రాయలసీమ ఫ్యాక్షన్‌ లీడర్‌గా విలనిజం చూపించిన నిర్మలమ్మ

Nirmalamma Daughter Reveals Interesting Facts About Her - Sakshi

సినీ పరివారం

‘అది మా పుట్టింటివాళ్లు ఇచ్చిన మరచెంబురా, బుజ్జిముండకి ఎన్ని సొట్టలు పడ్డాయో ఏంటో... అంటూ మనింటి బామ్మగా తెలుగువారికి చేరువయ్యారు. వేసేయండ్రా తలుపులు అంటూ... రాయలసీమ ఫ్యాక్షన్‌ లీడర్‌గా విలనిజమూ చేశారు.. తల్లి లేని పిల్లలకు బామ్మగా నటిస్తూ, మనవలకు చేరికయ్యారు... సినిమాలలో ఎంత సింపుల్‌గా ఉంటారో, నిజ జీవితంలోనూ అంతే సింపుల్‌గా ఉంటుంది అమ్మ అంటున్నారు జి. నిర్మలమ్మ (రాజమణి) ఏకైక కుమార్తె కవిత.

1927, నవంబరు నెల, దీపావళి వెళ్లిన ఏడో రోజున అంటే సప్తమి తిథి నాడు తొమ్మిదో సంతానంగా బందరులో పుట్టింది అమ్మ. తాతయ్య కోటయ్య, అమ్మమ్మ గంగమ్మ. అమ్మను వాళ్ల పెద్దక్కయ్యే పెంచి పెద్ద చేశారు. అమ్మ మూడో తరగతి వరకే చదువుకుంది. చిన్నప్పటి నుంచి ఆటపాటలలో చాలా చలాకీగా ఉండేదట. అమ్మకి డాన్స్, నాటకాలంటే ప్రాణమని చెప్పేది. వేదాంతం రాఘవయ్య గారితో కలిసి డాన్స్‌ చేసిందట అమ్మ. అమ్మకి ఏడు సంవత్సరాల వయసులో ‘మార్కండేయ’ సినిమాలో, చిత్రపురి నారాయణమూర్తి గారి ద్వారా నాటకాలలో నటించడానికి అవకాశం వచ్చింది.

నాటకాలలో నటిస్తూ, మంచి నటన నేర్చుకోవచ్చనుకుంది అమ్మ. తన పద్నాలుగో ఏట ‘భక్త ప్రహ్లాద’ నాటకంలో ప్రహ్లాదుడిగా నటించింది. మంచి తెలుగు వచ్చు కాబట్టి, పద్యాలు చాలా చక్కగా చదవగలిగానని అమ్మ చెప్పేది. ‘సక్కుబాయి’ నాటకం చూసి బాగుందని మెచ్చుకున్నారట కానీ, ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదట. చిన్నగా, సన్నగా ఉన్నావు. కొంచెం ఒళ్లు రావాలి, అలాగే ఇంకా  బాగా ప్రాక్టీస్‌ చేయాలి అన్నారట. పద్యాలు, పాటలు సాధన చేస్తూ, సినిమా అవకాశాల కోసం ఎదురుచూసిందట అమ్మ. ఘంటసాల బలరామయ్యగారు అమ్మ ఫొటోలు చూసి ‘గరుడ గర్వభంగం’ చిత్రంలో సత్యభామ చెలికత్తె వేషం ఇచ్చారట.

క్రమేపీ పుల్లయ్య గారు, గూడవల్లి రామబ్రహ్మం గారు, బి. ఎన్‌. రెడ్డిగారు... వీరందరి పరిచయాలతో అమ్మకు సినిమాలలో మంచి మంచి అవకాశాలు వచ్చాయి. ఎత్తుకు పై ఎత్తు, మనుషులు మారాలి...  వరసగా 900 కు పైగా చిత్రాలలో నటించింది. ఒక సంవత్సరంలో 19 సినిమాలు చేసిన రికార్డు అమ్మది. 70 సంవత్సరాలు వచ్చాక కూడా చేసింది. హిందీ, తమిళ చిత్రాలకు సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకుంది. సినీ పరిశ్రమలో అమ్మని అందరూ సొంత తల్లిలా భావించేవారు. అమ్మనాన్నలను అక్క – బావ అని పిలిచేవారు. 

