HBD Suddala Ashok Teja: ఆ భావదారిద్య్రం రచయితలకు ఉండదు

Sakshi Interview with Suddala Ashok Teja birthday special

– సుద్దాల అశోక్‌తేజ

ఒకటి మాతృభూమి పాట.. మరొకటి మాతృమూర్తి పాట... ఒకే సినిమాలోæవినపడిన ఈ రెండు పాటలూ భావోద్వేగానికి గురి చేశాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో సుద్దాల అశోక్‌తేజ రాసిన ‘కొమురం భీముడో, కొమ్మా ఉయ్యాలా’ పాటలవి. ఇవే కాదు.. 28 ఏళ్ల కెరీర్‌లో 2600 సినిమా పాటల ద్వారా దేశభక్తి, ఆనందం, ప్రేమ, బాధ... ఇలా మనిషి తాలూకు ప్రతి ఎమోషన్‌ని ఆవిష్కరించారు సుద్దాల అశోక్‌ తేజ.  నేడు ఆయన పుట్టినరోజు.   ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశోక్‌ తేజ చెప్పిన విశేషాలు.   

► ఈ బర్త్‌ డే స్పెషల్‌ అంటే ముందుగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించే మాట్లాడుకోవాలి. ఈ సినిమాకి మీరు రాసిన ‘కొమురం భీముడో, కొమ్మా ఉయ్యాలా’ రెండూ హిట్‌. ఈ పాటల గురించి మీ అనుభవం?
సుద్దాల అశోక్‌ తేజ: నేనిప్పటి వరకూ రాజమౌళిగారి సినిమాలకు పాట రాయలేదు. విజయేంద్రప్రసాద్‌గారి ‘రాజన్న’ కి పాట రాశా. ఆ కథలో మా నాన్నకి  (సుద్దాల హనుమంతు) సంబంధించిన జీవితం ఉంది. తెలంగాణ, నైజాం పోరాటంలో మా నాన్న, అమ్మ పాల్గొన్న ఘట్టాలు చెబుతూ ఒకానొక సన్నివేశం గురించి ఓ సందర్భంలో విజయేంద్ర ప్రసాద్‌గారికి చెప్పాను. దానికి ఆయన బాగా కనెక్ట్‌ అయిపోయి ఒక కథ తయారు చేశారు.. అదే ‘రాజన్న’ సినిమా.

మా నాన్న జీవితంలో జరిగిన సన్నివేశానికి రాజమౌళిగారు ఓ పాట (వెయ్‌ వెయ్‌ దెబ్బకు దెబ్బ) నాతో రాయించారు. మా ఇద్దరి మధ్య ఉన్న తొలి పాట అనుబంధం అది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం రాజమౌళిగారు పిలిపించి, ఎన్టీఆర్‌ని (కొమురం భీమ్‌ పాత్ర) ఆంగ్లేయులు శిక్షించే సందర్భంలో వచ్చే పాట రాయమన్నారు. ఈ పాటలో హీరో తనకు తానే ధైర్యం చెప్పుకుంటే బాగుంటుందన్నాను. కానీ, కీరవాణిగారు ‘మీరు పాట రాయండి.. ఆ తర్వాత ట్యూన్‌ ఇస్తాను’ అన్నారు. మూడు రిథమ్స్‌లో పాట రాసుకుని వెళ్లా. వాటిల్లో సినిమాలో ఉన్న పాట స్టైల్‌ అందరికీ నచ్చడంతో రాజమౌళిగారు అదే ఫైనల్‌ చేశారు.

ఇక ‘కొమ్మా ఉయ్యాలా..’ గిరిజన బాలిక పాడే పాట. ఆ అమ్మాయి తల్లికి ఎంత కనెక్ట్‌ అయి ఉందో అని ఈ పాటలో చెప్పాం. ఆ అమ్మాయి జైలులో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ కూడా తనకి భరోసా ఇస్తూ ఓ పాట పాడతాడు.. కానీ, నిడివి ఎక్కువ అయిందని ఆ పాట తీసేశారు. ఆ పాట కూడా నేనే రాశాను.
‘కొమురం భీముడో..’ పాట మాతృభూమితో, ‘కొమ్మా ఉయ్యాలా’ పాట మాతృమూర్తితో సంబంధం ఉన్నవి కాబట్టే ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అయ్యారు.

