
సినిమా అంటే ఇష్టం లేదంటుంది. కానీ సినిమా కోసం ఏదైనా చేస్తుంది. సినిమాలు మానేయాలని ఆలోచిస్తుంది. కానీ తను అడుగుపెట్టిన ప్రతి ప్రాజెక్టులో అద్భుతంగా నటిస్తుంది. అలా తరుచిత్రంబళం (తెలుగులో తిరు) సినిమాకుగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది నిత్యామీనన్ (Nithya Menen). ప్రస్తుతం ఈ బ్యూటీ ఇడ్లీ కడై (తెలుగులో ఇడ్లీ కొట్టు) (Idly Kadai Movie) సినిమా చేస్తోంది. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిత్య.. పల్లెటూరి యువతిగా కనిపించనుంది.
పిడకలు చేశా..
ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే తిరు సినిమాకు వచ్చిన జాతీయ అవార్డును అందుకోవడానికి వెళ్లింది. ఆ సందర్భం గురించి మాట్లాడుతూ.. ఇడ్లీ కడై సినిమా కోసం నేను పిడకలు చేయడం నేర్చుకున్నాను. పిడకలు చేయడానికి సమ్మతమేనా? అని అడగ్గానే ఎందుకు చేయను? అని రంగంలోకి దిగాను. నా జీవితంలో తొలిసారి పేడ చేతిలో పట్టుకుని దాన్ని గుండ్రంగా పిడకలు చేశాను. పిడకలు చేసిన మరునాడే జాతీయ అవార్డు తీసుకునేందుకు వెళ్లాను. అప్పుడు నా వేలి గోర్లలో ఆ పేడ ఇంకా అలాగే ఉంది.
ఇంత మంచి అనుభూతి..
అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమా ద్వారా విభిన్నమైన విషయాలు నేర్చుకున్నాను. ఈ మూవీ చేయకపోయుంటే ఇంత మంచి అనుభూతి నాకు దక్కేదే కాదు అని చెప్పుకొచ్చింది. ఇడ్లీ కడై విషయానికి వస్తే తిరుచిత్రంబలం సినిమా తర్వాత ధనుష్- నిత్య కాంబినేషన్‌లో వస్తున్న రెండో మూవీ ఇది! ఇందులో అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, పార్తీబన్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుంది.
చదవండి: చనిపోయేలోపు న్యాయం జరుగుతుందా? ఆస్పత్రిలో నటుడి మాజీ భార్య