ప్రోత్సహిస్తేనే వివాహం..
అమ్మకు 19 సంవత్సరాల వయసు వచ్చేసరికి వివాహం చేసుకోమని అమ్మమ్మ అడిగిందట. అందుకు అమ్మ, ‘నన్ను కళాకారిణిగా ప్రోత్సహించేవారినే చేసుకుంటాను’ అని నిక్కచ్చిగా చెప్పిందట. కళల పట్ల ఆసక్తి ఉన్న జి. వి. కృష్ణారావు గారితో అమ్మ వివాహం జరిగింది. పెళ్లయిన నాటి నుంచి ఇద్దరిదీ ఒకే మాట, ఒకటే బాట. ఉదయిని థియేటర్‌ స్థాపించి, ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. ఏ పోటీకి వెళ్లినా అమ్మకు బహుమతి తప్పనిసరి. ఆంధ్రకళాపరిషత్తులో మూడు సార్లు వరసగా బహుమతులు రావటంతో, నిర్వాహకులు ‘అమ్మా! ఇక నుంచి మీరు బహుమతులకు దూరంగా ఉండండి’ అన్నారట. ఆ విషయం అమ్మ ఎంతో సంబరంగా చెప్పేది.

పెద్దల ప్రశంసలు...
అమ్మ ఒకసారి ‘కరవు రోజులు’ నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు ఆ నాటకానికి ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు పృ«థ్విరాజ్‌ కపూర్‌ హాజరయ్యారట. ఆ నాటకంలో అమ్మ స్టేజ్‌ మీద పావుగంట సేపు  శవంలా ఉంటుంది. నాటకం పూర్తయ్యాక ఆయన, ‘శవం బాగా నటించింది’ అని చమత్కరిస్తూ అమ్మను అభినందించారని అమ్మ ఎంతో సంతోషంగా చెప్పేది. అలాగే ‘ఎంతో ప్రావీణ్యం ఉంటేనే కానీ రేడియో నాటకాలలో నటించలేం. నాలుగు గోడల మధ్య మైకు ముందర నిలబడి, అందరికీ కళ్ల ముందు కనిపిస్తున్నట్లు నటించాలి. నాకు రేడియో నాటకాలంటే మక్కువ’ అనేది. విశ్వనాథ సత్యనారాయణగారు రచించిన వేయిపడగలు, ఏకవీర నాటకాలలో నటించింది. ‘వేయిపడగలు’ లో గిరిక పాత్ర విని, ఆయన స్వయంగా ‘పిచ్చి తల్లీ! నిన్ను తక్కువ అంచనా వేశాను. ఎంత బాగా నటించావో’ అని ఆశీర్వదించారుట. 

అన్నీ పద్ధతిగా ఉండాలి...
అన్ని పనులు చాలా చురుగ్గా చేసుకునేది. తాను సెలబ్రిటీని అనే భావన ఏ కోశానా ఉండేది కాదు. వంట స్వయంగా చేసుకుంటేనే ఇష్టం అమ్మకు. వంటవాళ్లతో చేయించుకోవటం ఇష్టం లేదు. ఉలవచారు, చేపల పులుసు.. అన్నీ చాలా శ్రద్ధగా చేసేది. ముక్కలు తరిగితే... ఒక ముక్క పెద్దది, ఒక ముక్క చిన్నది అయితే ఒప్పుకునేది కాదు. ఆవకాయ ముక్కలు సైతం పెద్ద కత్తి పీట మీద తరిగేది. బయట వాళ్లు రకరకాల సైజుల్లో కట్‌చేస్తారని అమ్మకు నచ్చేది కాదు. గోంగూర ఆరబెట్టి, శుభ్రం చేసి పచ్చడి తయారుచేసేది. పెసరపప్పు అప్పడాలు బాగా ఒత్తేది. అడిగిన వారికే కాదు, అడగని వారికి కూడా సీసాలలో పచ్చళ్లు ఇచ్చేది. నలుగురికీ పెట్టడమంటే అమ్మకి చాలా ఇష్టం. అమ్మ వంట చేసి షూటింగ్‌కి క్యారియర్‌ తీసుకువెళ్లేది. ఔట్‌డోర్‌ షూటింగ్‌కి వెళ్లినప్పుడు అక్కడ సొంతంగా వంట చేసేది. ఇంటికి ఎవరు వచ్చినా భోజనం చేసి వెళ్లమనేది.

