'Mem Famous' Movie Review And Rating In Telugu - Sakshi
Sakshi News home page

Mem Famous Movie Review: ‘మేమ్‌ ఫేమస్‌’ మూవీ రివ్యూ

Published Fri, May 26 2023 8:57 AM

Mem Famous Movie Review And Rating - Sakshi

టైటిల్‌: మేమ్‌ ఫేమస్‌
నటీనటులు: సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, అంజి మామ, మురళీధర్ గౌడ్ తదితరులు 
నిర్మాణ సంస్థలు:  లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్
 నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్
రచన- దర్శకత్వం: సుమంత్ ప్రభాస్
సంగీతం: కళ్యాణ్‌ నాయక్‌
సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ 
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
విడుదల తేది: మే 26, 2023

‘మేమ్‌ ఫేమస్‌ కథేంటంటే..
బండ నర్సంపల్లి గ్రామానికి చెందిన మహేశ్‌ అలియాస్‌ మయి(సుమంత్‌ ప్రభాస్‌), బాలి(మౌర్య), దుర్గ(మణి ఏగుర్ల) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఊరంతా బలాదూరుగా తిరుగుతూ ఊరి జనాలతో ‘తూ’ అనిపించుకుంటారు. ఆ ఊరి సర్పంచ్‌ వేణు(కిరణ్‌ మచ్చా), ట్రాక్టర్‌ డ్రైవర్‌ అంజిమామ(అంజి మామ మిల్కూరి) మాత్రం ఈ ముగ్గురికి మద్దతుగా ఉంటారు. ఇక మయి తన మేనమామ(మురళీధర్‌ గౌడ్‌) కూతురు మౌనిక(సిరి)ని ప్రేమిస్తాడు.

అలాగే చిన్నప్పటి స్నేహితులు బబ్బీ(సిరి), బాలీలు కూడా ప్రేమలో ఉంటారు. ఊర్లో జరిగిన ఓ సంఘటన వల్ల తాము కూడా పని చేసి అందరితో శభాష్‌ అనిపించుకోవాలనుకుంటారు. దాని కోసం ఓ టెంట్‌ హౌస్‌ని ఏర్పాటు చేయాలనుకుంటారు.  సర్పంచ్‌ వేణు సపోర్ట్‌తో టెంట్‌హౌస్‌ ఏర్పాటు చేసి దానికి ‘ఫేమస్‌ టెంట్‌ హౌస్‌’ అని పేరు పెడతారు. ఆ తర్వాత వీళ్లకు ఎదురైన సమస్యలు ఏంటి?  మరదలు మౌనికతో మయి ప్రేమాయణం  ఎలా సాగింది? ఫేమస్‌ యూట్యూబ్‌ చానల్‌ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ చానల్‌ ద్వారా ఊరికి ఎలాంటి మేలు జరిగింది? ఆవారాగా తిరిగే ఆ ముగ్గురు ఎలా ఫేమస్‌ అయ్యారు? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే.. 
తెలంగాణలోని ఓ పల్లెటూరిలో ఆవారాగా తిరిగే ముగ్గురు యువకుల కథే ‘మేమ్‌ ఫేమస్‌’ సినిమా. కామెడీ, ఎమోషనల్‌, సందేశం.. ఇవన్నీ తన కథలో ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు సుమంత్‌ ప్రభాస్‌. యువతను నిరుత్సాహపరచకుండా వారిలోని టాలెంట్‌ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారనే సందేశాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాడు. సినిమాలో ఎక్కడా నాటకీయతా సన్నివేశాలు కనిపించావు. రియ‌లిస్టిక్ అప్రోచ్ లో క‌థా, క‌థ‌నాలు సాగుతాయి.

సినిమాలోని ప్రతి పాత్ర మన ఊర్లో చూసే వ్యక్తులను పోలి ఉంటాయి. డైలాగ్స్‌ కూడా చాలా సహజంగా ఉన్నాయి. అయితే కథలో కొత్తదనం మాత్రం లేదనే చెప్పాలి. పనీపాట లేకుండా తిరిగే ముగ్గురు స్నేహితులు చేసే చిల్లర పనులు..  దానివల్ల పుట్టే కామెడీ సన్నివేశాలను చూస్తే కొన్ని పాత సినిమాలు కచ్చితంగా గుర్తుకు వస్తాయి. 

ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలకు గ్రామీణ యువకులు కనెక్ట్‌ అవుతారు. క్రికెట్‌ గొడవలు.. దావత్‌ కోసం కోళ్లను కొట్టేయడం.. ఇంజన్‌తో సహా అన్ని పాడైన బైక్‌ని వేసుకొని ఊరంతా తిరగడం లాంటి సీన్స్‌ నవ్వులు పూయిస్తాయి. అదే సమయంలో కొన్ని సన్నివేశాలను కావాలనే ఇరికించినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ సీన్‌ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. సెకండాఫ్‌ ఎక్కువగా యూట్యూబ్‌ చానల్‌ చుట్టే సాగుతుంది.

యూట్యూబ్‌ వ్యూస్‌ కోసం పడే కష్టాలు కొన్ని చోట్ల నవ్విస్తే.. మరికొన్ని చోట్ల బోర్‌ కొట్టిస్తాయి. లిపిస్టిక్ ఎపిసోడ్ అయితే అందరిని ఆకట్టుకుంటుంది. మౌనిక బర్త్‌డేకి సంబంధించిన సీన్‌, గోరేటి వెంకన్న పాట సినిమాకు ప్లస్‌ అయ్యాయి. లాజిక్స్‌ వెతక్కుండా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ కోసం వెళ్లే వాళ్లకు ‘మేమ్‌ ఫేమస్‌’ నచ్చుతుంది.

ఎవరెలా చేశారంటే..
సినిమాలో ఒకరిద్దరు మినహా మిగతావారంతా కొత్త వాళ్లే. ఆ విషయం తెరపై ఎక్కడా కనిపించదు. అంత చక్కగా నటించారు. ఇక ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు హీరోగా నటించిన సుమంత్‌ ప్రభాస్‌ టాలెంట్‌ని అభినందించాల్సిందే. దర్శకత్వానికే కాదు నటుడిగా కూడా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక హీరో స్నేహితులుగా దుర్గ, బాలీగా నటించిన మౌర్య, మణిలు కూడా చాలా సహజంగా నటించారు. మ‌ర‌ద‌లు మౌనికగా సార్య ల‌క్ష్మ‌ణ్‌, సిటీ నుంచి అమ్మమ్మ వాళ్ల ఇంటికొచ్చిన యువతి బ‌బ్బీగా సిరా రాశి తమ పాత్రలకు న్యాయం చేశారు. అంజిమామ‌, ముర‌ళీధ‌ర్‌గౌడ్‌ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కల్యాణ్ నాయక్ అందించిన సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగా వస్తాయే తప్ప ఎక్కడా ఇరికించినట్లు అనిపించవు. నేపథ్య సంగీతం కూడా బాగుంది. గోరేటి వెంకన్న ‘గల్లీ చిన్నది’పాట స్పెషల్‌ అట్రాక్షన్‌. శ్యామ్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను చక్కగా తెరపై చూపించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. చాయ్‌ బిస్కెట్‌,లహిరి ఫిలింస్‌ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నంతంగా ఉన్నాయి.

Rating:
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement