‘పునీత్‌’ కళ్లు నలుగురికి చూపునిచ్చాయి

Puneeth Rajkumar Eye Donation Gives Sight To Four Persons - Sakshi

యశవంతపుర (బెంగళూరు): కన్నడ పవర్‌ స్టార్, యువ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ నేత్రాలను నలుగురికి అమర్చి చూపును ప్రసాదించారు వైద్యులు. పునీత్‌ శుక్రవారం గుండె వైఫల్యంతో బెంగళూరులో కన్ను మూసిన విషయం విదితమే. పునీత్‌ దేహం నుంచి కళ్లను ఆ రోజే నారాయణ నేత్రాలయ వైద్యులు సేకరించారు. ఆ కళ్లను శనివారం నలుగురు యువతకు అమర్చినట్టు నేత్రాలయ చైర్మన్‌ డాక్టర్‌ భుజంగశెట్టి తెలిపారు.

సోమవారం ఆయన వైద్య బృందంతో కలిసి మీడియాతో మాట్లాడారు. సాధారణంగా రెండు కళ్లను ఇద్దరికే అమర్చుతామని, కానీ పునీత్‌ కళ్ల విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక్కో కార్నియా (నల్లగుడ్డు)ను పై పొర, లోపలి పొరగా రెండు భాగాలుగా విభజించామని తెలిపారు. వీటిని పైపొర సమస్యతో బాధపడుతున్న ఇద్దరు యువకులకు, లోపలి పొరను ఆ సమస్య ఎదుర్కొంటున్న మరో ఇద్దరికి అమర్చామని వివరించారు.

కొత్త కంటిని శరీరం తిరస్కరించే ప్రమాదాన్ని ఇది బాగా తగ్గిస్తుందని కూడా తెలిపారు. వాడకుండా మిగిలిపోయిన తెల్లగుడ్డు భాగం ద్వారా తమ ల్యాబ్‌లో కంటి మూల కణాలను ఉత్పత్తి చేయనున్నట్టు చెప్పారు. ఎవరికైనా ప్రమాదాల్లో తెల్ల గుడ్డుకు గాయాలైతే ఆ కణాల ద్వారా చికిత్స చేయవచ్చన్నారు. రాజ్‌కుమార్, పార్వతమ్మ దంపతులు, వారి తనయుడు పునీత్‌ కళ్లను దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top