తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు మంచు మోహన్‌బాబు. ఆయన స్వర్ణోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆయన తనయుడు విష్ణు మంచు ఈ నెల 22న ‘ఎమ్‌బీ50– ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ‘‘నాన్నగారు(మోహన్ బాబు) ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఐదు దశాబ్దాలుగా ఆయన ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. శక్తివంతమైన నటన, ఐకానిక్ డైలాగ్ డెలివరీ, తెరపై చూపించిన ప్రతిభ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంటుంది.
600కి పైగా చిత్రాల్లో నటించారంటే ఆయన బహుముఖ ప్రజ్ఞ, క్రమశిక్షణ, కళ పట్ల అంకితభావాన్ని చాటుతాయి. కేవలం సినీ విజయాలే కాకుండా కళ, విద్య, దాతృత్వం పట్ల ఆయన చూపిన నిబద్ధత కూడా గొప్పది. ఎలాంటి సినిమా నేపథ్యం లేకపోయినా సినీ ప్రయాణం మొదలు పెట్టి.. తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుని, విలక్షణ నటుడిగా ఎదిగిన ఈ ప్రయాణం గురించి మరోసారి చాటి చెప్పబోతున్నాం. ‘ఎమ్‌బీ50– ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా అందరికీ గుర్తుండిపోయేలా ఈ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని విష్ణు మంచు తెలిపారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
