
కర్ణాటకు చెందిన షఫీక్ సయ్యద్.. బెంగుళూరు మురికివాడలో జన్మించాడు. చిన్నతనంలోనే పెద్ద పెద్ద కలలు కన్నాడు. ఏదోరోజు అమితాబ్ బచ్చన్ అంతటి స్టార్ కావాలని కోరిక పెంచుకున్నాడు. సినిమాపై మక్కువతో కేవలం 12ఏళ్ల వయసులో ఒంటరిగానే ముంబై రైలు ఎక్కాడు. అనుకున్నట్లుగానే సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. తొలి సినిమాతోనే ఉత్తమ బాల నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకుని దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయాడు. ఆప్పుడు తన ఆశలకు జీవం వచ్చింది. ఇక గొప్ప స్టార్ అయిపోతానని నిర్ణయించుకున్నాడు. కానీ, తర్వాత ఛాన్సులు రాలేదు. అదే వచ్చింటే ఒక అమితాబ్, చిరంజీవిలా ఇండస్ట్రీని ఏలేవాడేమో చెప్పలేము కదా..!

1988లో విడుదలైన 'సలాం బాంబే' సినిమా ఒక సంచలనం. ఎక్కడ చూసిన షఫీక్ సయ్యద్ పోస్టర్స్‌తోనే సినిమా టైటిల్ కనిపించేది. ఈ చిత్రాన్ని మీరా నాయర్ దర్శకత్వం వహించడమే కాకుండా ఆమె నిర్మాతగా ఉన్నారు. ముంబైలోని మురికివాడల్లో నివసించే పిల్లల దైనందిన జీవితాలను ఈ చిత్రంలో చూపించారు. ఆ ఏడాదిలో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డ్‌ను అందుకోవడంతో పాటు ఉత్తమ బాల నటుడిగా షఫీక్ సయ్యద్ కూడా అవార్డ్ దక్కించుకున్నాడు. ఆపై సలాం బాంబే మూవీ ఆస్కార్ అవార్డ్‌కు కూడా నామినేట్ అయింది. భారత్ నుంచి అలా ఎంపికైన రెండో చిత్రంగా రికార్డ్ పొందింది. లెక్కలేనన్ని అంతర్జాతీయ అవార్డ్స్‌ను ఈ చిత్రం అందుకుంది. వీటన్నింటికీ కారణం సలాం బాంబేలో షఫీక్ సయ్యద్ నటనే అని అప్పట్లో చెప్పుకునేవారు.

'షఫీక్ సయ్యద్' ఎందుకు ఆటో నడుపుతున్నాడు
'సలాం బాంబే' సినిమా వల్లే షఫీక్ సయ్యద్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఏదైనా పార్టీలో అతను కనిపిస్తే చాలు పెద్దపెద్ద వారు కూడా పోటోలు దిగేందుకు పోటీపడేవారు. దీనిని బాలీవుడ్ మేకర్స్ జీర్జించుకోలేకపోయారు. తమ పిల్లలకు దక్కిని గౌరం ఇతనికి ఇంతలా రావడం ఏంటి అనే అక్కసు వారిలో మొదలైంది. అంతే, షఫీక్ సయ్యద్‌కు ఛాన్సులు ఆగిపోయాయి. ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సయ్యద్.. రెండో సినిమా ఛాన్సు కోసం ఐదేళ్లు పోరాడాడు. ఆకలితోనే అక్కడి సినిమా ఆఫీసుల చుట్టు తిరిగాడు.
అలా 1993లో పతంగ్ అనే సినిమాలో నటించాడు. ఆ తర్వాత అతనికి ఎవరు కూడా ఛాన్సులు ఇవ్వలేదు. దీంతో తిరిగి బెంగళూరు వచ్చేశాడు. కుటుంబానికి ఆర్థికంగా నిలబడేందుకు ఏదో చిన్నచిన్న పనులు చేసుకునేవాడు. ప్రస్తుతం తన జీవనోపాధి కోసం బెంగళూరులోనే ఆటో నడుపుతున్నాడు. భార్య, తల్లి, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. అప్పుడప్పుడు కొన్ని టీవీ ప్రోగ్రామ్‌లలో గెస్ట్‌గా పిలుస్తుంటారని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.