Sudheer Varma : హీరో సుధీర్ వర్మ ఆత్మహత్య.. పోస్టుమార్టం రిపోర్టులో ఏముంది?

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ వర్మ ఆత్మహత్యతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ‘సెకండ్ హ్యండ్’, ‘కుందనపు బొమ్మ వంటి’, ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ వంటి పలు సినిమాలతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ సూసైడ్‌కు కారణాలు ఏంటన్నది పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈనెల18న సుధీర్ వర్మ పాయిజన్ తీసుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడ్ని గుర్తించిన స్నేహితుడు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం సుధీర్‌ను విశాఖలోని ఎల్. జీ. ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స తీసుకుంటూనే పరిస్థితి విషమించి సుధీర్ మరణించాడు. పోస్టుమార్టం రిపోర్డులోనూ విషం తీసుకోవడం వల్ల మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. హీరోగా ఎంతో భవిష్యత్తు ఉన్న సుధీర్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటన్నది విచారించగా.. అతడి స్నేహితుడు మాట్లాడుతూ.. సుధీర్ చాలా మంచి వ్యక్తి అని, అయితే చాలా సున్నిత మనస్కుడని తెలిపాడు.
తండ్రి మరణం తర్వాత తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడని పేర్కొన్నారు. అంతేకాకుండా కొన్నాళ్లుగా సుధీర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆ కారణంగానే సుధీర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు స్నేహితులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇంత చిన్న వయసులో సుధీర్ బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలచి వేస్తోంది.