ప్రభాస్‌ 'కల్కి' సినిమా వాయిదా..? | Prabhas Kalki 2898 AD Movie Postponed? | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ 'కల్కి' సినిమాకు ఎన్నికల గండం..?

Mar 16 2024 5:23 PM | Updated on Mar 16 2024 5:39 PM

Prabhas Kalki 2898 AD Movie Postponed - Sakshi

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో 'కల్కి 2898 ఎ.డి' చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని కూడా ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ కల్కి సినిమా వారు ప్రకటించిన సమయానికి విడుదల కాకపోవచ్చని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన కూడా వచ్చేసింది. ఏప్రిల్‌ 19న తొలి విడత పోలింగ్‌ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌కు మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనున్నాయి. మే 7న కూడా 12 రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్న కల్కి చిత్రానికి ఎన్నికలు అడ్డుపడే అవకాశం ఉంది.  దీంతో మే 9న విడుదల కానున్న కల్కి సినిమా దాదాపు వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్‌ మార్కెట్‌ ఎక్కువ.. అలాంటిది ఎన్నికలకు కేవలం నాలుగు రోజుల ముందు కల్కి సినిమాను విడుదల చేస్తే పలు ఇబ్బందులు ఎదురు కావచ్చు.

అంతే కాకుండా రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ ఉండటం వల్ల రాత్రి సమయాల్లో గుంపులుగా తిరిగేందుకు ఆవకాశం ఉండదు. దీంతో సినిమాకు వెళ్లే వారికి అనేక అడ్డంకులు ఎదురుకావచ్చు. దేశవ్యాప్తంగా జరగనున్న ఎన్నికలు కాబట్టి ప్రతి రాష్ట్రంలో కల్కి చిత్రానికి కలెక్షన్స్‌ విషయంలో పలు ఇబ్బందులు రావచ్చని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. కల్కి కలెక్షన్స్‌పై కూడా భారీగా ఎన్నికల ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా మే 9న కల్కి చిత్రం విడుదల కావడం దాదాపు కష్టమేనని సమాచారం. కల్కి వాయిదా విషయంలో అధికారికంగా వైజయంతీ మూవీస్‌ వారి నుంచి ప్రకటన రావాల్సి ఉంది. 

మే 9వ తేదీతో వైజయంతీ మూవీస్‌కీ ఎంతో అనుబంధం ఉంది. ఈ సంస్థ నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి, మహర్షి చిత్రాలు మే 9నే విడుదలై ఘన విజయాన్ని అందుకున్నాయి. దీంతో కల్కి 2898 AD చిత్రాన్ని కూడా అదే రోజునే విడుదల చేస్తామని వైజయంతీ మూవీస్‌ గతంలో ప్రకటించింది. ఈ చిత్రంలో ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దిశా పఠానీ కీలక పాత్రలు పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement