‘నటుడిగా నేను కెరీర్ ప్రారంభించిన తొలి సినిమాకే మరిడేశ్ బాబు లాంటి అద్భుతమైన పాత్ర రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతకంటే మంచి డెబ్యూని నేను కోరుకోలేను. సినిమా బండి సినిమా నటుడిగా నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది’ అని రాగ్ మయూర్ అన్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాగ్ మయూర్.. ఇండస్ట్రీకి వచ్చి ఈ శుక్రవారం(మే 15)తో ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులకు, నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కెలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.
👉 సినిమా బండి రిలీజ్ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. వీరాంజనేయులు విహారయాత్ర, కీడా కోలా, గాంధీతాతా చెట్టు వంటి చిత్రాలు యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత దగ్గర చేశాయి. ప్రముఖ హిందీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’కు రీమేక్‌గా వచ్చిన ‘సివరాపల్లి’ నటుడిగా మరింత గుర్తింపు తెచ్చింది.
👉 ‘సివరాపల్లి’ సూపర్‌హిట్ తర్వాత నాకు మరింత ఆత్మ విశ్వాసం వచ్చింది. చాలా మంది దర్శకులు నన్ను దృష్టిలో పెట్టుకుని పాత్రలను రాశామని చెప్పారు. దర్శకులు నాకోసం ప్రత్యేకంగా పాత్రలు రాయటం అనేది నటుడిగా నాకు గొప్ప గుర్తింపు. నేను థియేటర్ ఆర్టిస్ట్ కావటంతో నటనలో విభిన్న కోణాలను అన్వేషించే అవకాశం దక్కింది. అది నా నటనను మరింత మెరుగు పరిచింది.
👉 ‘శుభం’లో క్యామియో రోల్ చేశా. అది చిన్న క్యామియో పాత్రే అయినా, ఓ బ్లాక్‌బస్టర్ సినిమాలో భాగమవడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఆ అవకాశం ఇచ్చిన సమంత గారికి కృతజ్ఞతలు.
👉 ప్రస్తుతం డైరెక్టర్ గౌరి నాయుడు జమ్ము తెరకెక్కిస్తోన్న ‘గరివిడి లక్ష్మి’లో బుర్రకథ కళాకారుడి పాత్ర చేశా. ఇది చాలా ఎక్సైటింగ్‌తో పాటు ఛాలెంజింగ్ పాత్ర కూడా. ఈ పాత్ర కోసం ఎంతో ప్రిపేర్ అయ్యి నటించాను.
👉 నా ఫిల్మోగ్రఫీపై గర్వంగా ఉంది. కెరీర్ ప్రారంభ దశలోనే అగ్రశ్రేణి దర్శకులు, టెక్నీషియన్స్‌తో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఎమోషన్స్, రియలిస్టిక్ కథనాలకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించాలని ఎప్పటినుంచో కోరుకున్నాను’ అని అన్నారు.


