పెద్ద సినిమా కాదు కానీ గొప్ప సినిమా : విశ్వక్‌ సేన్‌

Not Taking Even A Single Word Back: Hero Vishwak Sen - Sakshi

‘పాగల్‌’ సినిమా విజయంపై నమ్మకం ఉంది కాబట్టే ప్రీ రిలీజ్‌ వేడుకలో నేను మాట్లాడిన ఏ మాటను కూడా వెనక్కి తీసుకోవడం లేదు. నా స్నేహితులు, ఇతరులు మా చిత్రం ప్రివ్యూ చూసి, ‘నువ్వు పేరేం మార్చుకోనక్కర్లేదు’’ అని హీరో విశ్వక్‌ సేన్‌ అన్నారు. నరేశ్‌ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్‌ సేన్, నివేదా పేతురాజ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘పాగల్‌’. ‘దిల్‌’ రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ–  ‘‘సినిమా మొదలైన తొలి ఐదు, పది నిమిషాల్లోనే కథ ఏంటనేది ప్రేక్షకులకు స్పష్టత వచ్చేస్తుంది.  ‘నీ అంత బాగా నన్నెవరు చూసుకుంటారమ్మా?’ అని హీరో తన తల్లిని అడిగినప్పుడు, ‘మనం నిజాయతీగా ప్రేమిస్తే వాళ్లు తిరిగి ప్రేమిస్తారు’ అని అంటుంది. ఏ అమ్మాయిని అయినా అన్‌కండిషనల్‌గా ప్రేమిస్తే తన తల్లి చూపించే అంతటి ప్రేమ దొరుకుతుందని హీరోకి అనిపిస్తుంది. ఆ పాయింట్‌ మీదనే సినిమా నడుస్తుంది. ప్రీ రిలీజ్‌ వేడుకకు వచ్చే ముందు నా సినిమాను ఒకసారి చూసుకుంటాను. ఎక్కువ, తక్కువ కాకుండా సినిమాని బట్టి వేదికపై మాట్లాడతాను.

‘పాగల్‌’  సినిమా గురించి థియేటర్‌ నుంచి ఇంటికెళ్లిన తర్వాత కూడా మాట్లాడుకుంటారు. మాది పెద్ద సినిమా కాదు కానీ గొప్ప సినిమా అని చెప్పగలను. ఇప్పటి వరకు నేను నాలుగైదు సినిమాలు చేశాను. వాటిని చూసిన నా ఫ్రెండ్స్‌ నన్ను పొగడలేదు. కానీ ‘పాగల్‌’ ప్రివ్యూ చూసి బాగుందని పొగిడారు. ఈ సినిమాని నమ్ముకుని చాలామంది భవిష్యత్‌ ఉంది. పైగా ప్రేక్షకులకు థియేటర్‌ అనుభూతి ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఓటీటీకి వెళ్లకుండా థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నాం. ప్రస్తుతం పీవీపీ, ‘దిల్‌’ రాజుగార్లు నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నాను. ఇప్పటికే 70 శాతం పూర్తయింది. ఈ చిత్రం తర్వాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, బాపినీడుగార్లు నిర్మించనున్న ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా చేస్తాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top