ఇద్దరినీ ఇష్టపడి.. పెళ్లి చేసుకున్నా

Raj Babbar And Smita Patil Love Story In Bollywood - Sakshi

భూమిక ‘అర్థ్‌’ (1982) తన జిందగీకి ప్రేరణే అంటాడు దర్శకుడు మహేశ్‌ భట్‌ (ఆ సినిమాకూ అతనే దర్శకుడు). కాని ఈ సినిమా స్మితాపాటిల్‌ జీవితం కూడా. అందులో ఆమెది పెళ్లయిన సినిమా దర్శకుడిని ప్రేమించే హీరోయిన్‌ భూమిక. తన లైఫ్‌ను పోలిన పాత్ర. అయితే ఆమె భర్త రాజ్‌బబ్బర్‌ మాత్రం దర్శకుడు కాదు కథానాయకుడు. స్మిత పాటిల్‌తో రాజ్‌తో ప్రేమలో పడేనాటికి అతను ఇద్దరు పిల్లల తండ్రి. ఈ జంట ప్రేమకథే నేటి మొహబ్బతేకి అంశం. కాని దీన్ని ముక్కోణంలో చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజ్‌బబ్బర్‌ మొదటి భార్య నదీరా కూడా నటే. ఆ ఇద్దరిదీ ప్రేమ వివాహమే. కమర్షియల్‌ హిందీ సినిమాతోపాటు పారలెల్‌ సినిమాతో పరిచయం ఉన్న ప్రేక్షకులకు రాజ్‌బబ్బర్, స్మితా పాటిల్‌లు తెలిసే ఉంటారు. థియేటర్‌ అభిమానులకు నదీరా తెలియకపోయే ప్రసక్తే లేదు.

ముందుగా స్మిత, రాజ్‌ల ప్రేమ ప్రయాణం..
గొడవతో మొదలైన స్నేహం..
రాజ్‌బబ్బర్, స్మితా పాటిల్‌ కలిసి నటించిన తొలి సినిమా ‘తజుర్బా’. అయితే ఒకరికొకరు అపరిచితులుగానే ఆ సినిమాను పూర్తి చేశారు. ఈ ఇద్దరే కలిసి నటించిన తర్వాత చిత్రం ‘భీగీ పల్కే’. ఆ షూటింగ్‌లో ఒకరితో ఒకరికి పరిచయం అయింది. అది కూడా చిన్న గొడవతో. ‘ఆ సినిమా సెట్స్‌ మీద స్మితా పాటిల్‌ ఎవ్వరినీ లెక్కచేయనట్టుగా కొంచెం గర్వంగా కనిపించేది. ఆ ఆటిట్యూడ్‌కే ఆమెతో ప్రేమలో పడ్డా’ అని చెప్పాడు రాజ్‌బబ్బర్‌ ఓ ఇంటర్వ్యూలో. గొడవతో మొదలైన ఆ పరిచయం స్నేహంగా మారింది. భీగీ పల్కే షూటింగ్‌ పూర్తయ్యేలోపు వీళ్ల మధ్య ప్రేమా ఖరారైంది. మీడియాకు నిప్పందాలి కాని రాజేయడం ఎంతసేపు? అలా ఆ జంట ప్రేమను పేజీల్లో కాలమ్స్‌గా నింపేసుకుంది. అది రాజ్‌బబ్బర్‌ భార్య నదీరా కంటా పడింది. కాని భర్త మీదున్న నమ్మకంతో పెద్దగా పట్టించుకోలేదు. ‘స్మిత నా భర్తతో చాలా క్లోజ్‌గా ఉందన్న విషయం నాకు తెలుసు. ఆమె రాజ్‌ సాహచర్యాన్ని కోరుకుంటోందనీ అర్థమైంది. ఒకవేళ్ల అది అఫైరే అయినా నాకు, పిల్లలకు రాజ్‌ దూరమవడనే నమ్మకంతో ఉన్నా’ అని చెప్పింది నదీరా ఒక ఇంటర్వ్యూలో.

