Radhe Shyam Movie: ఎవరికి రాసి పెట్టుందో.. 'రాధేశ్యామ్‌' గురించి పలు ఆసక్తికర విషయాలు

Radhe Shyam Movie Pre Release Event In Hyderabad - Sakshi

Radhe Shyam Movie Pre Release Event: పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా  నటించిన చిత్రం ‘రాధేశ్యామ్‌’. కేకే రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం వచ్చే జనవరి 14న విడుదలవుతోంది. గురువారం (డిసెంబర్‌ 23) హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ప్రభాస్‌ అభిమానుల చేతుల మీదుగా ‘రాధేశ్యామ్‌’ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ ‘‘నేను రెబల్‌స్టార్‌.. రెబల్‌స్టార్‌ ఎప్పుడూ రెబల్‌గానే ఉంటాడు. లేదంటే రెబల్‌ని కల్పిస్తాడు. ఈ రెబల్‌ (ప్రభాస్‌ని ఉద్దేశించి) మరో 50 ఏళ్లు మిమ్మల్ని ఆనందపరుస్తాడు. 55ఏళ్లుగా నన్ను అభిమానిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే (ఫ్యాన్స్‌ని ఉద్దేశించి) పరిగెత్తుకుంటూ వచ్చి కలవాలని, కౌగిలించుకోవాలని ఉంది. ఈ వేదికపైకి వచ్చి సరదాగా డ్యాన్స్‌ వేసి, ఎంజాయ్‌ చేద్దామనుకున్నాను. కానీ మరో వారం పదిరోజుల పాటు నిలబడలేను. ఆ తర్వాత డ్యాన్స్‌ చేద్దాం.’’ అని అన్నారు. 

చిన్న సైజు దేవుడిలా ఉ‍న్నారు కదా..
‘‘రాధేశ్యామ్‌’ ట్రైలర్‌ని మీరు (అభిమానులు) లాంచ్‌ చేశారు.. మీకు నచ్చిందనుకుంటున్నాను. పెదనాన్నగారి (కృష్ణంరాజు) లుక్‌ చూశారుగా.. ఎలా ఉన్నారు. చిన్న సైజు దేవుడిలా ఉన్నారు కదా. గోపీకృష్ణా మూవీస్‌లో ‘మన  ఊరి పాండవులు, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు’ వంటి పెద్ద సినిమాలు తీశారు. ఆ బ్యానర్‌ అంటే కొంచెం టెన్షన్‌గా ఉంటుంది. మేమిద్దరం కలిసి ‘బిల్లా’ చేశాం. బాగానే ఆడింది. ఇప్పుడు ‘రాధేశ్యామ్‌’. ఈ చిత్రం లవ్‌స్టోరీనే కానీ ఇంకా చాలా ఉన్నాయి. రాధాకృష్ణ ఐదేళ్లు ఈ సినిమాకు పని చేయడం అంటే జోక్‌ కాదు. ఈ సినిమాలో చాలా ట్విస్ట్‌లు, టర్నింగ్స్‌ ఉన్నాయి. మీరందరూ ఎంజాయ్‌ చేస్తారు. క్లైమాక్స్‌ హైలైట్‌ అవుతుంది. ‘సాహో’ సమయంలో ఇండియా మొత్తం తిరిగినప్పుడు సిగ్గు పోయి బాగా మాట్లాడేస్తాననుకున్నాను కానీ పోలేదు. ఇది అంతేనేమో (నవ్వుతూ). ఈసారి ఎలాగైనా మాటలు ఇరగదీసేద్దామనుకున్నా.. బట్‌ కుదర్లేదు’’ అని ప్రభాస్‌ తెలిపారు. 

