
ధమాకా సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు దర్శకుడు త్రినాధరావు నక్కిన (Trinadh Rao Nakkina). తాజాగా ఈయన దర్శకత్వం వహిస్తున్న మూవీ మజాకా (Mazaka Movie). సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేశ్, అన్షు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ సినిమా ఈవెంట్స్‌లో త్రినాధ రావు మన్మథుడు హీరోయిన్ అన్షు గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. దీంతో అతడు క్షమాపణలు చెప్పాడు.
ఎలాంటి శిక్ష వేసినా ఓకే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదం గురించి త్రినాధరావు మాట్లాడుతూ.. నేను కావాలని అన్షుపై అలాంటి కామెంట్స్ చేయలేదు. ఏదో సరదా చేద్దామనుకోబోయి అనుకోకుండా నోరు జారాను. తప్పు సరిదిద్దుకునేలోపే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. తర్వాత అందరికీ క్షమాపణలు చెప్పాను. నేను దురుద్దేశంతో అలాంటి మాటలు మాట్లాడితే ఎలాంటి శిక్ష వేసినా అనుభవిస్తాను. అప్పటికీ నోరు జారి తప్పు చేశానని ఫీలయ్యాను. అందుకే అన్షుతో పాటు అందరికీ సారీ చెప్పాను. అప్పటికే అన్షుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తనకు ఫోన్ చేసి విషయం మొత్తాన్ని వివరించా. తను అర్థం చేసుకుంది.
అమ్మను చూసి భయమేసింది
ఈ వివాదం జరిగినప్పుడు నాకంటే మా అమ్మ ఎక్కువ బాధపడింది. ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నువ్వు ఎందుకు నాన్నా నోరు జారావు? అందరూ ఎలా విమర్శిస్తున్నారో చూశావా? ఒక్క పదం నిన్ను దుర్మార్గుడిని చేసింది. నువ్వు నిజంగా దుర్మార్గుడివా? కాదని ఎంతమంది దగ్గరకు వెళ్లి చెప్పగలం? ఇకమీదట స్టేజీ ఎక్కినప్పుడు ఆచితూచి మాట్లాడమని చెప్పింది. అమ్మ వారం రోజులు డీలా పడిపోయింది. తననలా చూసి భయమేసింది. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నా అన్నాడు త్రినాధరావు.
చదవండి: కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో నటుడు