
నయనతార యువరాణిగా మారనున్నారు. అది కూడా బ్రిటిష్‌వారిపై పోరాడిన మొట్టమొదటి మహారాణిగా మారడానికి సిద్ధమవుతున్నారు. రాణి పేరు ‘వేలు నాచ్చియార్’. తమిళనాడులోని రామనాథపురానికి చెందిన రాణి తను. 1780 నుంచి 1790 వరకూ శివగంగై సంస్థానాన్ని పాలించారు వేలు నాచ్చియార్. ఆమె జీవితం ఆధారంగా దర్శకుడు సుశీ గణేశన్ ఓ చిత్రం తెరకెక్కించాలనుకుంటున్నారు. ఇందులో రాణి పాత్రకు నయనతారను అనుకున్నారని సమాచారం. ఈ చిత్రంలో నటించడానికి నయన కూడా పచ్చజెండా ఊపారట.
ఒకవైపు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూ, మరోవైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు నయనతార. కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించే నయనతార ‘శ్రీరామరాజ్యం’లో సీతగా మెప్పించారు. ‘సైరా’లో స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సతీమణి సిద్ధమ్మ పాత్రకు చక్కగా సరిపోయారు. అందుకే ‘వేలు నాచ్చియార్’కి నయనతార యాప్ట్ అని సుశీ గణేశన్ అనుకుని ఉంటారు. వేలు నాచ్చియార్‌కి యుద్ధ విద్యల్లో మంచి నైపుణ్యం ఉంది. గుర్రపు స్వారీ, విలు విద్య, కర్ర సాము వంటివన్నీ తెలుసు. ఆమె పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి నయనతార ఈ విద్యలన్నీ నేర్చుకుంటారని ఊహించవచ్చు.