తెలుగు సినిమాలు గెలవాల్సిన సమయమిది | Sakshi
Sakshi News home page

తెలుగు సినిమాలు గెలవాల్సిన సమయమిది

Published Tue, Jan 11 2022 12:56 AM

Rowdy Boys Date Night Song Launch By Allu Arjun - Sakshi

‘‘ఈ సంక్రాంతికి చాలా సినిమాలొస్తున్నాయి.. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమా, ఆ సినిమా అని కాదు.. తెలుగు సినిమాలు గెలవాల్సిన సమయమిది. మొత్తం తెలుగు సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక్క తెలుగే కాదు.. అన్ని భాషల్లోని సినిమాలు బాగుండాలి.. మళ్లీ జనాలు థియేటర్లకు రావాలి’’ అని అల్లు అర్జున్‌ అన్నారు. ఆశిష్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌడీ బాయ్స్‌’.

అనిత సమర్పణలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘డేట్‌ నైట్‌..’ అంటూ సాగే పాటను అల్లు అర్జున్‌ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘నా ప్రయాణం ‘ఆర్య’ సినిమాతో మొదలుపెట్టా. ‘దిల్‌’ రాజుగారు నా ప్రయాణంలో ఒక భాగం. ఆయన లేకుంటే ‘ఆర్య’ లేదు. ‘రౌడీ బాయ్స్‌’ ఫంక్షన్‌ నాకు చాలా ప్రత్యేకం, స్వీట్‌ మెమొరీ. ఇది నా కుటుంబ వేడుక.. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఊరు వెళ్లాల్సినా ఇక్కడికొచ్చాను.. అది నేను చేస్తున్న ఫేవర్‌ కాదు.. నా బాధ్యత.

ఆశిష్‌ని లాంచ్‌ చేస్తున్న ఈ వేడుకలో నేనూ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. ‘రౌడీ బాయ్స్‌’ ట్రైలర్‌ చూస్తుంటే ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేయాల్సిన సినిమా జనవరి 14నే విడుదల చేస్తున్నట్లు ఉంది. శ్రీహర్ష, ఆశిష్, యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌. లవ్‌ సాంగ్‌లో ఆశిష్‌ చాలా బాగా డ్యాన్స్‌ చేశాడు. లాక్‌డౌన్‌ తర్వాత డిసెంబరులో విడుదలైన సినిమాలు (అఖండ, పుష్ప, శ్యామ్‌ సింగరాయ్‌) సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా చాలా బాగుంది. నాని, సాయిపల్లవి నటన బాగుంది. డైరెక్టర్‌ రాహుల్‌ బాగా తీశాడు. ఎవరైనా సినిమా చూడకుండా ఉంటే ఓటీటీలో వచ్చినప్పుడైనా చూడండి’’ అన్నారు.  ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘2004 జనవరి 1న ‘ఆర్య’ సినిమాలోని ‘తకదిమితోం తకదిమి తోం..’ పాట వైజాగ్‌లో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఆశిష్‌కి ఏడేళ్లు. ఆ పాటకి బన్ని(అల్లు అర్జున్‌) డ్యాన్స్‌ చేస్తుంటే అలా చూస్తున్నాడు. అలాంటిది ఆశిష్‌ హీరోగా నటించిన సినిమాలోని డ్యాన్స్‌ సాంగ్‌ను బన్నీ విడుదల చేయడం నిజంగా ఆశిష్‌ జీవితంలో మరచిపోలేని రోజు. ఈ సంక్రాంతికి మా బ్యానర్‌ నుంచి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ వస్తోంది.

‘ప్రేమదేశం, తొలిప్రేమ, ఆర్య, హ్యాపీడేస్‌’ ఇలా ఔట్‌ అండ్‌ ఔట్‌ యూత్‌ కంటెంట్‌ చిత్రమిది. హర్ష రెండుమూడేళ్లు ప్రయాణం చేసి ఆశిష్‌ భవిష్యత్తుకు ‘రౌడీ బాయ్స్‌’ లాంటి మంచి సినిమాని ఇచ్చినందుకు థ్యాంక్స్‌. మా బ్యానర్‌ నుంచి వచ్చిన సినిమాలన్నీ కుటుంబ విలువలతో సాగుతాయి. కానీ ‘రౌడీ బాయ్స్‌’ కోసం కొన్ని హద్దులు దాటాం. మా సంస్థ నుంచి సంక్రాంతికి ఇప్పటి వరకూ 5 సినిమాలొస్తే అన్నీ హిట్‌ అయ్యాయి.. ఈ ‘రౌడీ బాయ్స్‌’ కూడా హిట్‌ కొడితే సెకండ్‌ హ్యాట్రిక్‌ పూర్తి చేసినట్టు అవుతుంది’’ అన్నారు.  

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 
ఆశిష్‌ మాట్లాడుతూ– ‘‘అల్లు అర్జున్‌ అన్నకి చాలా అంకితభావం, కమిట్‌మెంట్‌ ఉంది.. అలాంటి డెడికేషన్‌ ఉంటేనే సినిమాల్లోకి రావాలని ‘ఆర్య’ సమయంలో ఫిక్స్‌ అయ్యాను. ఆయన డ్యాన్స్‌తో పోలిస్తే నా డ్యాన్స్‌ కొంచెమే అనిపిస్తోంది. ఆయన ఎప్పటి నుంచో పాన్‌ ఇండియా స్టారే’’ అన్నారు. ‘ఆదిత్య’ మ్యూజిక్‌ నిరం జన్, మాధవన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement