Posani Krishna Murali Talk About Nandi Awards - Sakshi
Sakshi News home page

ఉత్తములు, అర్హులకు మాత్రమే నంది అవార్డులు : పోసాని

Jul 4 2023 4:57 PM | Updated on Jul 4 2023 6:27 PM

Posani Krishna Murali Talk About Nandi Awards - Sakshi

నంది అవార్డుల బాధ్యతలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనకు అప్పగించారని, ఉత్తములు, అర్హులకు మాత్రమే ఆ అవార్డులను అందిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఒకేసారి డ్రామా, టీవీ, సినిమా రంగాలకు అవార్డులు ఇవ్వడం సాధ్యం కాదని, మొదటగా పద్యనాటకాలకు అందించి, ఆ తర్వాత మిగతా రంగాలకు అందిస్తామని వెల్లడించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలుగు రాష్ట్రాల్లో 1998 నుంచి 2004 వరకు నంది అవార్డులు ఉండేవి. కానీ అవి కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం అయ్యాయి. చంద్రబాబు హయంలో నంది అవార్డులు ఇస్తామని చెప్పి రద్దు చేశారు. ఇప్పుడు సీఎం జగన్‌ మళ్లీ నందీ అవార్డులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ బాధ్యతను నాకు అప్పగించారు. నిజాయితీగా, వివక్ష లేకుండా అర్హులకు మాత్రమే అవార్డులు ఇస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా షూటింగ్‌ ఉచితంగా చేసుకోవచ్చు. స్టూడియోలు కడితే సహకరిస్తామని సీఎం జగన్‌ చెప్పారు. సినిమా రంగం అభివృద్ది కోసం సీఎం జగన్‌ ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు’అని పోసాని అన్నారు.   

ఎఫ్‌డీసీ ఎండీ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. నాటక రంగానికి నంది అవార్డుల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని, దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజుల గడువు ఉంటుందని అన్నారు. ఉప సంహరణకు నెల రోజుల గడువు ఇస్తున్నామన్న ఆయన ఐదు క్యాటగిరీల్లో పోటీలు ఉంటాయని అన్నారు. పద్య, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, పిల్లల నాటకాలు, యువ నాటికలు అన్నీ కలిపి మొత్తం 73 అవార్డులు ఇస్తామని విజయ్‌ కుమార్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement