
నందమూరి బాలకృష్ణ ఏపీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఎప్పుడూ ఫుల్ లెన్త్ సినిమాలు చేసే బాలయ్య తొలిసారి రజనీకాంత్ ‘జైలర్ 2’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనువిందు చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. సన్‌పిక్చర్స్ సంస్థ కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. 2023లో విడుదలైన జైలర్‌లో అతిథి పాత్రలు పోషించిన శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్‌ల పర్ఫామెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఇందులో కూడా వారందరూ నటించనున్నారు. ప్రస్తుతం వారి సరసన టాలీవుడ్ నుంచి బాలకృష్ణ చేరనున్నట్లు సమాచారం.
రజనీకాంత్ కోసం జైలర్2లో నటించేందుకు బాలకృష్ణ ఒప్పుకున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ సంప్రదింపులు కూడా చేసిందని సమాచారం. ఈ చిత్రంలో బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తారని సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో పోలీస్ ఆఫీసర్‌గా రౌడీ ఇన్‌స్పెక్టర్, లక్ష్మీ నరసింహా వంటి సినిమాల్లో ఆయన మెప్పించారు. ఇప్పుడు చాలారోజుల తర్వాత జైలర్2 కోసం పోలీస్ యూనిఫామ్ ధరించనున్నారు. రజనీకాంత్, బాలయ్య మధ్య భారీ ఎలివేషన్ ఇచ్చే సీన్ ఉందని, అదికూడా సుమారు 5నిమిషాల పాటు ఉండనుందని తెలుస్తోంది.

జైలర్2తో తాను నటించబోతున్నట్లు రీసెంట్‌గా శివరాజ్‌కుమార్ ఫైనల్ చేశారు. ఇందులో రమ్యకృష్ణ, మిర్నా మేనన్, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సీక్వెల్‌లో కన్నడ భామ శ్రీనిధి శెట్టి నటించనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది డిసెంబర్‌లో జైలర్2 విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు.