రిషి కపూర్‌ జయంతి: కుమార్తె భావోద్వేగం

Riddhima Kapoor Emotional Post On Rishi Kapoor Birth Anniversary - Sakshi

సరస సంగీతమయ కథానాయకుడుగా బాలీవుడ్‌ను అలరించిన అలనాటి హీరో రిషి కపూర్‌ 68వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె రిధిమా కపూర్‌ సాహ్ని తండ్రిని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘నాన్నా.. మనం ఎవరినైనా కోల్పోయినపుడు, వాళ్లను వదిలి జీవించలేమని.. గుండె పగిలిపోతుందని అంటూ ఉంటారు! అయితే ఈ ముక్కలైపోయిన హృదయంలోనే నువ్వు జీవించి ఉన్నావని.. ఎప్పటికీ అలాగే ఉంటావని నాకు తెలుసు! నువ్వు మమ్మల్ని కాచుకునే ఉంటావని నాకు తెలుసు.. నువ్వు మాకు నేర్పిన విలువల్లో బతికే ఉంటావని తెలుసు!

దయ కలిగి ఉండే గుణాన్ని నాకు బహుమతిగా ఇచ్చావు- బంధాల విలువను తెలియజేశావు, ఈరోజు నేనిలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే! నిన్న ప్రతిరోజూ మిస్పవుతూనే ఉన్నా, ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నా! నేడే కాదు.. ఎప్పటికీ నువ్వు నాతోనే ఉంటావు- హ్యాపీ బర్త్‌డే’’ అంటూ తండ్రి పట్ల తనకున్న ప్రేమానురాగాలను వ్యక్తం చేశారు. తల్లిదండ్రులతో తనకున్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఉన్న ఫొటోలు ఈ సందర్భంగా షేర్‌ చేశారు.(చదవండిస్పెషల్‌ స్టోరీ: సరస సంగీతమయ కథానాయకుడు)

కాగా కాన్సర్‌ బారిన పడిన రిషి కపూర్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 30న ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం విదితమే. ఆ సమయంలో ఢిల్లీలో అత్తవారింట్లో ఉన్న రిధిమ లాక్‌డౌన్‌ కారణంగా తండ్రి అంతిమ చూపనకు కూడా నోచుకోలేపోయారు. లాక్‌డౌన్‌ నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపే అంత్యక్రియలు ముగించాలని పోలీసులు సూచించడంతో ఢిల్లీ నుంచి బయలుదేరిన రిధిమా ముంబై చేరుకోక ముందే.. రిషి అంత్యక్రియలు ముగిశాయి.

దీంతో ఆమె ఫేస్‌టైంలో వీడియో ద్వారా తండ్రికి అంతిమ వీడ్కోలు పలికారు. ఇక కోవిడ్‌ కారణంగా.. కేవలం 20 మందికే అనుమతి ఉన్న నేపథ్యంలో రిషి కుమారుడు రణబీర్‌కపూర్‌, భార్య నీతూకపూర్‌, సోదరి రీమా జైన్‌, మనోజ్‌ జైన్‌, ఆర్మాన్‌, నటులు సైఫ్‌ అలీఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌, కరీనా కపూర్‌, అలియా భట్‌, అనిల్‌ అంబానీ, అయాన్‌ ముఖర్జీ వంటి కొద్దిమంది మాత్రమే ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top