► మీ ఫస్ట్‌ పాన్‌ ఇండియన్‌ మూవీ ఇది. ఈ ట్రెండ్‌ రచయితలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది?
పాన్‌ ఇండియన్‌ సినిమా అని ఎక్కువ ఆలోచించి, ఓటీటీ సినిమాకి రాస్తున్నామని తక్కువ ఆలోచించి పాటలు రాసే భావదారిద్య్రం రచయితలకు ఉండదు. స్టార్‌ హీరోనా, కొత్త హీరోనా, స్టార్‌ డైరెక్టరా, కొత్త డైరెక్టరా? అని కాకుండా ఇచ్చిన సన్నివేశానికి ఎంత ఎఫర్ట్‌ పెట్టాలి? అని మాత్రమే రచయిత ఆలోచిస్తాడు.  

► పాట మనిషి తేజస్సును పెంచుతుంది అంటారు. మీలోని తేజస్సుకు పాటే కారణమా?
నిజమే.. పాట పసివాడిగా చేస్తుంది.. పడుచువాడిగానూ చేస్తుంది. వృద్ధాప్యం అనేది శరీరానికి సంబంధించినది కాదు.. ఆలోచనలకు సంబంధించినది. కొత్తదనం ఇవ్వాలనే తపన, తపస్సు వల్ల మనుషుల్లో కనిపించే తేజస్సు వేరుగా ఉంటుంది.   

► రెండేళ్ల క్రితం మీకు లివర్‌ ప్లాంటేషన్‌ ఆపరేషన్‌ జరిగింది. మీరు ఊపిరి పోసిన మీ అబ్బాయి మీకు ఊపిరి పోయడం గురించి..?
జన్మనిచ్చిన పుత్రుడే (అర్జున్‌ తేజ) తిరిగి నాకు జన్మనివ్వడం నా జీవితంలో జరిగిన ఒక ఊహించని ఘటన. లివర్‌ ప్లాంటేషన్‌కి ఎవరూ ముందుకు రాక చనిపోయిన వారిని నేను చూశా. నా అదృష్టం ఏంటంటే.. నా కూతురు, నా కుమారులు లివర్‌ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. కానీ వయసులో చిన్నోడు కాబట్టి అర్జున్‌ తేజని డాక్టర్లు సెలక్ట్‌ చేసుకున్నారు. మే 23కి ఆపరేషన్‌ జరిగి రెండేళ్లు అవుతుంది.. అలా కొడుకే తండ్రి అయిన సన్నివేశం నా లైఫ్‌లో జరిగింది.

► పాట సాహిత్యాన్ని శబ్దం డామినేట్‌ చేస్తున్న ఈ పరిస్థితి గురించి ఏమంటారు?  
నిజమే.. 1980 నుంచే ఆ ట్రెండ్‌ ఉంది. అక్షరాలతో కూడుకున్న దాన్నే పాట అంటారు. సంగీతం కలిసిన సాహిత్యమే గీతం. అలాంటిది అక్షరాలు వినిపించకపోతే మాకు ఎందుకు సంతోషం ఉంటుంది? నేను బాధపడ్డ క్షణాలు కొన్ని లక్షలుంటాయి. శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. అయితే కీరవాణిగారి సినిమాల్లో ప్రతి పాట అందరికీ వినిపిస్తుంది. అయితే ఈ విషయంలో ఎవర్నీ తప్పుబట్టలేం.. ఎవరి ట్రెండ్‌ వారిది.

► మీ తల్లితండ్రుల పేరుతో ఇస్తున అవార్డు గురించి...
మా తల్లితండ్రులు సుద్దాల హనుమంతు, జానకమ్మల పేరుతో ఓ ఫౌండేషన్‌ స్థాపించాను. మా నాన్నగారి పేరుతో గత పదేళ్లుగా జాతీయ పురస్కారం ఇస్తున్నాను.  

► రచయితగా మీ నాన్న వారసత్వాన్ని మీరు తీసుకున్నారు.. మరి మీ వారసత్వాన్ని ఎవరు తీసుకున్నారు?
పాటల విషయంలో నా వారసత్వాన్ని ఎవరూ తీసుకోలేదు.. కాకపోతే మా అమ్మాయి మాత్రం సంగీతం నేర్చుకుంది.. డిప్లొమా పాస్‌ అయింది. అమెరికా, లండన్‌లోని పిల్లలకు ఆన్‌లైన్‌లో సంగీత పాఠాలు చెబుతుంటుంది. ఒకరకంగా ఆమె నా బాటలో ఉన్నట్లు అనిపిస్తుంది.

పాట నా జెండా..
కవిత్వం నా ఎజెండా..
శిఖరం నా నిచ్చెన
లోయ నా విశ్రాంతి శయ్య
ఓటమి నా ఆలోచనా మందిరం
గెలుపంటారా..
చిన్న మలుపు మాత్రమే

– సుద్దాల అశోక్‌తేజ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top