
నటి నయనతార తన కుటుంబంతో పాటు పళని మురుగన్‌ను దర్శించుకున్నారు. అక్కడ ఆమె ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉన్న పళనిస్వామి గుడికి కోలీవుడ్ హీరోలు ఎక్కువగా వెళ్తుంటారు. హీరో ధనుష్ ఎక్కువగా వెళ్లడం చూస్తుంటాం. శివకార్తికేయన్, విజయ్‌సేతుపతి, కార్తి వంటి స్టార్స్ ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు. చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
నయనతార తన భర్త విగ్నేష్, పిల్లలతో కలిసి తిరుమల, శ్రీకాళహస్తి వంటి ఆలయాలకు తరుచూ వెళ్తుంటుంది. అయితే, తాజాగా ఆమె పళని మురుగన్ (సుబ్రహ్మణ్యేశ్వరుడి )ని దర్శించుకుంది. ప్రత్యేకపూజలు అనంతరం సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వారు కనిపించారు. ఫోటోలు షోషల్‌మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షేర్ చేస్తున్నారు.

ఆలయ ప్రత్యేకత
దేశంలోని ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలిచినదే. కానీ ఇక్కడి స్వామి మూర్తిని తొమ్మిది రకాల విష పదార్థాలతో భోగర్ అనే సిద్ధుడు తయారుచేశాడట. అందుకే దీన్ని నవ పాషాణం అంటారు. గర్భగుడిలోని స్వామి పదేళ్ల బాలుడిగా చేతిలో దండం పట్టుకుని కౌపీనధారిగా దర్శనమిస్తాడు. ఈ విగ్రహం క్రీ.పూ.మూడువేల సంవత్సరాలనాటిదని చెబుతుంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరు దివ్య క్షేత్రాల్లో ఇది మూడోది కావడం విశేషం. ఇక్కడ ప్రసాదంగా ఇచ్చే పంచామృత చాలా ప్రత్యేకం. ఈ క్షేత్రాన్ని దర్శించినవారికి జ్ఞానం సిద్ధిస్తుందనీ అలా శివుడు వరమిచ్చినట్లు అక్కడి భక్తులు చెబుతారు. సంతానప్రాప్తి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు ఎక్కువగా ఈ ఆలయాన్ని సందర్శిస్తారని స్థల పురాణం ఉంది.