‘సలార్‌’ మూవీ రివ్యూ | Sakshi
Sakshi News home page

Salaar Review: ‘సలార్‌’ మూవీ రివ్యూ

Published Fri, Dec 22 2023 9:39 AM

Prabhas Salaar Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: సలార్‌ పార్ట్‌ 1- సీజ్‌ఫైర్‌
నటీనటులు: ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతీహాసన్‌, జగపతిబాబు, ఈశ్వరీరావు, టినూ ఆనంద్‌, రామచంద్రరాజు తదితరులు
నిర్మాతలు: విజయ్‌ కె.
దర్శకత్వం: ప్రశాంత్‌ నీల్‌
సంగీతం: రవి బస్రూర్‌
సినిమాటోగ్రఫీ: భువన గౌడ్‌
విడుదల తేది: డిసెంబర్‌ 22, 2023

ప్రభాస్‌ ఖాతాలో సూపర్‌ హిట్‌ పడి చాలా కాలం అవుతోంది. ఆయన నటించిన గత రెండు చిత్రాలు (రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌) ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్‌ ఆశలన్నీ ‘సలార్‌’పైనే పెట్టుకున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(డిసెంబర్‌ 22)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడులైన రెండు ట్రైలర్లు సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్‌ చేశాయి. భారీ స్థాయిలో ప్రమోషన్స్‌ చేయకపోయినా..యావత్‌ సినీ ప్రపంచం ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూసింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రభాస్‌ ఖాతాలో హిట్‌ పడిందా లేదా?  రివ్యూలో చూద్దాం.

సలార్‌ కథేంటంటే..
ఆద్య(శృతిహాసన్‌) విదేశం నుంచి కలకత్తా వస్తుంది. ఓబులమ్మ(ఝాన్సీ) మనుషుల నుంచి ప్రాణ హానీ ఉందని ఆమె తండ్రి ఆమెను బిలాల్‌(మైమ్‌ గోపీ) ద్వారా అస్సాంలో ఉన్న దేవా(ప్రభాస్‌) దగ్గరకు పంపిస్తాడు. దేవా బొగ్గు గనుల్లో మెకానిక్‌గా పని చేస్తుంటాడు. అతని తల్లి(ఈశ్వరీరావు)ఆ ప్రాంతంలోని పిల్లలకు పాఠాలు చెబుతూ జీవితాన్ని గడుపుతుంటారు. కొడుకు దేవా కాస్త లేట్‌గా ఇంటికి వచ్చినా..ఆమె భయపడుతుంది. అతని చేతిలో చిన్న ఆయుధం ఉన్నా సరే.. ఆందోళన చెందుతుంది.

ఆవిడ ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? పాతికేళ్ల క్రితం ఖాన్సార్‌లో ఏం జరిగింది? అక్కడి నుంచి దేవా, అతని తల్లి ఎందుకు బయటకు వచ్చారు? ఖాన్సార్‌ కర్త(జగపతి బాబు) రెండో భార్య కొడుకు వరద రాజమన్నార్‌(పృథ్వీరాజ్‌ సుకుమారన్‌)ను చంపాలని కుట్ర చేసిందెవరు?  ఆ కుట్రను ఎదుర్కొనేందుకు వరద రాజమన్నార్‌ ఏం చేశాడు? స్నేహితుడు దేవాని మళ్లీ ఖన్సార్‌కి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది?  ప్రాణ స్నేహితుడు వరద రాజమన్నార్‌ కోసం దేవా  ఏం చేశాడు? ఆద్య ఎవరు?  ఓబులమ్మ మనుషులు ఆమెను చంపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు?  ఆద్యకు దేవా ఎందుకు రక్షణగా నిలబడ్డాడు. ఖన్సార్‌ ప్రాంతం నేపథ్యం ఏంటి? అనేది తెలియాలంటే సలార్‌ సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
మేకింగ్‌ పరంగా ప్రశాంత్‌ నీల్‌కు ఓ స్టైల్‌ ఉంది. ఆయన సినిమాల్లో హీరోకి ఓ రేంజ్‌లో ఎలివేషన్‌ ఉంటుంది. లెక్కలేనన్ని పాత్రలు వచ్చి వెళ్తుంటాయి. మదర్‌ సెంటిమెంట్‌    మస్ట్‌గా ఉంటుంది. సలార్‌లో కూడా ఈ హంగులన్నీ ఉన్నాయి. కేజీయఫ్‌లో మాదిరి ఇందులో కూడా ఖాన్సార్‌ అనే ఓ కల్పిత ప్రాంతాన్ని సృష్టించి, కథ మొత్తం దాని చుట్టే అల్లాడు. అయితే ఈ చిత్రంలో వచ్చే చాలా సన్నివేశాలు కేజీయఫ్‌ మూవీని గుర్తు చేస్తాయి. కథలోని పాత్రలు కూడా ఇంచుమించు అలానే అనిపిస్తాయి. కథనం కూడా అలానే సాగుతుంది. ఒకదానికి ఒకటి సంబంధం లేనీ సీన్లు చూపిస్తూ అందులో ఏదో విషయం దాగి ఉంది అనేలా కథను ముందుకు నడిపించాడు.

