విజయ్.. విజిల్.. విజయం.. ఇప్పడంతా ఎక్కడ చూసినా ఈ మూడు పదాలే వినిపిస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి సారే సెంచరీ కొట్టిన హీరో విజయ్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్‌కు అభినందనలు తెలిపారు. మొదటిసారి పోటీ చేసిన విజయ్ ఏకంగా సీఎం రేసులో దూసుకెళ్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించనుంది.
అయితే తమిళనాడులో విజయ్ విజయాన్ని ఏపీ రాజకీయాలతో ముడిపెడుతున్నారు. విజయ్ గెలుపుతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. తొలిసారి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో(పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్) గెలుపొందారు. అంతేకాకుండా మొదటిసారే సీఎం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో జనసేనానిపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీలో వచ్చే ఎన్నికల్లోనైనా సింగిల్‌గా పోటీ చేయాలని పవన్ కల్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు. విజయ్‌లాగే సింగిల్‌గా బరిలోకి దిగాలన్న డిమాండ్ పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ గెలుపు కాస్తా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలోనూ ఎవరితోనూ పొత్తులు లేకుండా బరిలోకి దిగాలనే డిమాండ్ వస్తే జనసేనాని ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. సింగిల్‌గా పోటీ చేస్తేనే గుర్తింపు ఉంటుందని సగటు అభిమానులు, జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు.


