RAPO 22: ఆంధ్రాకింగ్‌ తాలుకా.. టికెట్‌ ఇవ్వాల్సిందే.. | RAPO 22: Andhra King Taluka Title Glimpse Out | Sakshi
Sakshi News home page

RAPO 22: ఆంధ్రాకింగ్‌ తాలుకా.. టికెట్‌ ఇవ్వాల్సిందే..

May 15 2025 11:44 AM | Updated on May 15 2025 1:00 PM

RAPO 22: Andhra King Taluka Title Glimpse Out

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త చిత్రం ‘RAPO 22’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసి అభిమానుల్లో సందడి రేపారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. నేడు (మే 15) రామ్ బర్త్‌డేను పురస్కరించుకుని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’(Andhra King Taluka) అనే టైటిల్‌ను ఆకర్షణీయమైన గ్లింప్స్ ద్వారా ప్రకటించారు.

ఈ గ్లింప్స్ ఒక కిక్కిరిసిన థియేటర్ వెలుపల అభిమానుల కోలాహలంతో ప్రారంభమవుతుంది. అక్కడ ‘ఆంధ్ర కింగ్’ సూర్య కుమార్ (ఉపేంద్ర) కొత్త సినిమా రిలీజ్‌ కోసం ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఎమ్మోర్వో నుంచి ఎమ్మెల్యే వరకు వీఐపీ రిఫరెన్స్‌లతో టికెట్లు తీసుకోవడంతో విసిగిపోయిన థియేటర్ యజమాని వద్దకు రామ్ సైకిల్‌పై స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. అభిమానిగా చెప్పగానే యజమాని టికెట్లను అందజేస్తాడు. వాటిని తీసుకున్న రామ్ తోటి అభిమానులతో సంబరాలు చేసుకుంటాడు. అనంతరం సూర్య కుమార్ భారీ కటౌట్‌పై పూల వర్షం కురిపిస్తూ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అని అరవడంతో టైటిల్ కార్డ్ పడుతుంది.

పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ సాగర్ పాత్రలో, భాగ్యశ్రీ బోర్సే మహాలక్ష్మి పాత్రలో నటిస్తున్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.

మరోవైపు, సోషల్ మీడియాలో రామ్ పోతినేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు #HappyBirthdayRAPO హ్యాష్‌ట్యాగ్‌తో ఈ టైటిల్ గ్లింప్స్‌ను షేర్ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 2, 2025న విడుదల కానుందని సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement