరసింహ’లో నెగటివ్‌ షేడ్‌ ఉన్న నీలాంబరి, ‘అమ్మోరు’లో అమ్మవారిగా మెప్పించారామె. ఇక ‘బాహుబలి’లో శివగామిగా కనబర్చిన నటన అద్భుతం. ఇటీవల రిలీజైన ‘జైలర్‌’లో రజనీకాంత్‌ భార్యగా నటించారు. అలాగే భర్త కృష్ణవంశీ డైరెక్షన్‌లో ‘రంగ మార్తాండ’ చేశారు. ఇక ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం.

► ‘పడయప్ప’ (‘నరసింహ’)లో నీలాంబరిగా నరసింహ (రజనీకాంత్‌ పాత్ర)ని ఎదిరించారు. చాలా ఏళ్ల తర్వాత ‘జైలర్‌’లో రజనీ కాంబినేషన్‌లో సాఫ్ట్‌ క్యారెక్టర్‌ చేయడం గురించి..
ఇన్నేళ్ల తర్వాత రజనీగారి కాంబినేషన్‌లో ‘జైలర్‌’ చేయడం, అది సూపర్‌ హిట్‌ కావడం నా జీవితంలో మరచిపోలేను. ‘జైలర్‌’లో ఎందుకంత సున్నితమైన పాత్ర చేశారని అందరూ అనుకోవచ్చు. అయితే మళ్లీ రజనీగారితో నీలాంబరిలాంటి పాత్ర వస్తేనే చేయాలనుకుని ‘జైలర్‌’లో విజయలాంటి మంచి పాత్రని వదులుకోలేను కదా.  

► ఈ 24 ఏళ్లలో రజనీగారు, మీరు ఆర్టిస్టులుగా ఎదిగారు.. వ్యక్తులుగా మారారు. ఆయనలో మీరు గమనించిన మార్పు?  

‘జైలర్‌’ షూటింగ్‌ మొదటి రోజే ‘పడయప్ప’ చేసి అప్పుడే 24 ఏళ్లు అయిపోయిందా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తే.. అవునన్నాను. అప్పటికీ, ఇప్పటికీ ఆయనలో  అదే ఉత్సాహం, అదే నిరాడంబరత, అంతే నిశ్శబ్దం.  

► ‘జైలర్‌’ తెలుగు–తమిళంలో చాలా పెద్ద హిట్‌ అయింది. ఈ హిట్‌ మీ కెరీర్‌కి ఎంతవరకు అడ్వాంటేజ్‌ అవుతుంది?
యాక్టర్స్‌ కెరీర్‌కి హిట్‌ అనేది వంద శాతం అవసరం, తప్పనిసరి. అయితే హిట్‌ మాత్రమే కెరీర్‌ కాదు. మంచి పాత్రలు కూడా కావాలి. కొన్నిసార్లు మంచి పాత్రలుంటాయి. అభినందనలు వస్తాయి కానీ వసూళ్లు ఉండవు. అలాగే ఓ కాంబినేషన్‌ మన కెరీర్‌కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అన్నది ముఖ్యం. వంద శాతం నా కెరీర్‌కి రజనీకాంత్‌గారి కాంబినేషన్, ‘జైలర్‌’ హిట్‌ ఉపయోగపడతాయి.

► ‘రంగ మార్తాండ’, ‘జైలర్‌’ సినిమాల్లో పాత్ర పరంగా మీకు సంతృప్తి ఇచ్చిన మూవీ ఏది?  
‘రంగ మార్తాండ’ లాంటి నటనకు ఆస్కారం ఉన్న సినిమా హిట్‌ అయినా, అవకపోయినా మనసుకు సంతృప్తి ఉంటుంది. అయితే ‘జైలర్‌’లాంటి హిట్స్‌ వస్తే ‘రంగ మార్తాండ’ లాంటి సినిమాలు చేసే అవకాశాలు మరిన్ని వస్తాయి.. నా కెరీర్‌ కూడా మరింత విస్తరిస్తుంది. అయితే ‘రంగమార్తాండ’ లాంటి సినిమాలు కూడా హిట్‌ కావాలి. కొన్నిసార్లు అలాంటి సినిమాలకు ఎక్కువ అభినందనలు వస్తాయి.. వసూళ్లు రాకపోవచ్చు. ఆర్టిస్ట్‌లకు అభినందనలూ కావాలి.. కలెక్షన్స్‌ కూడా కావాలి (నవ్వుతూ).  

