సైనికుడు సాయితేజ కుటుంబానికి అండగా మంచు కుటుంబం

Manchu Vishnu Supports to Chittoor Soldier Saiteja Family - Sakshi

సాక్షి, చిత్తూరు: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన చిత్తూరుకు చెందిన సైనికుడు సాయి తేజ్ కుటుంబానికి  మంచు మోహన్‌ బాబు కుటుంబం అండగా నిలిచింది. లాన్స్‌ నాయక్‌ సాయి తేజ ఇద్దరు పిల్లలను ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని హీరో మంచు విష్ణు వెల్లడించారు. త్వరలోనే చిత్తూరుకు వచ్చి సాయి తేజ కుటుంబాన్ని కలుస్తానని పేర్కొన్నారు. కాగా సాయితేజ అంత్యక్రియలు శుక్రవారం చిత్తూరు జిల్లా రేగడిపల్లిలో నిర్వహించనున్నారు.

కాగా తమిళనాడు కూనూర్‌ సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్‌(చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) జనరల్‌ బిపిన్‌ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో ఎంఐ– 17వీహెచ్‌ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైందని, దీంతో అందులో ప్రయాణిస్తున్న 13మంది మరణించారని, ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారని వైమానిక శాఖ ప్రకటించింది.

ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్‌ నాయక్‌ సాయితేజ కూడా మరణించారు. ఊహించిన ఈ ఘటనతో సాయితేజ స్వస్థలం కురబలకోట మండలం ఎగువరేడ గ్రామం షాక్‌కు గురైంది. సాయితేజకు 2016లో శ్యామలతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు మోక్షజ్జా(5) పాప దర్శిని (2) సంతానం.

సాయితేజ కుటుంబానికి మంచు విష్ణుపరామర్శ
విధి నిర్వహణలో మృతి చెందిన జవాను సాయితేజ కుటుంబ సభ్యులను ' మా ' అధ్యక్షుడు  శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సీఈఓ మంచు విష్ణు  పరామర్శించారు.  మదనపల్లిలోని ఎస్‌బీఐ కాలనీలో ఉంటున్న సాయితేజ సతీమణి శ్యామలకు ఫోన్ చేసి మాట్లాడారు . యుక్త వయస్సులోనే దేశ భద్రతను రక్షించే అత్యంత గొప్పదైన సీడీఎస్ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా ఉన్న సాయితేజ అకాల మరణం పొందడం పట్ల ఆయన విచారకరం వ్యక్తం చేశారు 10 రోజుల్లో మదనపల్లికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడుతానని ఆయన శ్యామలకు తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top