పూల జడ వేసేది...
నా చిన్నప్పుడు అమ్మ చెన్నై నుంచి హైదరాబాద్‌ సారథి స్టూడియోకి షూటింగ్స్‌ కోసం వచ్చేది. షావుకారు జానకి, అమ్మ మంచి స్నేహితులు. షూటింగ్‌ అయిపోయాక, అమ్మవాళ్లు షాపింగ్‌ చేసేవారు. లక్క పిడతలు, బట్టలు, గాజులు తీసుకువచ్చేది. వేసవి కాలంలో మల్లె పూలను, ఎంతో పొందికగా గుచ్చి చాలా అందంగా వంకీల జడ కుట్టేది. నా పుట్టినరోజు వస్తే ఇంట్లో పండగే. నాన్న హైదరాబాద్‌ నుంచి ఫ్రాక్స్‌ తెచ్చేవారు. ఆడపిల్లను చక్కగా అలంకరించి, అందంగా చూసుకోవటం నాన్నకు చాలా ఇష్టం. అందరినీ పిలిచి సెలబ్రేట్‌ చేసేవారు. బొమ్మల కొలువు పెట్టించేది. అట్ల తద్ది నోము, ఉపవాసాలు చేయించేది. పెళ్లయ్యాక వరలక్ష్మీవ్రతం చేయించింది. మా పిల్లలకు నలుగు పిండి కోసం బావంచాలు, కచ్చూరాలు తెప్పించి మర పట్టించేది. వాళ్లకి నలుగు పెట్టి స్నానం చేయించి, ఆ తరవాత అమ్మ సాన్నం చేసి, షూటింగ్‌కి రెడీ అయ్యేది. షూటింగ్‌ నుంచి రాగానే శుభ్రంగా స్నానం చేసి, మళ్లీ పిల్లల దగ్గరకు వచ్చి వారిని, మురిపెంగా చూసుకునేది. వాళ్లు కొంచెం పెద్దవాళ్లయ్యాక హైదరాబాద్‌ నుంచి ద్రాక్షపళ్లు, మామిడి పండ్లు తెచ్చేది.

ఇబ్బంది పెట్టేది కాదు...
షూటింగ్‌కి వెళ్లాలంటే తెల్లవారుజామునే లేచి, కాఫీ తాగి, అన్ని పనులు ముగించుకుని, సిద్ధంగా ఉండేది. ఒక్క రూపాయి కూడా ఎవ్వరిదీ తీసుకోలేదు. దర్శకులంటే చాలా గౌరవం. వాళ్లు చెప్పింది చేసేది. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టేది కాదు. డబ్బింగ్‌ కూడా కాల్‌షీట్‌ ప్రకారం వెళ్లి చెప్పేది. అమ్మ అప్పట్లో చాలా బిజీగా ఉండేది. అమ్మనాన్న ఇద్దరూ రాత్రి షూటింగ్స్‌కి వెళ్తుంటే బాగా ఏడ్చేసేదాన్ని. నన్ను మా పెద్దమ్మ కూతురు సుబ్బులక్క దగ్గరకు తీసుకుని ఓదార్చేది. తనే నన్ను తల్లిలా పెంచింది. నాకు జ్వరం వస్తే మాత్రం  అమ్మ నా పక్క నుంచి కదిలేది కాదు.