కేజీయఫ్‌తో పోలిస్తే ఇందులో హీరో ఎలివేషన్‌ కాస్త తక్కువే అయినా.. అక్కడ ఉంది ప్రభాస్‌ కాబట్టి ఆ సీన్స్‌ అన్నీ థియేటర్‌లో ఈళలు వేయిస్తాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్‌ని ఫ్యాన్స్‌కి నచ్చేలా చూపిస్తూ కథనాన్ని నడిపించాడు ప్రశాంత్‌ నీల్‌.  ఈ విషయంలో ప్రశాంత్‌ని మెచ్చుకోవాల్సిందే.  కథలో గందరగోళం.. కథనానికి నిలకడలేమి ఉన్నప్పటికీ.. సినిమాని ఎక్కడా బోర్‌ కొట్టించకుండా తీర్చి దిద్దాడు. అయితే పార్ట్‌ 2 కూడా ఉంది కాబట్టి అసలు కథను దాచిపెడుతూ లైటర్‌ వేలో పార్ట్‌ 1ని కంప్లీట్‌ చేశాడు. 

దేవా, వరద రాజమన్నార్‌ల చిన్ననాటి స్నేహబంధాన్ని చూపిస్తూ చాలా సింపుల్‌గా  కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత భారీ ఎలివేషన్‌తో హీరో పాత్రని ఎంట్రీ  చేశాడు. అతన్ని ప్రతిసారి తల్లి నియంత్రించడంతో హీరోయిజం పండించలేకపోతాడు. అయితే ప్రేక్షకులకు మాత్రం అది చాలా ఆసక్తిని కలిగిస్తుంది. తల్లి మాటకోసమే హీరో ఆగుతున్నాడు...ఒక్కసారి ఆమె వదిలేస్తే  ఎలా ఉంటుందో  అనే క్యూరియాసిటీ  ప్రతి ఒక్కరికి కలుగుతుంది.

సెండాఫ్‌లో కూడా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పాత్ర హీరోని నియంత్రిస్తుంది. కానీ ఒక్కసారి హీరో చేతికి కత్తి అందిన తర్వాత వచ్చే సీన్స్‌ గూస్‌బంప్స్‌ని తెప్పిస్తాయి. ఇలా రెండు పాత్రలు హీరోని నియంత్రించడం వల్లే యాక్షన్‌ సన్నివేశాలను మరింత బాగా  ఎలివేట్‌ అయ్యాయి. హీరో ఎలివేషన్స్‌.. యాక్షన్స్‌ సీన్స్‌తో ఫస్టాఫ్‌ అలరిస్తుంది. కానీ సినిమా మొత్తంలో ప్రభాస్‌ మాట్లాడేది చాలా తక్కువ సేపు. ఫస్టాఫ్‌లో అయితే రెండు, మూడు డైలాగ్స్‌ మాత్రమే ఉంటాయి. మిగతాది అంతా ఎలివేషన్‌.. యాక్షనే. 

ఇక సెకండాఫ్‌లో కథంతా ఖన్సార్‌ ప్రాంతం చుట్టూ తిరిగుతుంది. ఈ క్రమంలో వచ్చే పాత్రలు గందరగోళానికి గురిచేస్తాయి. కుర్చి కోసం చేసే కుతంత్రలు కూడా అంతగా రక్తి కట్టించవు.  అయితే ఈ క్రమంలో వచ్చే ఒకటి రెండు యాక్షన్‌ సీన్స్‌ అయితే అదిరిపోతాయి. ముఖ్యంగా ఓ గిరిజన బాలికను ఇబ్బంది పెట్టిన వ్యక్తిని హీరో సంహరించే సన్నివేశం గూస్‌బంప్స్‌  తెప్పిస్తాయి. బాహుబలి తరహాలో ఇందులో కూడా తల నరికే సన్నివేశం ఉంటుంది. అది కూడా హైలెట్‌. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ పార్ట్‌ 2పై ఆసక్తిని పెంచుతుంది. 


ఎవరెలా చేశారంటే.. 
రాజమౌళి తర్వాత ప్రభాస్‌ కటౌట్‌ని సరిగ్గా వాడుకున్న డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. ప్రభాస్‌ పాత్ర ఎలా ఉంటే అభిమానులకు నచ్చుతుందో అచ్చం అలానే దేవా పాత్రను తీర్చి దిద్దాడు. ఇక ఆ పాత్రలో ప్రభాస్‌ రెచ్చిపోయి నటించాడు. తల్లిమాట జవదాటని కొడుకుగా, స్నేహితుడి కోసం ఏదైనా చేసే వ్యక్తిగా అద్భుతమైన నటనను కనబరిచాడు. ప్రబాస్‌ చేత కత్తిపట్టి విలన్లను నరుకుతుంటే.. ఫ్యాన్స్‌ ఆనందంతో ఈళలు వేయడం పక్కా. ఇక వరద రాజమన్నార్‌గా పృథ్విరాజ్‌ సుకుమారన్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు బాగా నటించింది. ఓబులమ్మగా ఝాన్సీ కనిపించేది ఒకటిరెండు సన్నివేశాల్లోనే అయినా డిఫరెంట్‌ పాత్రలో కనిపించింది.

మన్సార్‌ ప్రాంత కర్త(రాజు)గా జగపతి బాబు తెరపై కనిపించింది కాసేపే అయినా గుర్తిండిపోయే పాత్ర చేశాడు. శృతిహాసన్‌ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఫస్టాఫ్‌లో ఆమే కీలకం. టినూ ఆనంద్‌, మైమ్‌ గోపీ,  రామచంద్రరాజుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. రవి బస్రూర్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. భువన గౌడ్‌ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను ఇంకాస్త క్రిస్పీగా కట్‌ చేసి.. నిడివి తగ్గిస్తే బాగుండేదేమో. నిర్మాణ విలువలు సినిమా స్థాయిక తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌ డెస్క్‌

Rating:
Advertisement
 
Advertisement
 
Advertisement