విషాదంగా ముగిసిన దర్శకుడి మిస్సింగ్‌ మిస్టరీ! | Missing Gujarati Filmmaker Mahesh Jirawala Lost Life At Ahmedabad Plane Crash Place, Read Full Story | Sakshi
Sakshi News home page

విషాదంగా ముగిసిన డైరెక్టర్‌ మిస్సింగ్‌ మిస్టరీ.. విమాన ప్రమాదంలో మృతి!

Jun 21 2025 1:09 PM | Updated on Jun 21 2025 2:15 PM

Missing Gujarati Filmmaker Mahesh Jirawala Lost Life

మ్యూజిక్ ఆల్బ‌మ్స్ డైరెక్ట‌ర్, గుజరాతీ సినీ దర్శకుడు మ‌హేష్ జీరావాలా(Mahesh Jirawala ) మిస్సింగ్‌ మిస్టరీ విషాదంగా ముగిసింది. ఆహ్మదాబాద్‌బాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. అతని మృతదేహాన్ని డీఎన్‌ఏ పరీక్ష ద్వారా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద స్థలంలో దొరికిన యాక్టివా స్కూటర్‌, ఫోన్ కూడా అతన్ని గుర్తింపుని నిర్ధారించడంలో ఉపయోగపడ్డాయి.

అసలేం జరిగింది?
అహ్మదాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో జూన్‌ 12న లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టేకాప్‌ అయిన కాసేపటికే ఆ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 270 మందికి పైగా మృతి చెందారు. డీఎన్‌ఏ ద్వారా మృతదేహాలను గుర్తించారు. అయితే ఈ ప్రమాదం జరిగిన రోజు నుంచి దర్శకుడు మహేశ్‌ జీరావాలా కనిపించకుండా పోయారు. ఆ రోజు ఎయిర్‌ పోర్ట్‌ సమీపంలో ఒకరిని కలిసేందుకు వెళ్లాడని అతని భార్య హేతల్‌ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో అతని ఫోన్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అతని మృతదేహం మాత్రం లభించలేదు. దీంతో ఇన్నాళ్ల పాటు అతని మిస్సింగ్‌ మిస్టరీ వీడలేదు.

డీఎన్‌ఏ ద్వారా గుర్తింపు..
విమాన ప్రమాదంలోనే మహేశ్‌ జీరావాలా  మృతి చెంది ఉంటారాని తొలుత పోలీసులు భావించారు. అక్కడ లభించిన మొబైల్‌, యాక్టివా బండి ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించి, మృతదేహాన్ని అప్పగించే ప్రయత్నం చేశారు. కానీ మహేశ్‌ కుటుంబ సభ్యులు మాత్రం అందుకు అంగీకరించలేదు. ఆయన ఎయిర్‌పోర్ట్‌కు రాకపోవచ్చని, ఆ మృతదేహం అతనిది కాదని వాదించారు. దీంతో కుటుంబ సభ్యుల నుంచి డీఎన్‌ఏ సేకరించి, మృతదేహం డీఎన్‌ఏతో పోల్చి చూశారు. డీఎన్‌ఏ రిపోర్ట్‌.. ఆ మృతదేహం మహేశ్‌దే అని నిర్ధారించడంతో మిస్సింగ్‌ మిస్టరీ విషాదంగా ముగిసింది.

మహేష్ జీరావాలా విషయానికొస్తే.. గుజరాత్‌లోని నరోదాకు చెందిన ఈయన అస‌లు పేరు మ‌హేష్ క‌ల‌వాడియా. మ్యూజిక్ ఆల్బ‌మ్స్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆయ‌న ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. నిర్మాతగాను వ్యవహరించాడు. 2019లో ఆయన కాక్‌టెయిల్ ప్రేమి పాగ్ ఆఫ్ రివెంజ్‌ అనే గుజరాతీ సినిమాకు దర్శకత్వం వహించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement