
సినీ నటిగా, యాంకర్‌గా మందిరా బేడీ (Mandira Bedi) అందరికీ సుపరిచితురాలు. క్రికెట్ ఈవెంట్స్‌కు కూడా ఈమె వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అయితే ఆ సమయంలో ఎవరూ తనను లెక్క చేయలేదని, చులకనగా చూశారంటోంది నటి. జూమ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మందిరా బేడీ మాట్లాడుతూ.. ఏదైనా డిఫరెంట్‌గా చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అందరూ మనల్నే పరిశీలిస్తుంటారు. ఏదో ఒకటి అనేందుకు సిద్ధంగా ఉంటారు. అది వారి అభిప్రాయం అనుకోండి.
మొదటివారమే డిజాస్టర్
కొందరు మనల్ని ఇష్టపడతారు. మరికొందరేమో ద్వేషిస్తారు. అయితే నాకు టీమ్ నుంచి మంచి ఎంకరేజ్‌మెంట్ ఉండేది. అలా మొదటిసారి ఒక టోర్నమెంట్‌లో హోస్టింగ్ చేశాను. కానీ మొదటివారమే డిజాస్టర్ అయింది. మా టీమ్ నన్ను పిలిచి నీమీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాము. నువ్వేం భయపడకు. వెయ్యిమంది అమ్మాయిల్ని ఆడిషన్ చేశాకే నిన్ను తీసుకున్నాం. నీలో ఆ సత్తా ఉంది అని ప్రోత్సహించారు.

మైండ్‌సెట్ మార్చా..
ఆ మాటలు నాకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. ఇంత మంచి అవకాశం ఎవరికి దక్కుతుంది? భయపడి వెనకడుగు వేయడం దేనికి? అని ఆలోచించాను. ఉత్సాహంగా ముందుకు సాగాను. నెమ్మదిగా ప్యానెల్‌లో, ప్రేక్షకుల్లో నాపై ఉన్న అభిప్రాయాలు మారాయి. చాలామంది మైండ్‌సెట్‌ను నేను మార్చగలిగాను. నిజానికి ప్యానెల్‌లో ఉన్న వారికి నేనుండటమే ఇష్టం లేదు. నాకు కాస్తైనా మర్యాద ఇచ్చేవారు కాదు. చీప్‌గా చూసేవారు, పక్కన పడేసేవారు.
డమ్మీ అని తిట్టారు
మొదట్లో బాధపడ్డాను. కానీ నేనెందుకు తలదించుకోవాలనుకున్నాను. వాళ్లు వినిపించుకోకపోయినా ఒకటికి రెండుసార్లు ప్రశ్నలు అడిగేదాన్ని. కెమెరాలున్నాయి కాబట్టి వాళ్లు చచ్చినట్లు సమాధానం చెప్పేవాళ్లు. ఈమె తిరిగి వెళ్లిపోయేలా లేదని వాళ్లకర్థమైంది. చివరకు నన్ను ప్యానెల్‌లో మెంబర్‌గా స్వీకరించారు. సోషల్ మీడియాలో కూడా నేనో తెలివితక్కువదాన్ని, డమ్మీ అని తిట్టేవారు. నేనేదీ లెక్కచేయలేదు.
యాంకర్‌గా, నటిగా..
ఇక సౌతాఫ్రికా టోర్నమెంట్ నుంచి తిరిగి రాగానే నా ఇంటర్వ్యూల కోసం ఎగబడ్డారు. జనాలు నా గురించి తెలుసుకోవాలని ఆరాటపడ్డారు. అలా రోజుకు నాలుగైదు ఇంటర్వ్యూలు ఇచ్చాను అని చెప్పుకొచ్చింది. పలు హిందీ సీరియల్స్‌లో యాక్ట్ చేసిన మందిరా.. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ (2003, 2007), ఛాంపియన్స్ ట్రోఫీ (2004, 2006)లకు హోస్టింగ్ చేసింది. మన్మథుడు, సాహో వంటి చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. చివరగా ఐడెంటిటీ అనే మలయాళ చిత్రంలో నటించింది.
చదవండి: నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్