హోమ్‌ బ్రేకర్‌
నదీరా అనుకున్నట్లు జరగలేదు. రాజ్‌ పట్ల ఆమె పెట్టుకున్న నమ్మకం వమ్మయింది. స్మితను విడిచి ఉండలేని స్థితికి వచ్చాడు రాజ్‌. స్మితా అంతే రాజ్‌కు జీవితభాగస్వామి కావాలనుకుంది. ఆమెను పెళ్లి చేసుకున్నాడు రాజ్‌.. నదీరాకు విడాకులు ఇవ్వకుండానే. ఆ ఇంటిని విడిచి స్మితాతో వచ్చేశాడు. హతాశురాలైంది నదీరా. సామాజిక స్పృహ ఉన్న నటిగా, అలాంటి పాత్రలకు పెట్టింది పేరుగా ఉన్న స్మితా పాటిల్‌ మీద బాలీవుడ్‌ కుటుంబాలు ‘హోమ్‌ బ్రేకర్‌’ అనే ముద్రవేశాయి. ఆ రోజుల్లో ఆమె ఓ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం మీద స్పందిస్తూ ‘కొన్ని విషయాలు అవతలివాళ్లకు అంత తేలికగా అర్థం కావు. అర్థం చేయించలేం కూడా. అందుకే సొసైటీ నన్నెట్లా చూస్తోంది.. ద్వేషిస్తోందా? శత్రువులా ట్రీట్‌ చేస్తోందా అని పట్టించుకోవట్లేదు’ అని చెప్పింది. విడాకులివ్వకుండా స్మితాపాటిల్‌ను పెళ్లి చేసుకోవడం పట్ల రాజ్‌బబ్బర్‌ కూడా స్పందించాడు... ‘స్మితాను ప్రేమించాను అంటే నదీరాతో నాకు స్పర్థలున్నాయని కాదు. ఇద్దరినీ ఇష్టపడ్డాను.. ఇద్దరినీ పెళ్లిచేసుకున్నాను. స్మిత పట్ల నాకున్న ఫీలింగ్స్‌ను నదీరా అర్థం చేసుకుంది. అది చాలు నాకు’ అని.

అయితే..
ఆ ఇద్దరి దాంపత్య జీవితం ఊహించినంత సాఫీగా, సంతోషంగా సాగలేదు. బయట నుంచి పరుషమైన కామెంట్లను ఎన్ని ఎదుర్కొన్నా చిరునవ్వును చెదరనివ్వలేదు స్మితా. అభద్రత వెంటాడుతున్నా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఒక బిడ్డను కని రాజ్‌తో ఉన్న తన ప్రేమ బంధాన్ని మరింత భద్రం చేసుకోవాలనుకుంది. అనుకున్నట్టుగానే కొడుకును కన్నది కాని మాతృత్వాన్ని ఆస్వాదించలేకపోయింది. అటు రాజ్‌బబ్బర్‌కూ కలకాలం తోడు కాలేకపోయింది. ప్రతీక్‌ పుట్టిన రెండు వారాలకు బ్రెయిన్‌ హ్యామరేజ్‌తో 31 ఏళ్లకే కన్ను మూసింది స్మతాపాటిల్‌. ఆ నిష్క్రమణ స్మిత తల్లిదండ్రులు, రాజ్‌బబ్బర్‌నే కాదు నదీరానూ షాక్‌ గురిచేసింది.

‘స్మిత మరణం జీర్ణించుకోలేని విషాదం. మా అందరన్నీ కుప్పకూల్చింది. ప్రతీక్‌తో పాటు తను కన్న కలలనూ వదిలేసి అర్ధంతరంగా వెళ్లిపోయింది. తను లేని లోటు పూడ్చలేనిది’ అని చెప్తుంది

నదీరా.
‘తను లేని ఈ లోకంలో నేను జీవచ్ఛవాన్నే. పనిలో పడి ఆ వేదనను మరిచిపోయే ప్రయత్నం చేశా. మనసుకైన గాయాన్ని మాత్రం మాన్చుకోలేకపోయా’ అంటాడు రాజ్‌బబ్బర్‌. కాని గాయపడిన ఆ మనసుకు సాంత్వననిచ్చి.. మళ్లీ అండగా నిలబడింది నదీరానే.
-ఎస్సార్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top