చాలా సాధారణంగా...
అమ్మ ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాలే ధరించేది. రెండు చేతులకు చెరో గాజు, మెడలో ఒక గొలుసు, చెవులకు దుద్దులు... అంతే. సినిమాలలో కూడా ఇలాగే ఉండేది. మేకప్‌ వేసుకునేది కాదు. ఎండల్లో షూటింగ్‌ చేయటం వల్ల ముఖం మీద చిన్న మచ్చ వచ్చింది. ఆ మచ్చకు మాత్రం రంగు వేసేది. వేలి ముడి, సాదా సీదా చీరలు ఇష్టపడేది. ఎక్కువగా మల్‌మల్‌ చీరలు, ఆర్గండీ చీరలు కట్టుకునేది. తలకు ఎన్నడూ రంగు వేసుకోలేదు. అమ్మకి పూల మొక్కలు, చెట్లు, కూరగాయ మొక్కలంటే చాలా ఇష్టం. విరజాజి పూలు, ఉసిరి, నిమ్మ, సీతాఫలం, జామ, మామిడి చెట్లు, సపోటా, పనస అన్నీ కడియం నుంచి తెప్పించింది. మొక్కలకు స్వయంగా నీళ్లు పోసేది. కుక్కలంటే చాలా ఇష్టం. చాలా కుక్కల్ని పెంచింది. కాటుక ఇంట్లోనే చేసేది అమ్మ. పుస్తకాలు బాగా చదివేది. బ్రహ్మంగారి చరిత్ర, ఈశ్వరమ్మగారి చరిత్ర చదివి మాకు వినిపించేది. తెలుగు అంటే చాలా ఇష్టం. సాటి నటీనటులు ఒత్తులు పలక్కపోతే చాలా కోపం వచ్చేది. చెన్నైలో స్కూల్‌లో తెలుగు ఉండేది కాదు. అందువల్ల మా అబ్బాయికి తెలుగు అమ్మ నేర్పటమే కాకుండా, కాకరాల గారి దగ్గర కూడా నేర్పించింది. 

నాకు కడుపులో నొప్పిగా ఉంటే, పొట్టంతా నూనె రాసేది. ఆదివారం వస్తే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలని నేర్పింది. బట్టలు కూడా బాగా సర్దుకుంటేనే కానీ ఒప్పుకునేది కాదు. వస్తువు విలువ తెలియాలనేది. అమ్మకు కోపం చాలా ఎక్కువ. క్రమశిక్షణలో తేడా వస్తే కొట్టేది. నేను సౌమ్యంగా ఉంటూ, అమ్మ చెప్పినట్లు వినేదాన్ని. పెద్దవాళ్ల దగ్గర నుంచి అమ్మ నేర్చుకున్న పనులన్నీ నాకు నేర్పింది. డిగ్రీ వరకు చదివించింది. మాస్టర్‌ వేణుగారి దగ్గర సితార్‌ నేర్పించింది. అమ్మనాన్నలు బాగా బిజీగా ఉంటూ, అష్టకష్టాలు పడ్డారు. నేను అలా కష్టపడకూడదనే ఉద్దేశంతో నన్ను గృహిణిగానే ఉంచారు. అమ్మను మించిన దైవం లేదు, ఆవిడ వల్లే నేను ఈరోజు హాయిగా ఉన్నాను. చాలామంది కళాకారుల పిల్లల జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో తెలిసిందే. నన్ను ఒక గృహిణిలా, భర్తకు భార్యగా, పిల్లలకు తల్లిగా పెంచారు. మా అమ్మాయికి లక్ష్మీ నిర్మల అని అమ్మ పేరు, అబ్బాయికి జయకృష్ణ అని నాన్న పేరు పెట్టాం. అల్లుడిని కొడుకులా చూసుకున్నారు. అమ్మానాన్నలకు మా వారే తలకొరివి పెట్టారు.

స్వాతిముత్యం సినిమాలో అమ్మ పోయిన సీన్‌ చూస్తుంటే ఇప్పటికీ ఏడుపు వస్తుంది. అని భావోద్వేగానికి లోనైంది కవిత.

సంభాషణ: వైజయంతి పురాణపండ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top