ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం పాన్ ఇండియా హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా 2024 జూన్ 27న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘కల్కి 2898 ఏడీ 2’ ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ మూవీ చిత్రీకరణను 2025లో ప్రారంభించేందుకు నాగ్ అశ్విన్ సన్నాహాలు చేశారు. అయితే ప్రీ ప్రోడక్షన్ పనులు ఆలస్యం కావడంవల్ల షూటింగ్ ఆరంభం కాలేదు. తాజాగా ‘కల్కి 2898 ఏడీ 2’ మూవీ షూటింగ్ ఆరంభం అయింది. హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
‘కల్కి 2898 ఏడీ’లో సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో నటించిన కమల్‌హాసన్‌పై సీన్స్ తెరకెక్కిస్తున్నారట నాగ్ అశ్విన్. శంకర్‌పల్లిలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో దాదాపు నెల రోజుల పాటు రెగ్యులర్ షూటింగ్ జరగనుందని సమాచారం. ఇదిలా ఉంటే... హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్న ప్రభాస్ మార్చిలో ‘కల్కి 2898 ఏడీ 2’ సెట్‌లోకి అడుగుపెడతారని తెలిసింది.


