Sakshi News home page

Rajeev Kanakala: ఒక్కసారిగా క్షీణించిన చెల్లెలి ఆరోగ్యం.. బతకదని తెలుసు.. అప్పుడు సుమ ఏం చేసిందంటే?

Published Tue, Aug 8 2023 5:16 PM

Rajeev Kanakala Got Emotional Remembering His Sister Last Days Condition Before Her Death - Sakshi

కొద్ది నిమిషాల నిడివి ఉన్నా, సినిమా ఆసాంతం ఉన్నా తను పోషించే పాత్రలు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ ఎమోషన్స్‌ చూపించడం, సీన్‌ను రక్తికట్టించడంలో రాజీవ్‌ కనకాల దిట్ట. జీవితంలో కష్టనష్టాలు ఎన్నో చూసిన ఆయన సినీ కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు.

'అమ్మ, నాన్న, చెల్లి.. అందరినీ కోల్పోయాను. ఆ సమయంలో చాలా ఇబ్బందిపడ్డాను. రెండు,మూడు నెలలపాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. నా చెల్లి పేరు శ్రీలక్ష్మి. తను సీరియల్స్‌ కూడా చేసింది. తనకు క్యాన్సర్‌ వచ్చింది, దాన్నుంచి దాదాపు బయటపడింది. పూజలు, హోమాలు చేయించమంటే అవి కూడా చేయించాం. 85 శాతం రికవరీ అయింది. ఇక ఆందోళన చెందాల్సిన పని లేదనుకున్నాం. రెండు రోజుల్లో లాక్‌డౌన్‌ అనగా మా బావ నాకు ఫోన్‌ చేసి రమ్మన్నాడు.

వెళ్లి చూశాక తన పరిస్థితి దిగజారుతోందని అర్థమైంది. కీమోథెరపీ చేయిద్దామంటే అప్పుడే పచ్చకామెర్ల వ్యాధి సోకింది. అది తగ్గితేకానీ ఏ చికిత్స చేయరు. రోజురోజుకీ తన పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. అది కరోనా సమయం కావడంతో ఎవరూ ఆస్పత్రిలో జాయిన్‌ చేసుకునే పరిస్థితిలో లేరు. ఒకవేళ అడ్మిట్‌ చేసుకున్నా తన ప్రాణ్యాలకు గ్యారెంటీ ఇవ్వలేమన్నారు. అందుకే ఉన్నంత వరకు కుటుంబమంతా ఒకే దగ్గర ఉన్నాం. బెడ్‌పై కదల్లేని స్థితిలో ఉన్న తను ఎప్పుడో ఒకసారి స్పృహలోకి వచ్చి కళ్లు తెరిచి చూసేది. మాట్లాడటానికి కూడా రాకపోయేది.

తన కంట నుంచి కన్నీళ్లు కారేవి. రాత్రిపూట తన మూలుగు విని ఇంకా బతికుందని అనుకునేవాడిని. ఎక్కువరోజులు తను బతకదని తెలుసు, అదే జరిగింది. నా మేనకోడళ్లు (చెల్లి పిల్లలు) ఇద్దరూ చాలా స్ట్రాంగ్‌గా ఉండేవారు. తల్లి చనిపోయాక తనకోసం లేఖ రాశారు. ఆ మధ్య అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆ సమయంలో సుమ వచ్చి ఇప్పటి నుంచి మనకు నలుగురు పిల్లలు అంది. ఇప్పటికీ వాళ్లకు ఏం కావాలన్నా సుమ దగ్గరుండి చూసుకుంటుంది' అంటూ ఎమోషనలయ్యాడు రాజీవ్‌ కనకాల.

చదవండి: అనాథలా చనిపోయిన తెలుగింటి హీరోయిన్‌.. 

Advertisement

What’s your opinion

Advertisement