RRR Movie In Green India Challenge: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న 'ఆర్ఆర్ఆర్' త్రయం..

RRR Rajamouli Ram Charan Jr NTR Participate In Green India Challenge - Sakshi

RRR Movie In Green India Challenge With MP Santhosh Kumar: పచ్చదనం పెంపు తమ మనసుకు దగ్గరైన కార్యక్రమం అని ఆర్‌ఆర్ఆర్ ​​త్రయం ఎస్‌ఎస్‌ రాజమౌళి, జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ పేర్కొన్నారు. యావత్‌ భారతదేశం ఎంతగానో ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తోంది ఆర్ఆర్ఆర్ టీం. ఇటీవల గుజరాత్, పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పర్యటించింది. మూవీ విడుదలకు ఇంకా రెండు రోజులే ఉండటంతో బుధవారం హైదరాబాద్‌లో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగమైంది జక్కన్న బృందం. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌తో కలిసి గచ్చిబౌలిలో మొక్కలు నాటారు డైరెక్టర్‌ ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు జూ. ఎన్టీఆర్, రామ్‌ చరణ్. 

ప్రకృతి, పర్యావరణం తమ మనసుకు నచ్చిన కార్యక్రమాలని, వీలున్నప్పుడల్లా పచ్చదనం పెంపు కోసం మొక్కలు నాటి పరిరక్షిస్తున్నామని రాజమౌళి తెలిపారు. రాష్ట్రం, దేశం పచ్చబడాలనే ఎంపీ సంతోష్‌ సంకల్పం చాలా గొప్పదని, ఈ కార్యక్రమం మరింత విజయవంతం కావాలన్నారు. బాహుబలి టీమ్‌తో కూడా గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న విషయాన్ని రాజమౌళి గుర్తు చేశారు.

దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న గ్రీన్‌ ఇండియా ఛాలెండ్ మరింత విజయవంతంగా కొనసాగాలని హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను గమనించి, ప్రతీ ఒక్కరూ ప్రకృతి రక్షణ కోసం చైతన్యవంతంగా ఉండాలన్నారు. ఈ భూమిపై మనం అందరం అతిథులం మాత్రమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడాలని, మన పిల్లలను ఎలా పోషిస్తామో మొక్కలను కూడా అలాగే నాటి రక్షించాలని కోరారు. 

గతంలో కూడా గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్నాని, మొక్కలు నాటిన ప్రతీసారి తెలియని ఉత్సాహం వస్తుందన్నారు రామ్‌ చరణ్‌. ఇప్పుడు ఆర్‌ఆర్ఆర్ రిలీజ్ సందర్భంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం అత్యంత సంతృప్తిని ఇచ్చిందన్నారు. సమాజహితమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపుతున్న ఎంపీ సంతోష్ కుమార్‌ను ట్రిపుల్ ఆర్ టీమ్ అభినందించింది.

సినిమా మాధ్యమం అత్యంత శక్తివంతమైందని ఎంపీ సంతోష్ కుమార్‌ తెలిపారు. సమాజానికి చక్కని హరిత సందేశం ఇచ్చే స్ఫూర్తి హీరోలతో పాటు, చిత్ర నిర్మాణంలో భాగం అయ్యే 24 ఫ్రేమ్స్ కళాకారులకు ఉంటుందని పేర్కొన్నారు. మూవీ రిలీజ్ షెడ్యూల్‌లో బిజీగా ఉండికూడా, చొరవ తీసుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న బృందానికి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్‌లు కరుణాకర్ రెడ్డి, రాఘవ, తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top