స్టార్‌ హీరోకు కావాల్సింది అదే: దిల్‌ రాజు
‘‘ఇది అందమైన ప్రేమకథ. ఈ సినిమాలో కొత్త ప్రభాస్, కొత్త పూజాహెగ్డేలను చూస్తారు.’’ అని పూజా హెగ్డే పేర్కొంది. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ ‘‘ప్రభాస్‌తో నాకున్న ప్రయాణం గురించి మీకు తెలుసు. ‘రాధేశ్యామ్‌’ ట్రైలర్‌ చూస్తే ఒక చిన్న సంఘటన గుర్తొస్తోంది. ‘డార్లింగ్, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ సినిమా రిలీజ్‌ అయినప్పుడు మా ఇద్దరి మధ్య ఓ చిన్న చర్చ జరిగింది. మాస్‌ హీరోని ఇంత క్లాస్‌గా ఎవరు చూస్తారు? అని. ఆ రెండు సినిమాలు సూపర్‌హిట్‌ అయిన తర్వాత ప్రభాస్‌ ‘మిర్చి, రెబల్, బాహుబలి, సాహో’లతో ఆకాశానికి వెళ్లిపోయి పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాక మళ్లీ ‘రాధేశ్యామ్‌’ లాంటి ఎంత క్లాస్‌ లవ్‌స్టోరీ చేశారో చూడండి. స్టార్‌ హీరోకు కావాల్సింది అదే.. ఎప్పుడూ కమర్షియల్‌తో పాటు కొత్తగా ప్రయత్నం చేస్తూ మనల్ని అలరించాలి. ‘రాధేశ్యామ్‌’ ట్రైలర్‌ చూశాక చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. 

18 ఏళ్లు పట్టింది..
‘‘రాధేశ్యామ్‌’ తీయడానికి నాలుగేళ్లు పట్టింది.. కానీ కథ రాయడానికి 18ఏళ్లు పట్టింది. ఫస్ట్‌ టైమ్‌ ఈ పాయింట్‌ని నేను మా గురువు చంద్రశేఖర్‌ యేలేటి వద్ద విన్నాను. 18 ఏళ్లు ఇండియాలోని పెద్ద పెద్ద రచయితలను పిలిపించి రాయించాం. కానీ, కథకు కన్‌క్లూజన్‌ దొరకలేదు.. ముగింపు కుదరడం లేదు. ఆ సమయంలో యేలేటిగారు ‘ఇది జాతకాల మీద రాస్తున్నావ్‌.. ఎవరికి రాసి పెట్టుందో అని’ అన్నారు. ఇది ప్రభాస్‌గారికి రాసిపెట్టి ఉంది. ఆయనతో సినిమా అనుకున్నప్పుడు కథతో కాదు ఓ ఛాలెంజ్‌తో చేయాలనుకుని మా గురువుని అడిగి ఈ పాయింట్‌ని తీసుకుని ఒక ఫిలాసఫీని ఒక లవ్‌స్టోరీలాగా చేసి, కథ రాసి ప్రభాస్‌గారికి చెప్పాను. ఆయనకు నచ్చింది. ఈ సినిమాలో ఫైట్స్‌ ఉండవు. అమ్మాయికీ, అబ్బాయికి మధ్య జరిగే యుద్ధాలుంటాయి. ఇదొక ప్రేమకథ. వంశీ, ప్రమోద్, విక్కీగార్లు లేకుంటే ఈ సినిమా లేదు. ప్రభాస్‌ని ఇంతకంటే నేనేం అడగను. మీలాంటి ఫ్రెండ్, గురువు అందరికీ ఉండాలి’’ అని దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ పేర్కొన్నారు. ఈ వేడుకలో చిత్రనిర్మాతలు వంశీ, ప్రమోద్, సంగీత దర్శకుడు జస్టిన్‌ ప్రభాకర్, కెమెరామేన్‌ మనోజ్‌ పరమహంస, డైరెక్టర్లు సందీప్‌ రెడ్డి వంగా, నాగ్‌ అశ్విన్, ఓం రౌత్, టి. సిరీస్‌ ముఖేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

ఇదీ చదవండి: రాధేశ్యామ్‌ ప్రీ రిలీజ్‌కు హోస్ట్‌గా జాతి రత్నం..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top