
బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ(Rani Mukerji ) 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలో చాలా ప్రత్యేకంగా కనిపించారు. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో ఆమె నటించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఆమెకు ఉత్తమ నటిగా అవార్డ్ దక్కింది. రీసెంట్‌గా జరిగిన అవార్డ్ ప్రదానోత్సవ వేడుకలో రాణీ ముఖర్జీ ధరించిన నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన కూతురు అదిరా చోప్రా పేరులోని అక్షరాలతో ప్రత్యేకంగా తయారుచేయించుకున్న గోల్డ్ నెక్లెస్‌ను ఆమె ధరించారు. అయితే, నెక్లెస్ వెనుక దాగి ఉన్న ఎమోషనల్ స్టోరీని టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆమె పంచుకున్నారు.

రాణి ముఖర్జీ తన కూతురు అదిరా గురించి ఇలా చెప్పింది. తనకు కలిసొచ్చిన ఒక అదృష్ట దేవతగా ఆమె చెప్పింది. 'నేషనల్ అవార్డ్స్ వేడుకలో పాల్గొనేందుకు అదిరా కూడా ఆసక్తి చూపింది. కానీ, 14ఏళ్ల లోపు ఉన్నవారికి అనుమతి లేదు. దీంతో చాలా నిరాశ చెందాము. నేను అవార్డ్ అందుకున్న సమయంలో ఆమె ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'అదిరా'ను శాంతింప చేసేందుకు ఏం చేయాలో నాకు తెలియలేదు. కానీ, ఆమె పేరులోని అక్షరాలతో ఒక నెక్లస్ చేయించాను. అవార్డ్ తీసుకుంటున్న సమయంలో నాతోనే ఉంటావని చెప్పాను.
అప్పుడు ఆమె కాస్త కుదుట పడింది. అదిరాను సంతోష పెట్టేందుకు నాకు తోచింది నేను చేశాను.. కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో నెక్లెస్ ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. 'రాణి తన కూతురిని వెంట తీసుకెళ్లింది' అని చాలామంది పోస్ట్‌లు పెట్టారు. అవన్నీ అదిరాకు చూపించాను. అప్పుడు తను చాలా సంతోషించింది. వాటిని పోస్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.' అని ఆమె పంచుకున్నారు. 14ఏళ్ల లోపు ఉండటంతో తన కుమార్తెను వేడుకలోకి తీసుకెళ్లలేకపోయానని రాణీ ముఖర్జీ చాలా బాధ పడ్డారు. ఈ చర్య చాలా అన్యాయం అంటూ ఆమె పేర్కొన్నారు.
మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో తన నటనకు రాణి తన మొట్టమొదటి ఉత్తమ నటి జాతీయ అవార్డును గెలుచుకుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమెను సత్కరించారు. ఈ కార్యక్రమంలో, ఆమె గోధుమ రంగు చీర, అదిరా అనే అక్షరాలు ఉన్న బంగారు హారాన్ని ధరించింది. రాణి 2014లో ఆదిత్య చోప్రాను వివాహం చేసుకుంది. ఈ జంట 2015లో తమ కుమార్తె అదిరాను స్వాగతించారు.