► ఓటీటీ ΄్లాట్‌ఫామ్‌లో ‘క్వీన్‌’ వెబ్‌ సిరీస్‌ తర్వాత కొత్త సిరీస్‌లు చేయడం లేదు. ఎందుకు?
‘క్వీన్‌’ తర్వాత ‘క్వీన్‌ 2’ షూటింగ్‌ 70 శాతం పూర్తి చేశాం. మిగిలిన 30 శాతం షూటింగ్‌ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతోంది. ‘క్వీన్‌’ కంటే ‘క్వీన్‌ 2’ అద్భుతంగా వచ్చింది. ఇక సినిమాలతో బిజీగా ఉండటంవల్ల వేరేవి ఒప్పుకోలేకపోతున్నాను.  ► అప్పట్లో మీ తరం వాళ్లకి సినిమాలు తప్ప వేరే ఏమీ లేవు. కానీ, ఈ తరం వాళ్లకి సినిమాలు, సీరియల్స్, వెబ్‌ సిరీస్, టీవీ షోలు.. ఇలా చాలా ఉన్నాయి. ఈ మార్పు మీకు ఎలా అనిపిస్తోంది?  
సోషల్‌ మీడియాలోని చాలామంది ఇన్‌ఫ్లుయర్స్‌లో నటీనటులకంటే ఎక్కువ పాపులర్‌ అవుతున్నవాళ్లు ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రపంచం ఎంతలా మారింది? అనిపిస్తోంది. మనం కూడా మారుతున్న ప్రపంచంతో ΄ోటీ పడుతూ ముందుకు సాగాలి.  

► అయితే ఇప్పుడొస్తున్న కథానాయికలకు మీలా 20, 25 ఏళ్లు లాంగ్విటీ ఉండటంలేదు కూడా...
మాకు తప్పులు చేయడానికి, దిద్దుకోవడానికి టైమ్‌ ఉండేది. ఇప్పుడు ఆ టైమ్‌ లేదు. వస్తున్నారు.. వెళుతున్నారు.. కానీ మేం అన్ని సంవత్సరాలకు సంపాదించుకున్నది ఇప్పుడు సక్సెస్‌ అయితే తక్కువ టైమ్‌కే సంపాదించుకుని వెళ్లిపోతున్నారు. టైమ్‌ ఎలా మారుతుందో దాన్నిబట్టి అన్నీ మారుతున్నాయి. దాంతో పాటు మనం మారాలి. జీవితంలో స్థిరమైనది ఏది అంటే.. అది మార్పు మాత్రమే. ఆ మార్పుకి మనం అడ్జస్ట్‌ అవ్వాలి. దాంతో పాటు కొనసాగాలి. మనం హ్యాపీగా ఉన్నామనుకోండి అది మారుతుంది. ఒకవేళ దుఃఖంలో ఉన్నాం అనుకోండి అది కూడా మారుతుంది. సో.. ఏదీ నిరంతరంగా ఉండదు.. మార్పు సహజం.

► మీ అబ్బాయి రుత్విక్‌ ఏం చేస్తున్నాడు... హీరో అవుతాడా? తన నాన్న (కృష్ణవంశీ)లా డైరెక్టర్‌ అవుతాడా?
రుత్విక్‌కి ఇప్పుడు 18 ఏళ్లు. ప్రస్తుతానికి ఫోకస్‌ అంతా చదువు మీదే. వాడికేం అవ్వాలో వాడికే తెలియదు.. నాకేం తెలుస్తుంది (నవ్వుతూ). తనేం కావాలో రుత్విక్‌ తెలుసుకుని, మాతో చెబితే మేం స΄ోర్ట్‌ చేస్తాం.

► ఈ మధ్య రోజాగారు, మీరు కలుసుకున్నారు.. మీ ఇద్దరి అనుబంధం గురించి?
రోజా నాకు ఎప్పట్నుంచో తెలుసు. అప్పట్లో ఎలా ఉండేవాళ్లమో ఇప్పుడూ అలానే ఉన్నాం. చాలా సంవత్సరాల తర్వాత నేను తిరుపతి వెళ్లాను. తనే నాకు దర్శనం ఏర్పాటు చేసింది. అద్భుతమైన దర్శనం దక్కింది. సో.. తనకి థ్యాంక్స్‌ చెప్పడానికి వెళ్లాను.  ► ఇద్దరూ సినిమాలు, రాజకీయాల గురించి మాట్లాడుకున్నారా?
రెండింటి గురించి మాట్లాడుకోలేదు. లైఫ్‌ గురించి మాట్లాడుకున్నాం. నా అబ్బాయి ఏం చేస్తున్నాడు.. తన పిల్లలు ఏం చేస్తున్నారు? అనే విషయాలు మాట్లాడుకున్నాం. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి ఇంత బిజీగా ఎలా ఉండ గలుగుతున్నావ్‌ అని అడిగాను. ఇలాంటివే...

► రోజాగారితో మాట్లాడాక మీక్కూడా పాలిటిక్స్‌ పై ఏమైనా ఆసక్తి కలిగిందా? మీరూ పాలిటిక్స్‌లోకి వచ్చే అవకాశం ఉందా?
పాలిటిక్స్‌ పై ఇంట్రస్ట్‌ అనేది ఒకర్ని చూసి వచ్చేది కాదు. ఎవరికి వాళ్లకి ఉండాలి. కొందరికి ఇంట్రస్ట్‌ ఉంటుంది.. కొందరికి ఉండదు. బట్‌.. రోజా చాలా హార్డ్‌ వర్కింగ్‌ పర్సన్‌. నేను కళ్లారా చూశాను.  

► భవిష్యత్తులో ఏదైనా పార్టీ నుంచి మీకు ఆఫర్‌ వస్తే పాలిటిక్స్‌లోకి ఎంటర్‌ అవుతారా?
ఏమో.. నాకు తెలియదు. వచ్చినప్పుడు చూద్దాం.

Advertisement
 
Advertisement