
తెలుగు సినిమా చరిత్రలో ‘నువ్వే కావాలి’ సినిమా చెరగని ముద్ర వేసింది. ఈ చిత్రం విడుదలై నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2000 సమయంలోని యూత్‌కు ఈ సినిమాతో ఎన్నో తీపి గుర్తులు తప్పకుండా ఉంటాయని చెప్పవచ్చు. ఆ సమయంలో యూత్‌ను బాగా ఆకర్షించిన చిత్రాల్లో నువ్వే కావాలి ముందు వరుసలో ఉంటుంది. కె.విజయభాస్కర్ దర్శకత్వానికి త్రివిక్రమ్ రచనా శైలి మరింత బలాన్ని ఇచ్చింది. ఆపై కోటి అందించిన అద్భుతమైన సంగీతం ఇప్పటి తరం యూత్‌ను కూడా మెప్పిస్తుంది.
తరుణ్ బాల నటుడిగా దాదాపు 30 సినిమాలు చేశాడు. కానీ, హీరోగా ఆయనకు ఇదే తొలి సినిమా.. హీరోయిన్‌గా రిచా నటించగా మరో కీలకమైన పాత్రలో సాయి కిరణ్ నటించారు. మలయాళంలో భారీ విజయం సాధించిన ‘నిరం’ చిత్రానికి రీమేక్‌గా నువ్వే కావాలి తెలుగులో విడుదలైంది. అయితే, ఈ మూవీ ఇక్కడ కూడా కొన్ని థియేటర్స్‌లలో 400 రోజులు కూడా ఆడింది. 20 సెంటర్స్‌కు పైగానే 200రోజులు పాటు రన్ అయింది. ఆరు సెంటర్స్‌లలో 365రోజులు ప్రదిర్శించారు.
ఈ చిత్రం అక్టోబరు 13, 2000న విడుదలైంది. మొదట్లో ఈ చిత్రానికి తక్కువ థియేటర్లే దక్కాయి. హిట్ టాక్ రావడంతో రెండో వారం నుండి ఎక్కువ థియేటర్లలో విడుదల చేశారు. సుమారు మూడు కోట్లమందికి పైగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసినట్లు ఒక అంచనా. రూ. 1.3 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్ర విజయంతో స్రవంతి రవికిషోర్ ఆర్థిక కష్టాలు కూడా తీరిపోయాయని చెబుతారు. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి ఆయన ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు.

ఈ సినిమాకు ఫస్ట్ చాయిస్ మహేష్ బాబు
ఈ సినిమా హీరో ఎంపిక ఎలా జరిగిందో గతంలో నిర్మాత రవికిషోర్ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. ఒక మంచి యువ నటుడితో బడ్జెట్‌లో సినిమా తీసి లాభాలు అందుకోవాలని రవికిషోర్ ఆలోచన. అప్పుడే మహేష్ బాబు కథానాయకుడిగా ప్రవేశించారు. రాజకుమారుడు సినిమా విడుదలై యువరాజు షూటింగ్ జరుగుతుంది. ఆ సమయంలోనే 'నిరం' చిత్రం చూడమని మేకర్స్ ప్రింట్ పంపించారు. రెండు నెలలయినా ఆయన నుంచి స్పందన రాలేదు.
రెండో ప్రత్యామ్నాయంగా సుమంత్ అనుకున్నారు. కానీ సుమంత్ అప్పటికే యువకుడు, పెళ్ళిసంబంధం చిత్రాల్లో నటిస్తూ ఖాళీ లేకుండా ఉన్నాడు. తర్వాత రాం గోపాల్ వర్మ హిందీ సినిమా మస్త్‌లో నటిస్తున్న ఆఫ్తాబ్ శివదాసానీని కూడా పరిశీలించారు. అయితే, తమ బడ్జెట్‌లో అయ్యేలా కనిపించలేదు. చివరగా కొత్త వాళ్ళతో సినిమా తీయాలని రవికిషోర్ నిర్ణయించుకున్నాడు.
బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన తరుణ్ పెద్దయిన తర్వాత ఒక వ్యాపార ప్రకటనలో కనిపించాడు. తరుణ్ కుటుంబం కూడా అతన్ని కథానాయకుడిగా ప్రవేశ పెట్టాలని ఆలోచిస్తున్నారు. అప్పుడే రవికిషోర్ తమ సినిమాను గురించి చెప్పి అతన్ని ఒప్పించారు. ఆ సినిమాకు తరుణ్ పారితోషికం రూ. 3 లక్షలు. కథానాయిక కోసం చాలా వెతుకులాట జరిగింది. చివరికి వద్దనుకున్న ఫోటోల్లో మళ్ళీ వెతుకుతుంటే రిచా సరిపోతుందనిపించింది. రెండో కథానాయకుడిగా గాయకుడు రామకృష్ణ కొడుకు సాయికిరణ్‌ను ఎంచుకున్నారు.

సినీ ట్రెండ్ సెట్టర్: ఈ చిత్రం తెలుగు ప్రేమకథా చిత్రాల ధోరణిని మార్చిన సినిమా. వాస్తవికత, సహజమైన సంభాషణలు, యువతరాన్ని ఆకట్టుకునే కథనంతో కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. ఈ సినిమా తరుణ్, త్రివిక్రమ్, విజయభాస్కర్, కోటి వంటి ప్రతిభావంతుల కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది.
హిందీ రీమేక్: ఈ సినిమా తుఝే మేరీ కసమ్ అనే పేరుతో హిందీలో పునర్నిర్మించబడింది, ఇందులో జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ నటించారు.
‘నువ్వే కావాలి’ సినిమాకు జాతీయ అవార్డు లభించింది. ఇది 2000 సంవత్సరానికి ‘ఉత్తమ తెలుగు చిత్రం’గా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది.
నంది అవార్డులు:
- ఉత్తమ కథానాయకుడు – తరుణ్
- ఉత్తమ కథానాయిక – రిచా పల్లోడ్
- ఉత్తమ దర్శకుడు – కె. విజయభాస్కర్
- ఉత్తమ రచయిత – త్రివిక్రమ్ శ్రీనివాస్
- ఉత్తమ సంగీత దర్శకుడు – కోటి
- ఉత్తమ చిత్రం – ఉషాకిరణ్ మూవీస్